టెన్త్‌, ఇంటర్‌ తరవాత ఇవి చదవొచ్చు...

ABN , First Publish Date - 2020-06-11T18:12:02+05:30 IST

మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీతో ఇంటర్‌ చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు అర్హులు. నిర్మాణ రంగంలో సివిల్‌, యంత్రం తిరిగేందుకు మెకానికల్‌, విద్యుత్‌ అందించే ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌..

టెన్త్‌, ఇంటర్‌ తరవాత ఇవి చదవొచ్చు...

ఇంజనీరింగ్ కోర్సులు

సైన్స్‌ విద్యార్థుల కోసం

మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీతో ఇంటర్‌ చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు అర్హులు. నిర్మాణ రంగంలో సివిల్‌, యంత్రం తిరిగేందుకు మెకానికల్‌, విద్యుత్‌ అందించే ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌.. వాస్తవానికి ఈ రంగంలో మాతృకలు. ఆ తరవాత వచ్చినవే వాటికి అనుబంధమైన ఆర్కిటెక్చర్‌, ఆటోమొబైల్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మైనింగ్‌ అండ్‌ పెట్రోలియం, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌, లెదర్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ వంటి ఇతర కోర్సులు. ఐఐటి, ఎన్‌ఐటి సహా పలు ఇంజనీరింగ్‌ సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వర్తించే ఎంసెట్‌లో ర్యాంకు సాధించి వివిధ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. ఒక్కో కోర్సు సంబంధిత ఉద్యోగాలు చేసేందుకు, వృత్తిలో ఇమిడేందుకు ప్రాథమిక అర్హతగా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన కోర్సుల వివరాలు..


కంప్యూటర్‌ & ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 

కంప్యూటర్‌ & ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంప్యూటర్‌ సంబంధిత కోర్సుల్లో చేరాలనుకుంటే డిగ్రీ స్థాయిలో బిసిఎ ఉండేది. అయితే ఇంజనీరింగ్‌, ఎంసిఎ కోర్సుల్లో సీట్లు పెరిగిన తరవాత బిసిఎకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ తగ్గింది. అలాగే ఇంటర్‌లో మేథ్స్‌ చదివి, డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రం ఎంసిఎ కోర్సులో చేరవచ్చు. ఏ సబ్జెక్టులతోనైనా డిగ్రీ అర్హతతో పెద్ద సంస్థల్లో కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌గా, హార్డ్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌గా స్థిరపడుతున్నారు. ఎంబిఎ చేసినవారు అలాగే సాఫ్ట్‌వేర్‌పై మంచి అవగాహన ఉన్నవారు సాఫ్ట్‌వేర్‌ మార్కెటింగ్‌ కూడా చేస్తున్నారు. ఇక కిందిస్థాయిలో టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ప్రైవేట్‌ సంస్థల్లో డీటీపీ నేర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కంప్యూటర్‌ ఇండస్ర్టీలో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌తోపాటు మార్కెటింగ్‌ ఉద్యోగాలు కూడా ఉంటాయి.


ఆర్కిటెక్చర్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ

మేథ్స్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు ఇందులో ఇంజనీరింగ్‌ చేయవచ్చు. టెన్త్‌ తరవాత పాలిటెక్నిక్‌ డిప్లొమా ఆధారంగా కూడా సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఆర్కిటెక్చర్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో ఉద్యోగాలుంటాయి.


ఫిజికల్‌, కెమికల్‌ అండ్‌ ఎర్త్‌ సైంటిస్టులు 

ఇంజనీరింగ్‌ ద్వారా కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేయవచ్చు. బిఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ర్టీ చేసిన వారికి కూడా కెమికల్‌కు సంబంధించిన స్పెషలైజ్డ్‌ డిప్లొమాలు ఉన్నాయి. జెఎన్‌టియూ, ఆంధ్రా, ఓయూలలో కొన్ని కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఫిజిక్స్‌, మేథ్స్‌ల్లో కూడా ఇలాంటి కోర్సులు ఉన్నాయి. డిగ్రీ/పీజీల్లో జాగ్రఫీ సబ్జెక్టులు చదివిన వారు జియాలజిస్టులుగా వెళ్లవచ్చు. ఓషనోగ్రఫీకి సంబంధించిన కోర్సులు ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్నాయి. కెమికల్‌ ఇండస్ర్టీ, ఫిజిక్స్‌ అండ్‌ అలైడ్‌ ఫీల్డ్‌లో ఉపాధి ఉంటుంది. మేథమెటీషియన్స్‌ అండ్‌ స్టాటిస్టిషియన్స్‌గా, జియాలజిస్టులుగా, జాగ్రఫీ అండ్‌ జాగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ స్పెషలిస్టులుగా, మెట్రోలాజిస్టులుగా, ఓషనోగ్రాఫర్లుగా అవకాశాలుంటాయి.

Updated Date - 2020-06-11T18:12:02+05:30 IST