వెబ్‌ ఆప్షన్స్‌.. ఆరంభం నుంచి అప్రమత్తం

ABN , First Publish Date - 2020-10-12T17:11:24+05:30 IST

అటు ఐఐటి, ఎన్‌ఐటి తదితర సంస్థలు ఇటు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ లేదంటే మన ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ వస్తే ఇబ్బంది ఏమీ లేదు. కోరుకున్న కాలేజీలో, అనుకున్న బ్రాంచీలో సులువుగా సీటు పొందవచ్చు. మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన అభ్యర్థులకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

వెబ్‌ ఆప్షన్స్‌.. ఆరంభం నుంచి అప్రమత్తం

అటు ఐఐటి, ఎన్‌ఐటి తదితర సంస్థలు ఇటు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ లేదంటే మన ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ వస్తే ఇబ్బంది ఏమీ లేదు. కోరుకున్న కాలేజీలో, అనుకున్న బ్రాంచీలో సులువుగా సీటు పొందవచ్చు. మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన అభ్యర్థులకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా చేస్తే, మంచి కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీటు వస్తుందన్నది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎదురయ్యే  ప్రధాన సమస్య. 


ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలైనప్పుడు ఇరవై నుంచి ముప్పయ్‌ ఆప్షన్లు పెట్టుకుంటే చాలు అని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. అయితే అది తప్పని కౌన్సెలింగ్‌ నిర్వాహకులు పదేపదే చెబుతున్నారు. వందల కొద్ది ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు, కేవలం కొన్ని ఆప్షన్లు మాత్రమే పెట్టుకుంటే, నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ర్యాంకు వచ్చిన విద్యార్థులు కనీసం రెండు, మూడు వందల ఆప్షన్లు అయినా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.  తప్పకుండా వస్తాయన్న వాటికితోడు, అటూ ఇటూగా రావడానికి అవకాశం బాగా ఉన్న కాలేజీలు, బ్రాంచీలను కూడా ఎంచుకోవడం మంచిది. ప్రత్యేకించి మనకు రాదనుకున్న బ్రాంచ్‌ లేదా కాలేజీకి ఎవరూ ఆప్షన్‌ పెట్టుకోని పక్షంలో పరిస్థితి అనుకూలిస్తే మనకే దక్కవచ్చు. ఇది చీకట్లో రాయి ఎంతమాత్రం కాదు... అవకాశాన్ని అందిపుచ్చుకోవడంగానే భావించాలి. నిపుణులు చెప్పేది ఏమిటంటే....! 


అవకాశం ఒక్కసారే!

ర్యాంక్‌ పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ మంచి కాలేజీలు, కోర్సుల విషయంలో రాజీ పడాల్సిన పని లేదు. మనకు నచ్చిన కాలేజీ లేదంటే కోర్సు నుంచి ఆప్షన్లు ఆరంభించవచ్చు. ర్యాంకుల ఆధారంగా మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అంటే మొదటి ర్యాంక్‌ తరవాత రెండో ర్యాంక్‌ క్యాండిడేట్‌ ఇచ్చుకున్న ఆప్షన్ల ఆధారంగా అలాట్‌మెంట్‌ ఉంటుంది. ఉదాహరణకు వెయ్యో ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థి ప్రత్యేకించి నచ్చిన కాలేజీలను తనిష్టం వచ్చిన రీతిలో పెట్టుకున్నాడని అనుకుందాం. ఆ అభ్యర్థికి కేటాయింపు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకారం జరుగుతుంది. అంటే తనకు ముందున్న 999 మందికి సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఆ వెయ్యో ర్యాంకర్‌ వంతు వస్తుంది. అప్పుడు సీటు కేటాయింపు ఆ వ్యక్తి పెట్టుకున్న మొదటి ఆప్షన్‌ నుంచి ఆరంభమవుతుంది. ఆప్షన్‌ నెంబర్‌ 1, 2, 3.. అలా మొదలవుతుంది. ఏ 30వ ఆప్షన్‌ దగ్గర క్లిక్‌ కావచ్చు. లేదంటే 200 వద్ద క్లిక్‌ కావచ్చు. ఆ ఆప్షన్‌గా పెట్టుకున్న కాలేజీ, కోర్సులో సీటు లభిస్తుంది. వెయ్యో వ్యక్తిగా మాత్రమే ఆ అభ్యర్థికి కేటాయింపు ఆరంభమవుతుంది. ముఖ్యంగా ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌లో మేగ్జిమమ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వడం అందుకోసమేనని గుర్తించాలి. 


