‘సంక్షేమ’ విజయం

ABN , First Publish Date - 2020-02-12T07:22:49+05:30 IST

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం ఊహించిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ ఈ విషయాన్ని ధృవీకరిస్తూనే బీజేపీ గతంలో కంటే ఎక్కువస్థానాలు సంపాదించుకుంటుందని అన్నాయి. అదీ నిజమైంది. ఐదేళ్ళక్రితం కంటే దానికి ఇప్పుడు ఐదు స్థానాలు ఎక్కువ వచ్చాయి...

‘సంక్షేమ’ విజయం

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం ఊహించిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ ఈ విషయాన్ని ధృవీకరిస్తూనే బీజేపీ గతంలో కంటే ఎక్కువస్థానాలు సంపాదించుకుంటుందని అన్నాయి. అదీ నిజమైంది. ఐదేళ్ళక్రితం కంటే దానికి ఇప్పుడు ఐదు స్థానాలు ఎక్కువ వచ్చాయి. బీజేపీ ప్రచార ఉధృతి, దాని అస్త్ర సామర్థ్యం లెక్కన ఇవి చాలా తక్కువ. ముచ్చటగా మూడోమారు తనకు అధికారం అప్పగించినందుకు కేజ్రీవాల్‌ ఢిల్లీ ఓటర్లకు ‘ఐ లవ్‌ యూ’ చెబుతూనే, ఈ ఘనవిజయానికి కారకుడు హనుమాన్‌ జీ అన్నారు.

టీవీ చానెల్‌లో ఆయన హనుమాన్‌ చాలీసా చదవడం, పోలింగ్‌ ముందురోజు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించడం తెలిసిందే. ఈ చర్యలను బీజేపీ విమర్శించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మాట అని ఉంటారు. ఎన్నికల ముందే కాదు, ఇకపై కూడా తాను మారిన మనిషిగానే ఉంటానని చెప్పడమూ ఆయన ఉద్దేశం కావచ్చు. కేజ్రీవాల్‌ని అభిమానులు కమ్యూనిస్టు కాని కమ్యూనిస్టనీ, రైటిస్టు కాని రైటిస్టనీ అంటారు. అలా ఉంటేనే తిరిగి అధికారం దక్కుతుందని ఆయనా అనుకున్నారు. వీధిపోరాటాలు వదిలేసి, బుద్ధిగా పనిచేసుకోవడం ప్రజలకూ నచ్చినట్టుంది. 

దేశవ్యాప్తంగా మోదీగాలి వీస్తున్న ఐదేళ్ళక్రితమే ఢిల్లీ ఓటర్లు బీజేపీకి మూడుస్థానాలు ఇచ్చారు. మొన్నటి సార్వత్రక ఎన్నికల్లో ఏడు ఎంపీ స్థానాలు ఇచ్చిన చేత్తోనే ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. మోదీ అక్కడ, కేజ్రీ ఇక్కడ అని ఢిల్లీ ప్రజలు ఎన్నడో నిర్థారించుకున్నట్టు ఉంది. మోదీ ఇమేజ్‌ సార్వత్రక ఎన్నికల్లో, కేజ్రీ ఇమేజ్‌ ఢిల్లీ ఎన్నికల్లో పనిచేసింది. జాతీయస్థాయి ఎన్నికలకూ రాష్ట్రాల ఎన్నికలకూ తేడా ఉన్నదని అప్పుడూ ఇప్పుడూ రుజువైంది. రాష్ట్రాల్లో బీజేపీ ఎదురుదెబ్బలు తిన్నప్పుడల్లా దానిని జాతీయస్థాయిలోనూ దెబ్బతీయవచ్చునని ప్రాంతీయపార్టీలు అనుకుంటున్నట్టే, జాతీయస్థాయి అంశాలతో రాష్ట్రాల్లోనూ చొరబడవచ్చని బీజేపీ భ్రమ. రెండూ వేరని ఢిల్లీ ఫలితాలు మరోమారు గుర్తుచేశాయి.

