ఠాక్రే సవాలు

ABN , First Publish Date - 2020-10-27T05:53:10+05:30 IST

బయట ఎటువంటి నిరోధమూ లేకుండా విస్తరిస్తూ పోయే శక్తికి, తన లోపలినుంచే, లేదా తనను పోలినవారి నుంచే ప్రతిఘటన ఎదురవుతుందట...

ఠాక్రే సవాలు

బయట ఎటువంటి నిరోధమూ లేకుండా విస్తరిస్తూ పోయే శక్తికి, తన లోపలినుంచే, లేదా తనను పోలినవారి నుంచే ప్రతిఘటన ఎదురవుతుందట. అందుకు మంచి ఉదాహరణ– దేశంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారతీయ జనతాపార్టీని, మరో హిందూత్వ పార్టీయే నిలదీసి సవాళ్లు విసరడం. ప్రతి విజయదశమి నాడు ఆనవాయితీగా జరిగే శివసేన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భారతీయ జనతాపార్టీని కడిగిపారేశారు. ప్రతిపక్ష రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసే దుర్బుద్ధిని మానుకోవాలి, మీ ‘ఆపరేషన్‌ లోటస్‌’ వల్ల ఏ ఫలితమూ ఉండదని తెలుసుకోవాలి– అని ఠాక్రే హెచ్చరించారు. ‘‘ఏ ప్రత్యామ్నాయమూ లేదు కదా, మాదే రాజ్యం అని హుంకరించకండి, మీ కంటె ఎవరైనా నయం అనే స్థితికి ప్రజలు చేరుకున్నారు’’– అని ఉద్ధవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. దేశంలో వినిపిస్తున్న ప్రతిపక్ష స్వరాలతో శివసేన కూడా క్రియాశీలంగా గొంతు కలపడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉద్ధవ్‌ ఠాక్రే వైఖరి సూచిస్తున్నది. 


ఇరవై సంవత్సరాల పాటు స్నేహంగా ఉన్న బిజెపి, శివసేన గత ఏడాది అక్టోబరు ఎన్నికల సందర్భంగా చెరోదారి అయ్యాయి. రెండో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, దేశంలోని అన్ని ఇతరపార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకునే వ్యూహం అమలుచేయడం మొదలుపెట్టింది. ఎంతటి ఉమ్మడి ప్రభుత్వంలోనూ పెద్దచేప చిన్నచేపను తినడం ఉంటుంది కాబట్టి, ఆ కబళింపును నిలువరించడానికి శివసేన తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని పట్టుబట్టింది. పట్టువిడుపులతో ఉండి, బిజెపి అందుకు అంగీకరిస్తే బాగుండేది. కానీ, ఇతరుల చేతిలోవి తీసుకునే ఉత్సాహంలో ఉన్నప్పుడు, తమ చేతిలోనే ఉన్న దాన్ని వదులుకోవడానికి ఆ పార్టీ సిద్ధపడలేదు. పైగా, శివసేన ఎంతటి దుందుడుకు భావాలున్న పార్టీ అయినా, తమను వీడి వెళ్లే ధైర్యం చేయదని బిజెపి భావించింది. ఆశ్చర్యకరంగా, శరద్‌పవార్‌–కాంగ్రెస్‌ కూటమితో శివసేన కలిసింది. ‘మహా వికాస్‌ అఘాడీ’ ఏర్పడింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఐదు దశాబ్దాల శివసేన చరిత్రలో ముఖ్యమంత్రి పదవి వరించిన మొదటి అధినేత ఉద్ధవ్‌. బిజెపి వల్ల ఎదురుకాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకుని తొలిరోజుల్లో ఆయన కొద్దిగా ఊగిసలాడారు. మోదీతో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మహారాష్ట్రను ఇబ్బందిపెట్టే రాజకీయ యత్నాలు ఉధృతం అవుతూ వచ్చాయి. 


