దృఢ సంకల్పం

ABN , First Publish Date - 2020-03-13T07:02:38+05:30 IST

ఇంతలోనే ఎంత మార్పు! కరోనా విస్తరణ వేగం పెరుగుతున్నది. వారం క్రితం దాకా ధైర్యంగా కనిపించిన దేశాలు ఇప్పుడు చుట్టూ గోడలు కట్టేసుకుంటున్నాయి. ఎవరూ రావద్దనీ, తమవారిని...

దృఢ సంకల్పం

ఇంతలోనే ఎంత మార్పు! కరోనా విస్తరణ వేగం పెరుగుతున్నది. వారం క్రితం దాకా ధైర్యంగా కనిపించిన దేశాలు ఇప్పుడు చుట్టూ గోడలు కట్టేసుకుంటున్నాయి. ఎవరూ రావద్దనీ, తమవారిని పోవద్దనీ అంటున్నాయి. ఆ గోడల్లోపల కూడా జనం ధైర్యంగా లేని స్థితి. ప్రజల మధ్య పలుకరింపులు పోయి, తలుపులు మూసుకొని, కిటీకీలు మాత్రమే తెరుచుకున్న దేశాలు అనేకం. నిర్మానుష్యమైన వీధులు, మూతబడిన విద్యా వాణిజ్య కేంద్రాలు, పిట్టపిల్ల లేని క్రీడామైదానాలు దర్శనమిస్తున్నాయి. మరోపక్క రోగానపడుతున్న రాజకీయ నాయకులు, హాలీవుడ్‌ నటులు, క్రీడాకారుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇంతకాలం ఊగిసలాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను ‘మహమ్మారి’గా నిర్థారించింది. పదిహేనువందలకు చేరిన కేసులతో, పెరుగుతున్న మరణాలతో, చేజారిపోతున్న పరిస్థితుల మధ్య అగ్రరాజ్యం అమెరికా తన ఆగ్రహాన్ని యూరప్‌మీద ప్రదర్శించింది. ఆ ఇరవైఆరు దేశాలతో రాకపోకలు నిషేధించింది. చైనావారిని యూరోపియన్‌ దేశాలు స్వేచ్ఛగా రానివ్వడంతో ఈ సమస్య అమెరికా నెత్తికి చుట్టుకున్నదని ట్రంప్‌ నిప్పులు చెరుగుతున్నారు. కానీ, కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం కోలుకుంటోంది.


అలసత్వం కూడదు, చేతులెత్తేయవద్దు అని ప్రపంచదేశాలకు ఆరోగ్య సంస్థ హితవు చెబుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తగు జాగ్రత్తలతో కలసికట్టుగా కరోనాను తరిమేద్దామంటూ ప్రజలకు ధైర్యవచనాలు చెప్పారు. మిగతా దేశాల మాదిరిగానే భారత్‌ సైతం వీసాల రద్దుతో ఆత్మరక్షణకు ఉపక్రమించింది. పదిహేనవ తేదీ తరువాత కొన్ని దేశాలనుంచి లేదా ఆ దేశాల మీదుగా భారత్‌లో కాలూనిన వారిని కచ్చితంగా పద్నాలుగురోజులు క్వారంటైన్‌ చేయాలని కూడా నిర్ణయించుకుంది. తన దేశ పౌరులను విదేశీప్రయాణాలు వాయిదావేసుకోమని హితవు చెప్పింది. కచ్చితమైన మందు కొరవడిన స్థితిలో ఏ దేశమైనా తన పౌరులను రక్షించుకొనేందుకు ఇంతకంటే చేయగలిగేదేమీ లేదు. కరోనా వ్యాప్తి ఎంత భయపెడుతున్నప్పటికీ, కోలుకుంటున్నవారి సంఖ్య చూసినప్పుడు మాత్రం ధైర్యం చిక్కుతుంది. మిగతా ప్రపంచమంతా పెరుగుతున్న బాధితులను లెక్కపెట్టుకుంటున్న తరుణంలో, చైనాలో కొత్త కేసుల నమోదు వేగంగా పడిపోతున్నది. 80వేలమంది రోగుల్లో 60వేలమంది, అంటే దాదాపు డెబ్బయ్‌శాతం రోగం బారినుంచి బయటపడ్డారు. అలాగే, మిగతా దేశాల్లో కూడా దాదాపు యాభైశాతం ఆరోగ్యవంతులైనారు. కరోనా కేసుల్లో కనీసం ఎనభైశాతానికి ఏ ముప్పూ రాబోదనీ, వైరల్‌ లోడ్‌ అధికంగా ఉన్నవారికి, అందునా వృద్ధులకు మాత్రమే సమస్య ఉండవచ్చునని ఎప్పటినుంచో చెబుతున్నదే. రోగానికి భయపడటం కంటే జాగ్రత్త పడటం ముఖ్యమని అంటున్నదీ అందుకే. మోదీనుంచి ఇజ్రాయెల్‌ ప్రధాని నేర్చుకున్న నమస్కారం ఇప్పుడు ప్రపంచదేశాధినేతలందరికీ ఉపకరిస్తున్నది. ప్రిన్స్‌చార్ల్స్‌ కూడా కరచాలనానికి స్వస్తిపలికారు. 


కరోనా ప్రపంచాన్ని విడదీసినా కలసి ఆలోచించేట్టు చేస్తున్నది. అన్నిదేశాలూ ఒక సమస్య గురించి ఉమ్మడిగా మధనపడటం ఇదే ప్రథమం కావచ్చు. కానీ, వ్యాధికంటే అది తెచ్చిన ఆర్థికవిపత్తు మరింత భయానకంగా ఉన్నది. గ్లోబల్‌స్థాయిలో జరిగిన ఆర్థికనష్టాన్ని పూడ్చడం సమీపకాలంలో అసాధ్యం. అసలే ఆర్థిక రంగం కుదేలైన స్థితిలో ఇది మనకు మరో పెద్దదెబ్బ. కరోనా వైరస్‌ కనీసం ఏడాది పాటు ప్రపంచంమీద పెత్తనం చేయవచ్చునంటూ సింగపూర్‌ ప్రధాని గురువారం చేసిన ప్రకటన కచ్చితంగా ఆందోళన కలిగించేదే. చాలా దేశాల మాదిరిగా సింగపూర్‌ విదేశీయుల రాకపోకలను నిషేధించలేదు కానీ, వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, వారిని కర్తవ్యోన్ముఖులుగా మార్చడం ప్రభుత్వాలకు కష్టమేమీ కాదు. రోగలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, సామూహిక బాధ్యతలను తెలియచెప్పడం నిరంతరం జరుగుతూండవలసిందే. దానితో పాటు అసత్యప్రచారాలకు, గాలివార్తలకు కత్తెరవేయడమూ అవసరం. భారత్‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చేజారిపోతున్న పరిస్థితులైతే ప్రస్తుతానికి లేవు. అయినప్పటికీ, ఎంతటి విపత్తుకైనా సిద్ధపడి పరీక్షాకేంద్రాలు, ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాల్సిందే. కరోనాను ఎదుర్కొంటున్న ప్రతీ దేశమూ తన అనుభవాన్ని మనకు అందిస్తున్నది. వ్యాప్తినిరోధం నుంచి రోగనిదానం వరకూ ఆ అవగాహనలన్నీ మనకు అక్కరకువస్తాయి.

Updated Date - 2020-03-13T07:02:38+05:30 IST