అప్రియ సత్యాలు

ABN , First Publish Date - 2020-08-20T06:15:22+05:30 IST

కరోనాను ఎదుర్కొనడంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం మీద రాష్ట్ర గవర్నర్‌ తమిళసై చేసిన వ్యాఖ్యలపై కలకలం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు గవర్నర్‌తో గొంతు కలపడానికి ఉత్సాహం...

అప్రియ సత్యాలు

కరోనాను ఎదుర్కొనడంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం మీద రాష్ట్ర గవర్నర్‌ తమిళసై చేసిన వ్యాఖ్యలపై కలకలం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు గవర్నర్‌తో గొంతు కలపడానికి ఉత్సాహం చూపుతుండగా, అధికారపక్షం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నది. సమస్య తీవ్రతను సరిగా అంచనావేయలేకపోయిందని, తాను ముందే హెచ్చరించినా, సూచనలు చేసినా చర్యలు తీసుకోలేదని ఆమె ఒక ఆంగ్ల చానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పనితీరు మీద ఇంత నిక్కచ్చిగా గవర్నర్‌ మాట్లాడడం అసాధారణమైనది. ఒక ఆరోగ్య ఉత్పాత పరిస్థితిపై ఒక వైద్యురాలైన గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలుగా మాత్రమే కాక, ఇంకా ఇతర కోణాల నుంచి కూడా ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం సహజం.


తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితం కాకముందు, తమిళసై తమిళనాడు బిజెపి నేతగా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో ఉనికిని పెంచుకోవడానికి భారతీయ జనతాపార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, జయలలిత మృతి తరువాత ఆ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చొరవ, చురుకుదనం, అవసరమైన చోట్ల దూకుడు కూడా కలిగిన పార్టీవ్యక్తిగా తమిళసైకు పేరున్నది. ఆమెకు తగిన అధికార పదవి ఇవ్వడం మాత్రమే కాక, తెలంగాణ ప్రభుత్వంపై ఒక కన్ను వేసి ఉంచడానికి కూడా అవసరమన్న ఉద్దేశ్యంతోనే తమిళసైని గవర్నర్‌గా నియమించారని కథనాలు వినిపించాయి. కానీ, ఆమె పదవి చేపట్టిన తరువాత ప్రభుత్వంతో సఖ్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నట్టు కొంతకాలం అనిపించినా, తరువాత చొరవ తీసుకుని పాలనా వ్యవహారాలను పరిశీలించడం, తనిఖీలు చేయడం, పరిణామాల నివేదన కోసం రమ్మని అధికారులను ఆదేశించడం వంటి చర్యలతో మంద్రస్థాయి క్రియాశీలత కనిపించసాగింది. కరోనా కట్టడి వైఫల్యంపై తాజావ్యాఖ్యలు ఈ క్రమాన్ని వేడెక్కించాయి.


మొత్తంగా దేశాన్ని తమ రాజకీయ అధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగానే కేంద్రప్రభుత్వం చేస్తున్న గవర్నర్‌ నియామకాలు, ప్రతిపక్ష రాష్ట్రాలలో గవర్నర్ల పనితీరు ఉంటున్నాయన్న విమర్శలు వింటున్నాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష స్థానాలలో ఏర్పడిన ఖాళీని భర్తీచేయాలని బిజెపి భావిస్తున్నది. రెండు రాష్ట్రాలలోను తెలంగాణపై బిజెపి గురి పదునుగా ఉన్నది. బలమైన శక్తిగా ఎదగగలిగే అవకాశం తెలంగాణలోనే అధికంగా ఉన్నదని ఆ పార్టీ భావిస్తున్నది. జనసమ్మతి అధికంగా కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని బిజెపి భావించడం సహజం. అయితే, ఆ పార్టీ వ్యూహంలో భాగంగానే గవర్నర్‌ వ్యాఖ్యలను చూడడం సరి అయినదేనా? 


