ఇంజనీరింగ్‌ బేసిక్‌ డిసిప్లిన్స్‌

ABN , First Publish Date - 2020-10-08T18:26:13+05:30 IST

ఇంజనీరింగ్‌ కోర్సులకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులతో ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ నిత్యనూతనంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో కోర్సుకు డిమాండ్‌ కనిపిస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో

ఇంజనీరింగ్‌ బేసిక్‌ డిసిప్లిన్స్‌

ఇంజనీరింగ్‌ కోర్సులకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులతో ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ నిత్యనూతనంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో కోర్సుకు డిమాండ్‌ కనిపిస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో కనిపిస్తున్న లేదా ఆవిర్భవిస్తున్న అనేకానేక బ్రాంచ్‌లకు మూలపుటమ్మలు సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌.  ఎన్నటికీ వన్నె తగ్గని డొమైన్‌లు కూడా ఇవే. కన్‌స్ట్రక్షన్‌, ఆర్కిటెక్చర్‌కు మాతృక సివిల్‌ ఇంజనీరింగ్‌. ఆటోమొబైల్‌ వంటి వాటికి మెకానికల్‌; పవర్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఐటి తదితరాలకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ మూలం.  నిజానికి డిమాండ్‌తో సంబంధం లేకుండా నిత్యనూతనంగా వెలుగులు పంచేవే బేసిక్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టులు. ఆ మూడింటిపై సమగ్ర అవగాహనకు ఉద్దేశించిందే ఈ వ్యాసం. 


సివిల్‌

ఒక దేశం అభివృద్ధి చెందుతోందని భావించడానికి కొన్ని సూచికలు ఉంటాయి. అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. విద్య స్థాయి, జీవన ప్రమాణాలు, రవాణా సదుపాయం తదితరాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు పట్టే కాలం కూడా ముఖ్యమే. అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున నూరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా రోడ్లు ఉంటాయి. అదే మన దేశంలో మెజారిటీ రోడ్లపై అంత వేగంతో వెళ్ళలేం. స్వర్ణ చతుర్భుజి తరవాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వివిధ పథకాల కింద జాతీయ రహదారులను మరింతగా విస్తరించే ప్రయత్నం ఈ మిలీనియం మొదట్లో ఆరంభమైంది. బిఓటి (బిల్ట్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో జాతీయ రహదారులు, రింగు రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాయి. ఒక్కో ప్రాజెక్టు నిర్మించాలంటే పెద్ద ఎత్తున సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మౌలిక సదుపాయాలు అవసరం రోడ్లు, ప్రాజెక్టులు, భవంతుల నిర్మాణంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ కీలకం. ఒకరకంగా ఇది చాలా పురాతన డిసిప్లెయిన్‌. 


భవన నిర్మాణం, రహదారి, రైల్వే ట్రాక్‌, వంతెన... ఇలా ఏది తీసుకున్నా కంటికి కనిపిస్తుంది. పురాతన భవన నిర్మాణాలు మొదలుకుని ఆధునిక కట్టడాల వరకు వాటిలో ఇమిడి ఉన్న శాస్త్రీయ అంశాలన్నీ కలగలిపితే అదే సివిల్‌ ఇంజనీరింగ్‌. మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న చోటే అభివృద్ధి త్వరితగతిన సాగుతుంది. మౌలిక వసతుల అభివృద్ధి ఊపందుకున్న నేపథ్యంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన అభ్యర్థులకు ఉపాధి విషయమై ఎలాంటి ఇబ్బంది ఉండబోదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. కొన్ని పెద్ద సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా పీజీ కోర్సులను ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్‌ సంస్థలతో కలిసి నిర్వహిస్తున్నాయి. మరికొన్ని స్కాలర్‌షిప్‌ అందించి సహకరిస్తుంటాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి వస్తున్న గ్రాడ్యుయేట్లకు కనీసం మూడు ఆఫర్లు ఉంటున్నాయన్నది సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్న మాటే.  


సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తార్కిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగానే ఐటి రంగం కూడా ఎప్పటినుంచో ముందుకు వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రభుత్వేతర సంస్థల్లో వీరికి ఉపాధి లభిస్తోంది. కోర్సులో భాగంగా స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ (అనాలిసిస్‌, డిజైన్‌), ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీరింగ్‌ (నీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలుష్యం), జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ (సాయిల్‌ మెకానిక్స్‌, ఫౌండేషన్‌ ఇంజనీరింగ్‌), ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ (వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్‌ - భూగర్భ - ఉపరితల జలవనరులు) హైడ్రాలిక్‌ ఇంజనీరింగ్‌ / ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ (సర్క్యూట్స్‌, ఒత్తిడి, పంపింగ్‌ స్టేషన్లు), ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ (ట్రాఫిక్‌ ప్లానింగ్‌, ప్లయ్‌ ఓవర్లు, రహదారుల డిజైన్‌, హైవే సంబంధిత మెకనైజేషన్‌) అంశాలను చదవాల్సి ఉంటుంది. 


ఉద్యోగ అవకాశాలు

వివిధ జలవనరుల ప్రాజెక్టులు, రహదారులు, భవంతుల నిర్మాణం ఊపందుకున్న దరిమిలా సివిల్‌ ఇంజనీర్లకు ఉపాధికి సంబంధించి సమస్యే లేదు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌, టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్‌, ఎల్‌ అండ్‌ టి, రామ్‌కీ తదితర సంస్థలు యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలకు వచ్చి విద్యార్థులను నేరుగా తీసుకుంటున్నాయి. నైపుణ్యం పెరిగితే కన్సల్టెంట్లుగానూ రాణించవచ్చు. 


ఇలాంటి కాలేజీ ఎంపిక చేసుకోండి

ప్రతి పదిహేను మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అన్నది  ఇంజనీరింగ్‌ కాలేజీలకు సంబంధించిన నిబంధన. ఇది ఏ డిసిప్లిన్‌కైనా వర్తిస్తుంది. నాలుగే కోర్సులను నడిపే సంస్థల్లో కనీసం ఇద్దరు ప్రొఫెసర్లు, అయిదుగురు వరకు అసోసియేట్‌, ఎనిమిది మంది వరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉన్న కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. లేబ్‌ విషయానికి వస్తే, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, స్ర్టెంథ్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, కాంక్రీట్‌ టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి లేబ్‌లో ఉండాలి. సర్వేలేబ్‌లో టోటల్‌ స్టేషన్‌ ఉండాలి. ఇంకా బాగా చెప్పాలంటే అంతకు ముందు చదివిన విద్యార్థులు చేసిన నమూనాలు అక్కడ కనిపించాలి. అవి ఒక్కటి చాలు, అక్కడ ప్రాక్టికల్స్‌ జరుగుతున్నాయని తేల్చుకోవచ్చు.


మెకానికల్‌

పారిశ్రామికాభివృద్ధికి యంత్రాలే కీలకం. ముడి పదార్థాలు వస్తురూపం సంతరించుకోడానికి యంత్రాలు తోడ్పడతాయి. ఆ యంత్రాల తయారీ నుంచి అవి పనిచేయడం వరకు యావత్తు వ్యవహారం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరిధిలోకి వస్తుంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌ మాదిరిగానే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కూడా ప్రాచీనమైనదే. అభివృద్ధి ఫలితంగా నూతన యంత్రాలను, వాటి సహాయంతో ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని చూడగలుగుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాల్టి అధునాతన సదుపాయాలన్నింటికీ మూలం మెకానికల్‌ ఇంజనీరింగ్‌.


కోర్సు ప్రాధాన్యం

కోర్‌ సబ్జెక్టుగా ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఉంది.  పారిశ్రామిక ప్రగతికి ఆటంకం కలుగనంత కాలం దీని ఉనికికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ కోర్సులో భాగంగా మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జీ, మెషీన్‌ డ్రాయింగ్‌, థెర్మో డైనమిక్స్‌, థెర్మో సైన్సెస్‌, మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌, మెషీన్‌ డిజైన్‌, అప్లయిడ్‌ థెర్మో డైనమిక్స్‌, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌, మెటల్‌ కటింగ్‌ తదితరాలు ఉంటాయి. నాలుగో ఏడాదిలో కోర్‌ అంశాలకు తోడు రెండు ఎలక్టివ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనైట్‌ ఎలిమెంట్‌ అనాల్సిస్‌, గేస్‌ డైనమిక్స్‌, ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌ వంటి కోర్‌ సబ్జెక్టులతో ఉన్న అనుబంధం మేరకు గల అంశాలనూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 


ఎలాంటి కాలేజీ...