కాలేజీ/ సీటు

కొందరికి కాలేజీ ముఖ్యం. ఐఐటి, ఎన్‌ఐటి లేదంటే ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీలో చదవాలన్న కోరిక ఉంటుంది. అక్కడ ఏ కోర్సులో సీటు వచ్చినా ఆనందమే. అలాగే మరికొందరికి కోర్సు ముఖ్యం. సిఎ్‌సఇ మాత్రమే చదవాలని ఉంటుంది. ఈ రెంటిలో ఏదో ఒకదానికి మొదట ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. రెంటిలో సమతూకం పాటించినా తప్పుకాదు. అలాంటప్పుడు ఎక్కడ ఏ సీటు వచ్చినా తీసుకునేందుకు సంసిద్ధులై ఉండాలి. మొదట కాలేజీ లేదంటే బ్రాంచ్‌ ఏదైనా ఒకటి ముఖ్యంగా భావించి తదనుగుణంగా ఆప్షన్లు పెట్టుకుంటూ వెళ్ళవచ్చు. అంటే ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రధానం అనుకునప్పుడు మొదట అక్కడ కోర్సులన్నీ మళ్ళీ తన ఇష్టానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. తరవాత మరొక కాలేజీని ఎంచుకోవాలి. అలా కాకుండా కోర్సు కాదు, బ్రాంచే ముఖ్యం అనుకుంటే వరుసగా ఎంచుకున్న కాలేజీ, ఆ వెంటనే కోర్సుని ఒకటి తరవాత మరొకటి ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. ఒక కాలేజీలో మొదట కొన్ని, తరవాత మరొక కాలేజీలో కొన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అంతా అభ్యర్థుల ఇష్టం. ఈ విషయంలో వారికి వారే మహా రాజులు.


మొదటి అవకాశమే బెస్ట్‌!

ఇలాంటి వెబ్‌ కౌన్సెలింగ్‌లో తొలి ఎంపికే కీలకం. రెండోసారి కౌన్సెలింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ, అప్పుడు ఛాన్స్‌లు తక్కువ. కేవలం మిగిలిన సీట్లకు మాత్రమే పోటీపడాల్సి వస్తుంది. అందువల్ల మొదటి కౌన్సెలింగ్‌ సమయంలోనే కొద్దిగా తెలివిగా వ్యవహరించాలి. ఉదాహరణకు ఒక విద్యార్థినికి 25,000 ర్యాంక్‌ వచ్చిందని అనుకుందాం. తను ఎంపిక చేసుకున్న కాలేజీ లేదా బ్రాంచ్‌కు సంబంధించి ఆమెకు తనకంటే ముందు ఎంతమంది అదే ఆప్షన్‌ ఇచ్చారన్న విషయం అస్సలు తెలియదు. ఎవరు దేన్ని ఎంచుకుంటున్నారన్న విషయం అంతకంటే తెలియదు. విద్యార్థినులకు సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ ఉంది. ఆ కేటాయింపు అన్నది ఓపెన్‌ మొదలుకుని వివిధ రిజర్వేషన్ల వరకు వర్తిస్తుంది. ఒక కాలేజీ ప్రత్యేకించి ఒక బ్రాంచ్‌లో వంద సీట్లు ఉన్నాయనుకుంటే, తప్పనిసరిగా అన్నిచోట్లా రిజర్వేషన్‌ ఇచ్చుకుంటూ, ఆ మేరకు సీట్లు కేటాయించాలి.


గత ఏడాది కేటాయింపు

కాలేజీలు, సీట్లవారీగా గత ఏడాది కేటాయింపు సమాచారం కేవలం గైడింగ్‌ ఫ్యాక్టర్‌. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా కేటాయింపు జరగాలని లేదు. అయితే ప్రత్యేకించి ప్రసిద్ధ కాలేజీల్లో మాత్రం ర్యాంకింగ్‌లో కొద్దిగా అటూ ఇటూగా మాత్రమే మారుతుంది.

Updated Date - 2020-10-12T17:11:24+05:30 IST