శాపనార్థాలు

ABN , First Publish Date - 2020-04-08T06:01:16+05:30 IST

అమెరికా కేంద్ర జాతీయ ఆరోగ్య, మానవ సేవల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ క్రిస్టి గ్రిమ్‌ తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కరోనా వైరస్‌ అనుమానితులను పరీక్షించడానికి సాధనాలు తగినన్ని లేవని...

శాపనార్థాలు

అమెరికా కేంద్ర జాతీయ ఆరోగ్య, మానవ సేవల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ క్రిస్టి గ్రిమ్‌ తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కరోనా వైరస్‌ అనుమానితులను పరీక్షించడానికి సాధనాలు తగినన్ని లేవని, చేసిన పరీక్షల ఫలితాల కోసం సుదీర్ఘంగా నిరీక్షించవలసి వస్తున్నదని, రోగుల, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆస్పత్రులకు తగినంత సామర్థ్యం లేదని ఆమె ఆ నివేదికలో రాశారు. సోమవారం నాడు, విలేఖరుల సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ఆ నివేదిక విషయమై ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ క్రిస్టిన్‌ ఫిషర్‌ అడిగారు. ఆయనకు బాగా కోపం వచ్చింది. ఆ అధికారిణి 1999 నుంచి అదే పదవిలో ఉంటున్నప్పటికీ, ఆమె ఒబామా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారని, అందుకే ఆ నివేదిక అట్లా ఇచ్చారని ఆరోపించారు. అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఇదేమిటి ఇటువంటి పనికిమాలిన ప్రశ్న వేశావు, శెభాష్‌, బాగా చేశావ్‌ అని మెచ్చుకోవాలి కానీ’’ – అని ఆ మహిళా రిపోర్టర్‌ను గదమాయించారు ట్రంప్‌.


ఫాక్స్‌ రిపోర్టర్‌నే కాదు, ఎబిసి న్యూస్‌ రిపోర్టర్‌ జోనాథన్‌ కార్ల్‌తో కూడా ట్రంప్‌ అదే పద్ధతిలో వ్యవహరించారు. గ్రిమ్‌ నివేదిక గురించి అడగగానే, ‘‘నువ్వొక పనికిమాలిన రిపోర్టర్‌వి’’ అని ట్రంప్‌ గద్దించారు. ‘‘నువ్వొక చెత్త’’ కూడా దూషించారు. ఈ మాటలు, దూషణలు, వ్యాఖ్యలు మనకు చాలా చిరపరిచితంగా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. ట్రంపులు ఇందుగలరందులేరని సందేహము వలదు. ట్రంపంతటి గొప్పవాడితో పోలిక వచ్చినందుకు సంతోషిస్తే చెప్పలేము కానీ, ప్రపంచమంతా ఏవగించుకునే అవలక్షణం అది.


అమెరికా లాంటి దేశం కూడా కరోనా విపత్తుకు కావలసినంత సన్నద్ధతలో లేదని అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే, ప్రపంచంలో ఏ దేశమూ కూడా ఇంత  స్థాయి ఆపదకు సిద్ధంగా ఉండడం సాధ్యం కాదు. అందుకు ఎవరూ తప్పు పట్టరు. కానీ, ముప్పు ముంగిటికి వచ్చినా కూడా ఆదమరిచో, అహంకరించో నిర్లిప్తత వహిస్తేనే విమర్శకుల తప్పు పడతారు. మన దేశం కంటె ఎన్నో రెట్లు ఎక్కువ సన్నద్ధత ఉన్నప్పటికీ, అక్కడి వ్యాధి వేగానికి అది సరిపోవడం లేదు. మనదేశంలో కరోనా వ్యాప్తి సాపేక్షంగా నెమ్మదిగా ఉన్నది కాబట్టి, ఇంకా వేడి తెలియడం లేదు కానీ, కరోనా పరీక్షల దగ్గర నుంచి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం దాకా ఎన్నో కొరతలు ఉన్నాయి. వైద్యులు ధరించవలసిన రక్షణ కవచాల కొరత అందులో పెద్దది, కీలకమయినది. పడకలు, ఐసియూ సదుపాయాలు, వెంటిలేటర్ల వంటివి సరే. మాస్కుల దగ్గర నుంచి మొదలుపెట్టి, సమస్తమూ మన దేశంలో తగినన్ని అందుబాటులో లేవు. కరోనాపై యుద్ధంలో ముందుపీటీన నిలిచిపోరాడే వైద్య, ఆరోగ్య సిబ్బందికి డాలూ కవచమూ ఇవ్వకుండా ఎట్లా? వైద్యుల సాహసత్యాగాలకు చప్పట్లు కొట్టి సరిపెట్టడం కాదు, ముందు పిపిఇలు (వైద్యుల రక్షణ వస్త్రాలు) సమకూర్చమని కొందరు వైద్యులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 