రెండు దశాబ్దాలుగా అధికారాన్ని అందుకోలేకపోతున్న ఢిల్లీలో ఈ మారు బీజేపీ ప్రచారం అసాధారణంగా సాగింది. స్థానికాంశాలే ప్రధానంగా ఎన్నికలకు పోతున్న కేజ్రీవాల్‌ను అడ్డుకోవడానికి షాహీన్‌బాగ్‌ నిరసనను ఆయన ఖాతాలో జమకట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేంద్రమంత్రులు ఎన్నికల సభల్లో స్థాయికి తగని వ్యాఖ్యలు చేశారు. గోలీమారో అంటూ నిరసనకారులపై నిప్పులు చిమ్మారు. ఈ నిరసనల వెనకున్న లక్షలాదిమంది మగాళ్ళంతా మీ ఇళ్ళల్లోకి చొరబడి అత్యాచారాలు చేస్తారని హెచ్చరించారు.

నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనలను సైతం ఆప్‌కు అంటగట్టే ప్రయత్నం జరిగింది. రామమందిర నిర్మాణానికి ఉద్దేశించిన కమిటీ ఏర్పాటు ప్రకటన కూడా కీలకసమయంలోనే జరిగింది. ఇవన్నీ ఓటర్లను తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశించింది కానీ, ప్రజలు ఆ మాయలో చిక్కుకోలేదు. కేజ్రీవాల్‌ సైతం ఈ ఎన్నికలను మోదీ వర్సెస్‌ కేజ్రీగా కనబడనీయకుండా జాగ్రత్తపడ్డారు. తన పనితనానికి పట్టం కట్టమన్నారు. ఇందుకు భిన్నంగా కేజ్రీవాల్‌మీద బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఓటర్లకు నచ్చలేదు. కేజ్రీవాల్‌కు తూగగలిగే స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రి మొఖం ఏదీ కనబడకపోవడం కూడా ఓటర్లపై పనిచేసినట్టుంది. 

ఈ ఫలితాలకు ఎవరు తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. దేశ ప్రజలు బీజేపీ సిద్ధాంతాలను, చేస్తున్న చట్టాలను తిరస్కరిస్తున్నారని అనవచ్చు. కశ్మీర్‌, పౌరసత్వచట్టం, ఎన్‌ఆర్‌సి ఇత్యాది వివాదాస్పద అంశాలతో ఈ ఫలితాలను ముడిపెట్టవచ్చు. కానీ, బీజేపీ రేపు మరోచోట నెగ్గుకురాదన్న నమ్మకమేమీ లేదు. అందువల్ల, ప్రధానంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ పనితనాన్ని మెచ్చి ఇచ్చిన బహుమతిగా దీనిని చూడటమే ఉత్తమం.

విద్య, వైద్యరంగాల్లో వచ్చిన మార్పులు ప్రజలు మెచ్చారు. బస్తీ వైద్యశాలలు, రూపు మారిన ప్రభుత్వ స్కూళ్లు, నిరంతరాయ విద్యుత్‌, ఉచిత మంచినీరు, మహిళలకు ఉచిత రవాణా వంటివి ఓట్లు కుమ్మరించాయి. వివాదాస్పద అంశాలపై బీజేపీ ఎంత కవ్వించినా దాని ఉచ్చులో చిక్కుకోకుండా కేజ్రీవాల్‌ మధ్యేమార్గంలో నిలబడటం ఉపకరించింది. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, నిత్యజీవితానికి ఉపకరించని అంశాలపై వీరంగం వేసే పార్టీలను, నాయకులను ప్రజలు మెచ్చరు. ఎటువంటి ఉద్వేగాలకు లోనుకాకుండా, తమ అవసరాలు తీర్చే, సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దీనిని ఢిల్లీ ప్రజల విజయంగా అభివర్ణించడం సముచితం.

Updated Date - 2020-02-12T07:22:49+05:30 IST