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ను అందిస్తున్న  కాలేజీలోని  సంబంధిత విభాగంలో కనీసం అయిదుగురు ప్రొఫెసర్లు, ఎనిమిది నుంచి పన్నెండు మంది వరకు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఆరు నుంచి ఎనిమిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. అన్నింటికీ మించి సకల సదుపాయాలతో కూడిన వర్క్‌షాప్‌ ఉండాలి. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో దీనికే ప్రాధాన్యం ఎక్కువ. లేథ్‌ మిషన్లకు తోడు మెషీన్ల బిల్డింగ్‌కు అవసరమైనవి ఉండాలి. కార్పెంట్రీ, హౌస్‌వైరింగ్‌, షీట్‌ మెటల్‌ వర్క్‌, ఫిటింగ్‌, ప్లంబింగ్‌ సౌకర్యాలు ఉండాలి. హైడ్రాలిక్స్‌ ప్రాసెసర్‌, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ తదితరాలూ ఉండాలి. ఒక రకంగా ఈ బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున స్థలం అవసరమవుతుంది. భారీగాను వ్యయమవుతుంది.


ఉద్యోగ అవకాశాలు

రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌ విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులను బిహెచ్‌ఈల్‌, హెచ్‌ఎఎల్‌, డిఆర్‌డిఒ, డిఆర్‌డిఎల్‌ తదితర కంపెనీలు తీసుకుంటున్నాయి. కోర్‌ జాబ్‌లకు తోడు సాఫ్ట్‌వేర్‌ వైపూ వెళ్ళవచ్చు. చిన్నపాటి కంప్యూటర్‌ కోర్సులతో చాలా సులువుగా ఐటి రంగంలో వీరు కూడా నిలదొక్కుకుంటున్నారు. శారీరక దృఢత్వం అక్కరలేదు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేయాలంటే శారీరకంగా బలంగా ఉండాలన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. కోర్సులోనూ, ఆపై వృత్తిపరంగా ఏదో బరువులు మోయాల్సిన అవసరం ఉండదు. 


ఎలక్ట్రికల్

కంటికి అచ్చంగా కనిపించని వాటిలో విద్యుత్తు ఒకటి. ఇంట్లో బల్బు వెలుగుతుంది. మిక్సీ పని చేస్తుంది. మన సెల్‌ ఛార్జ్‌ అవుతుంది. పైకి కనిపించే ఆ మూడూ కరెంట్‌ సహకారంతో మాత్రమే వినియోగంలోకి వస్తాయి. అయితే, వాటికి ఆధారమైన కరెంటు మాత్రం మనకు స్పష్టంగా కనిపించదు. కరెంట్‌ లేకుండా నేడు ప్రపంచాన్ని ఊహించలేం. ఒక్క క్షణం కరెంటు పోతే మనం చూపించే అసహనం తెలిసిందే. నేటి ఐటి, ఎలకా్ట్రనిక్స్‌ తదితరాలన్నింటికీ మాతృక ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. కోర్‌ సబ్జెక్టుగా దీనికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. ప్రపంచ అభివృద్ధి గమనంలో దీనిపాత్ర ఎంతో ఉంది. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌గా మన రాష్ట్రంలోని ఎక్కువ కాలేజీలు ఈ సబ్జెక్టును అందిస్తున్నాయి. కేవలం ఐఐటిల్లో మాత్రమే దీన్ని ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌గా చూస్తాం.


కోర్సులో..

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సర్క్యూట్స్‌ కీలకం. దీనిపై పూర్తి స్థాయి పట్టు సాధించిన వ్యక్తి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా వృత్తిలో చాలా బాగా ఇమిడిపోవచ్చు. ఈ కోర్సులో పవర్‌ ప్రొడక్షన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ (విద్యుత్తు ఉత్పత్తి, చేరవేత, పంపిణి)పై విస్తృత అవగాహన సాధించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీలో భాగంగా ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రికల్‌, సంబంధిత మెషీన్స్‌, మెజర్‌మెంట్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, యుటిలైజేషన్‌, డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైక్రోప్రాసెసర్స్‌ తదితరాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే మెకానికల్‌, సివిల్‌, ఎలకా్ట్రనిక్స్‌తో కలగలిసిన అంశాలూ ఉంటాయి. వాటితో ఈ కోర్సుకు ఉన్న అనుబంధం మేరకు చదవాల్సి ఉంటుంది. ఆపై పీజీ చేయాలనుకుంటే పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ లలో చేయవచ్చు.


ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొన్ని అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎంపిక చేసుకున్న కాలేజీలో ఈ కోర్సు నాలుగేళ్ళు చదివి కనీసం ఒక బ్యాచ్‌ వెళ్ళినట్లయితే మంచిది. ఎలక్ట్రికల్‌ విభాగం కింద కనీసం ఇద్దరు ప్రొఫెసర్లు, మూడు నుంచి నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండి తీరాలి. టీచర్‌, విద్యార్థి నిష్పత్తి 1ః15గా ఉండటం శ్రేయస్కరం. ఎలక్ట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్న లేబరేటరీ ఉండాలి. అందులో తప్పనిసరిగా కంప్యూటర్‌ లేబ్‌, పవర్‌ లేబ్‌, మెకానిక్స్‌ లేబ్‌, మెజర్‌మెంట్‌ లేబ్‌, కంట్రోల్‌ లేబ్‌ సిస్టమ్‌, ఎలకా్ట్రనిక్‌ లేబ్‌ ఉండాలి. లేబరేటరీ సేప్టీ అంటే రక్షణ వ్యవహరమూ అవసరమే. ముఖ్యంగా సేఫ్టీ మేట్స్‌ ఉన్నాయో లేదో చూడాలి. చక్కని లైబ్రరీ ఉండాలి. సాధారణంగా యూనివర్సిటీ క్యాంప్‌్‌సలో ఈ బ్రాంచ్‌  చదువుకున్న విద్యార్థులను రాష్ట్ర విద్యుత్తు సంస్థలు జెన్కో, ట్రాన్స్‌మిషన్‌కితోడు బిహెచ్‌ఈల్‌, ఎన్‌టిపిసి, ట్రాన్స్‌ఫార్మర్‌ కంపెనీలు తీసుకుంటున్నాయి.


ఉద్యోగ అవకాశాలు

పవర్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌పై అవగాహన ఉండాలి. ఈ కోర్సు చదివే విద్యార్థులు సేఫ్టీ (రక్షణ) విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రికల్‌ అంటేనే రక్షణ చర్యలు అందులో మిళితమై ఉంటుంది. చివరగా ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ఎలక్ట్రికల్‌ అంటే కష్టం అనే అపోహ ఉంది. ఎక్కువ లెక్కల చిక్కులు అని కూడా భావిస్తారు. అయితే, అందులో వాస్తవం లేదు.  ఇంటర్మీడియెట్‌లో మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి, ఆపై ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఈ లెక్కలు పెద్ద కష్టం కానే కాదు. ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌పై పట్టు సాధించాలి.


ఏమిటి బదులు ఎందుకు?

ముఖ్యంగా ఇంజనీరింగ్‌ అధ్యయనం చేసే అభ్యర్థులు ఏమిటి బదులు ఇది ఎందుకు అని ప్రశ్నించడం నేర్చుకోవాలి. అందుకు తగ్గ సమాఽధానం రాబట్టుకునే విద్యార్థులకు తిరుగే ఉండదు. ఒక దగ్గర ఉపయోగించిన సాంకేతికత మరొక దగ్గర ఎందుకు పని చేయదు అన్నది తేల్చుకోవాలి.  సివిల్‌ ఇంజనీర్లు చేపట్టే ప్రతి పని అందరి కంటిలో పడుతుంది. దాంట్లో ఏదైనా లోపం తలెత్తితే విమర్శలు తప్పవు. డ్యామ్‌ లీకేజీ మొదలుకుని రోడ్డు కొట్టుకుపోవడం వరకు ఏ విషయంలోనైనా ప్రజల నుంచి విమర్శలు తప్పవు. అదే సమయంలో ఒక ఇంజనీర్‌తో ప్రయోజనం పొందిన ప్రజలు ఆ వ్యక్తిని కలకాలం గుర్తుంచుకుంటారు. కాటన్‌ మహాశయుడు అందుకు పెద్ద ఉదాహరణ. ఆయన సమాధి సైతం మనకు పవిత్రమే. ఈ కోర్సు చదివే వ్యక్తులు పదిమందితో పనిచేయించాలి. అంటే మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, అదీ అక్కడి ప్రాంతానికి తగ్గట్టు తెలియాలి. మరొకరిని సముదాయించగలిగే నేర్పు ఉండాలి. ఎండ, వానలతో నిమిత్తం ఉండదు. ఎసి గదిలో కూర్చుని పని చేద్దామంటే కుదరదు. విమర్శలకు సైతం వెరవకుండా పని చేసుకుపోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-10-08T18:26:13+05:30 IST