కరోనా పోరాట సామగ్రి తగినంతగా లేకపోవడానికి కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రస్తుతమున్న ప్రభుత్వాలు కారణం కాకపోవచ్చు. సాంప్రదాయికంగా, ఆరోగ్యానికి మనం కేటాయిస్తున్న బడ్జెట్‌లలోనే లోపమున్నది. ప్రజారోగ్యం కీలకరంగమన్న గుర్తింపు లోపించడంలోనే సమస్య ఉన్నది. అయితే, ప్రమాదం పొడసూపిన రెండు మూడు నెలల నుంచి, ప్రాధాన్యాల వారీగా తగిన సామగ్రిని సమకూర్చుకోవడం మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతలో విఫలమయినప్పుడు, పౌరసమాజం, ముఖ్యంగా మీడియా ఎత్తిచూపుతుంది. అది బాధ్యత. అది విధి. కర్తవ్యం. లోపాన్ని చూపవద్దంటే ఎట్లా? చూపిస్తే కోపం వస్తే ఎట్లా? పనికిమాలిన రిపోర్టర్‌ అనీ, చెత్త ప్రశ్న అనీ నోరుపారేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడికి అయినా, తెలంగాణ ముఖ్యమంత్రికి అయినా ఏమి అధికారం ఉన్నది? నిన్ను తప్పు పట్టడానికి కాదు, నీకు సహకరించడానికే మీడియా సమాచారం ఇస్తుంది, సమాజ ప్రయోజనం ముఖ్యమైనప్పుడు నిన్ను తప్పు పట్టడానికి కూడా మీడియా ప్రయత్నిస్తుంది. కరోనా వంటి కల్లోలం కమ్ముకున్నప్పుడు, సమాజంలోని వివిధ శ్రేణులను కలుపుకుని పోయి, ఫలితాలను సాధించాలి కానీ, రెండు ప్రసంగాలకు ప్రజలు జేజేలు పలికారు కదా అని, ఇప్పుడు అధికప్రసంగానికి పాల్పడితే ఎట్లా? వైద్యులకు రక్షణ పరికరాలు లేవని, భద్రతా వాతావరణం లేదని ప్రభుత్వానికి గుర్తు చేస్తే, రాసినవాడికి కరోనా రావాలని పిల్లిశాపనార్థాలు పెడతారా? నాయకుడు మాట్లాడే పద్ధతేనా అది? అమెరికా నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉండగా, ట్రంపు నోటిదురుసు మాత్రమే మీకు ఆదర్శంగా కనిపించిందా? అతను కూడా కరోనా రావాలని శాపం వచ్చేదాకా వెళ్లలేదు! 


మీడియా లేకపోతే, మీడియా ఆ సమాచారం ఇవ్వకపోతే, ప్రభుత్వాలను మేల్కొల్పేది ఎవరు? నీవే తప్ప ఇతః పరంబెరుగ– అని కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడి సర్వాన్నీ త్యజించడానికి ప్రజాస్వామిక సమాజం సిద్ధంగా ఉండదు కదా? పిపిఇల సమస్య కానీ, వైద్యులకు సానుకూల వాతావరణం కానీ, రాష్ట్రంలోను, కేంద్రంలోను, అంతర్జాతీయంగానూ కూడా ముఖ్య సమస్య. దీని గురించి కేంద్రానికి కూడా ఎందరో నిపుణులు గుర్తుచేయవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు సమర్పించిన నివేదికలో కూడా ఏ పరికరాలు, సామగ్రి ఎంత వరకు అందుబాటులో ఉన్నాయో చెప్పింది కదా, ఆ వివరాలకంటె భిన్నంగా ఉన్నాయా మీడియాలో వచ్చిన లెక్కలు? ఈ ఉపద్రవంలో మీడియా ఒక కీలకవ్యవస్థ. అది అర్థం కాకపోతే, పాలకులను ఎవరూ కాపాడలేరు. మీడియా ఒక అత్యవసర వ్యవస్థ. ప్రజలకు, వైద్యులకు, ఆరోగ్యసిబ్బందికి, పోలీసులకు, చివరకు ప్రభుత్వానికి అందరికీ ఇది అనుసంధానం కలిగిస్తుంది. ప్రభుత్వం చూడలేని వాటిని మీడియా చూస్తుంది, చూపిస్తుంది. అది ప్రజల కన్ను, ప్రజల అక్షరం. సమాజ ప్రయోజనాల కోసం ఈ తరుణంలో కొన్ని అంశాలలో ప్రభుత్వంతో కలసి నడుస్తుంది. అనేక అంశాలలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్నే నిలదీస్తుంది.

Updated Date - 2020-04-08T06:01:16+05:30 IST