సెక్యులరిజంను విశ్వసిస్తామని చెప్పే కాంగ్రెస్‌, ఎన్‌సిపిలతో అధికారాన్ని పంచుకుంటున్నందున, ఆ మేరకు శివసేన హిందూత్వ విషయంలో రాజీపడక తప్పదు. ఆ అంశం మీద దాడి చేయడానికి బిజెపి తరచు ప్రయత్నిస్తున్నది. బిజెపియే కాదు, రాష్ట్ర గవర్నర్‌ కూడా ఉద్ధవ్‌ను ‘‘మీ హిందూత్వ ఏమైంది, సెక్యులర్‌వి అయిపోయావా’’ అన్న ధోరణిలో నిలదీశారు. ఉద్ధవ్‌ దసరా ప్రసంగంలో దీనిపై కూడా ఎదురుదాడి చేశారు. ‘‘హిందూత్వ గురించి మీరు పాఠాలు చెప్పక్కరలేదు. మహారాష్ట్రలోనేమో గోవధ నిషేధానికి చట్టం చేస్తారు. గోవాలో మాత్రం బీఫ్‌ను అనుమతిస్తారు’’– అన్నారు ఠాక్రే. బిజెపిని విమర్శించడానికి ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ దసరా సందేశం నుంచి కొన్ని వాక్యాలను ఉపయోగించుకున్నారు. 


సుశాంత్‌ రాజపుట్‌ ఆత్మహత్య ఉదంతాన్ని తమకు వ్యతిరేకంగా మలిచారని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కంగనా రనౌత్‌ ముంబై వ్యతిరేక వ్యాఖ్యలు, శివసేనకు– సినీరంగానికి ఉన్న సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నించడం, సుశాంత్‌కు ముంబైలో అన్యాయం జరిగిందంటూ బిహార్‌లో ఎన్నికల ప్రచారం చేయడం– ఇవన్నీ ఠాక్రే ఆదివారం ప్రసంగంలో పరోక్షంగా విమర్శలకు గురిఅయ్యాయి. అన్నం పెట్టిన ముంబైని దుర్భాషలాడేవారు నమ్మక ద్రోహులని కంగనాను ఉద్దేశించి ఠాక్రే అన్నారు. 


ఉద్ధవ్‌ ఠాక్రే గొంతులో పలికిన తీవ్రతను, స్పష్టతను యావత్‌ దేశం ఆసక్తిగా గమనించింది. మృదుభాషిగా, సాదాసీదా వక్తగా పేరున్న ఉద్ధవ్‌, ఒక్కసారిగా పరుషమైన వాగ్బాణాలు సంధించారు. రా! మా ప్రభుత్వాన్ని పడగొట్టు చూద్దాం– అని కేంద్రాన్ని సంబోధిస్తూ ఆయన సవాల్‌ విసిరారు. ఇటువంటి పరిణామం మరోచోట తలెత్తకూడదనే బిహార్‌లో నితిశ్‌ కుమార్‌కు కళ్లేలు వేయడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. తన ఉనికికే దెబ్బ తగిలినప్పుడు శివసేన ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లినట్టు, బిహార్‌లో కూడా ఎన్నికల అనంతరం నితిశ్‌ అటువైపు వెడతారా? చూడాలి.


శివసేన హిందూత్వను విశ్వసించే పార్టీయే అయినప్పటికీ, ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీ. ఆర్థికంగా గుజరాతీ ఆధిపత్యాన్ని, ఉపాధిపరంగా ఇతర రాష్ట్రాల వలసలను వ్యతిరేకిస్తూ ఉనికిలోకి వచ్చింది. రాజకీయాలలోని బ్రాహ్మణాధిపత్యంతోను, దళిత శక్తులతోనూ కూడా ఆ పార్టీకి సమస్యలున్నాయి. ముంబైలో కార్మికోద్యమ నాయకత్వంలో కమ్యూనిస్టులు, ఇతరులు విఫలమవుతున్న దశ కూడా ఆ పార్టీ ప్రాభవానికి పనికివచ్చింది. ఇప్పుడు అనివార్యమైన విధాన పరివర్తనకు లోనవుతున్న ఈ పార్టీకి ఇది తాత్కాలిక దశా? లేక దీర్ఘకాలిక దశా? వేచిచూడాలి. 

Updated Date - 2020-10-27T05:53:10+05:30 IST