తమిళసై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కొత్తవి కావు. తెలంగాణలో కరోనా పరిస్థితిని ఎదుర్కొంటున్న తీరు గురించి ప్రతిపక్షాలు, పౌరసమాజం, పత్రికలు చేస్తూ వచ్చిన విమర్శలూ, సూచనలే అవి. గవర్నర్‌ తాను ఇంతకు ముందు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను కూడా తాజా వ్యాఖ్యలలో పునరుద్ఘాటించారు. వ్యాఖ్యల వెనుక అంతరార్థాలను వెదకడం మానేస్తే, తమిళసై చేసిన విమర్శలన్నీ సహేతుకమైనవి, ప్రభుత్వం దృష్టి సారించి, దిద్దుబాటుకు ఉపక్రమించవలసినవి. 


ఆరంభంలో కరోనా విషయంలో ఎంతో బాధ్యతతో, సంకల్పశుద్ధితో వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం, రెండు లాక్‌డౌన్‌ల తరువాత నెమ్మదిగా ఉదాసీనంగా ఉండడం మొదలుపెట్టింది. కేంద్రం నుంచి సహాయం అందకపోవడం, లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థికనష్టం– వీటన్నిటి కారణంగా రాష్ట్రప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందేమో తెలియదు. పరీక్షలు అధికసంఖ్యలో చేయడానికి విముఖత ప్రదర్శించారు. ఇటీవలి విడియో సమావేశంలో ప్రధాని కూడా ఈ విషయంలో హెచ్చరించారు. గవర్నర్‌ కూడా మునుపు ఒకసారి ఇదే విషయమై సూచనలు చేశారు. అయినా, సాధ్యమైనన్ని తక్కువ పరీక్షలు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతూ వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రులను కరోనా రంగంలోకి తేవడానికి తాత్సారం చేసిన రాష్ట్రప్రభుత్వం, చివరకు ఒప్పుకుంది. కానీ, నియంత్రణ బాధ్యతను గాలికి వదిలింది. ఇప్పుడు కేంద్రానికి ఫిర్యాదులు వెడుతున్నాయి. రాష్ట్రానికి మొత్తం ఒకే ఒక ఆస్పత్రిలో కోవిడ్‌ వైద్యాన్ని కేంద్రీకరించడం తప్పన్న గవర్నర్‌ విమర్శ సరి అయినది. గ్రామీణ తెలంగాణలో కరోనా పరిస్థితి విషమిస్తున్నది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమైనవైతే, జంటనగరాలలో కంటె బయటనే వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నది. ఆ పరిస్థితిని ప్రభుత్వ వైద్యయంత్రాంగం ఎట్లా ఎదుర్కొంటుందో తెలియదు. 


గవర్నర్‌ ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికి మిత్రవిమర్శకురాలిగా వ్యవహరించడంలో తప్పు లేదు కానీ, ప్రతిపక్ష పార్టీలు గవర్నర్‌ మాటలు ఆసరా చేసుకోవడం ఆహ్వానించదగ్గది కాదు. ఇవే అంశాలపైన ప్రతిపక్షాలు పోరాడి ఉండవచ్చును కదా? గవర్నర్‌ వంటి వ్యవస్థలు ప్రతిపక్షబాధ్యతను వహించవలసివస్తే, అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రశ్నార్థకమైన అంశాలపై కూడా అక్కడి గవర్నర్‌ ప్రశ్నించడంలేదు. ఆ ప్రభుత్వంతో కేంద్రం సమీకరణను బట్టే ఆ రకమైన వైఖరి ఉండిందా? మరి తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం సమీకరణం ఏమిటి? అందులో కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు కూడా భాగస్వాములవుతాయా? ప్రభుత్వానికి ఉన్నట్టే, ప్రతిపక్షానికీ ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని నెరవేర్చకుండా, ఇతరులు చేసిన విమర్శల ఆధారంగా మాటల ఉద్యమాలు నడపాలనుకుంటే అది పరాన్నజీవుల రాజకీయం అవుతుంది.

Read more