ఆగ్రహం, నిగ్రహం

ABN , First Publish Date - 2020-06-18T05:59:49+05:30 IST

కృష్ణరాయలు కొండవీడును గెలిచినప్పుడు, కొండవీడేమి ఖర్మ, కటకం దాకా మనదే అని ఒక అంతఃపుర పరిచారిక ఆలపించిందట. రాజభక్తి, దేశభక్తి కలిగించే ఉద్వేగాలు సామాన్యమైనవి కావు. సాధారణ వ్యక్తుల్లోనే ఆవేశం కవిత్వమవుతుంటే కవుల...

ఆగ్రహం, నిగ్రహం

కృష్ణరాయలు కొండవీడును గెలిచినప్పుడు, కొండవీడేమి ఖర్మ, కటకం దాకా మనదే అని ఒక అంతఃపుర పరిచారిక ఆలపించిందట. రాజభక్తి, దేశభక్తి కలిగించే ఉద్వేగాలు సామాన్యమైనవి కావు. సాధారణ వ్యక్తుల్లోనే ఆవేశం కవిత్వమవుతుంటే కవుల వ్యక్తీకరణ సామాన్యంగా ఉంటుందా? ధైర్యసాహసాలూ త్యాగనిరతులూ అన్నీ అక్షరాలలోనే తొణికిసలాడుతుంటాయి. పరాయిదేశంతో మనకు తగవు వచ్చి, అది కాస్తా ఘర్షణగా, యుద్ధంగా పరిణమించినప్పుడు, జాతి మనోస్థైర్యానికి, నైతిక బలానికి యుద్ధగీతాలు అవసరమవుతాయి. చైనా చిచ్చు, ఇది మనకు మొదటి సారి కాదు. దాదాపు అరవయ్యేళ్లకింద, ఆశ్చర్యకరమైన రీతిలో చైనా యుద్ధం వచ్చింది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చాలా చర్చలు జరిగాయి కానీ, చివరకు మనమే వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ యుద్ధ సమయంలో దేశంలో చాలా ఆవేశాగ్రహాలు పెల్లుబికాయి. అప్పటికి పాకిస్థాన్‌తో వచ్చిన కశ్మీర్‌యుద్ధం, కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో జరిగింది కాబట్టి, దేశవిభజన నాటి విషాద, ఉద్రిక్త సంఘటనలలో భాగమైపోయింది. చైనాతో వచ్చిన యుద్ధమే, స్వాతంత్ర్యానంతరం ఎదురయిన మొదటి విదేశీవిపత్తు.


‘‘చైనీయ రుధిర నిర్ఝరుల స్నానము చేసి భరత సైనిక కోటి మరలుదాక... నిద్రపోవదు భారతభద్రకాళి’’ అని గుర్రం జాషువా నాటి కల్లోలసమయంలో ప్రతిజ్ఞచేశారు. విప్లవానంతరం కొత్త ఆదర్శాలతో ముందుకు నడుస్తున్న నవజనచైనా, పొరుగు దేశాలతో సంబంధాలకు పంచశీల వంటి ఆదర్శాలను ప్రతిపాదించిన చైనా పాలకులు– స్నేహానికి ద్రోహం చేశారని భారతదేశం నాడు భావించింది. ఒక్కసారిగా, చైనాకు సంబంధించినవన్నీ శత్రుపదజాలంలో చేరిపోయాయి. ‘‘చైనాలో చౌఎన్‌లై అంటే పెద్ద అబద్ధమడుగు’’ అన్నాడు బాలగంగాధర తిలక్‌. అక్కడితో ఆగలేదు. ‘‘నమ్మకు నవ్వలేని వాడిని, పువ్వులు చిదిమే వాడిని, బరిమీద వదిలిన పాముని, చైనా వాడిని, సినీతార మనస్సుని, మావోస్సేటుంగుని’’ అని హితవు చెప్పాడు. నాటి చైనా యుద్ధం భారతీయ విదేశాంగ విధానాన్ని, నెహ్రూ సామర్థ్యాన్ని, కమ్యూనిస్టుపార్టీల దేశభక్తిని, అమెరికా అంతర్జాతీయ తంత్రాన్ని– అన్నిటినీ చర్చకు తెచ్చింది.


చైనా యుద్ధం నాటి పరిణామాలు ఎటువంటి అనుభవాన్ని మిగిల్చినప్పటికీ, భారత్‌ క్రమంగా అందులోనుంచి కోలుకుని, 1965, 1971లలో పాకిస్థాన్‌తో యుద్ధాలలో విజయం సాధించి, 1999 నాటి స్వల్పకాలిక, మంద్రస్థాయి కార్గిల్‌ పోరాటంలోనూ పైచేయి సాధించింది. సైనికంగాను, అత్యాధునిక యుద్ధ వ్యవస్థలలోను భారతదేశం ఎంతో ముందుకు వెళ్లింది. అణ్వాయుధ దేశంగా కూడా పరిణమించింది. 1962 నాటికి ఇప్పటికి చైనాలో కూడా అక్కడి రాజకీయ వ్యవస్థలోను, ఆర్థిక వ్యవస్థలోను ఎన్నో మౌలిక మార్పులు వచ్చాయి. మావో మార్గం నుంచి చైనా తప్పుకుందని, ఇప్పుడక్కడ ఉన్నది ఫక్తు పెట్టుబడిదారీ వ్యవస్థ అని వచ్చే విమర్శలను ఆ దేశం ఏమీ ఖాతరు చేయడం లేదు. ప్రపంచీకరణను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని, తన దగ్గర ఉన్న అపారమైన చవక మానవశక్తిని ఉత్పాదకరంగం అభివృద్ధికి వాడుకోవాలని చైనా ప్రయత్నిస్తూ వచ్చింది. చొరవ, చురుకుదనం ఉన్న, ఆకలిగొన్న చైనా ఔత్సాహిక పారిశ్రామికులు అమెరికాతో సహా అన్ని ప్రపంచదేశాలలో కీలకభాగస్వాములుగా ఎదిగారు. దురదృష్టవశాత్తూ, భారతీయ ఆర్థిక వ్యవస్థ పురోగతి చైనాతో సరిసాటిగా లేకపోయింది. ఇంకా తృతీయ ప్రపంచదేశంగానే ఉన్నప్పటికీ, ప్రాంతీయ శక్తిగా, ప్రపంచశక్తిగా ఎదగాలన్న ఆకాంక్షను చైనా స్పష్టంగా, క్రియాశీలంగా ప్రకటిస్తున్నది. చైనా ప్రగతిని, దాని ఆలోచనలను గమనిస్తున్న భారత్‌, కొంత దగ్గరగాను, కొంత ఎడంగానూ ఉంటున్నది. సరిహద్దుల తగాదాకు చారిత్రకమయిన కారణాలున్నాయి కాబట్టి, వాటి పరిష్కారాన్ని వాయిదా వేస్తూ వర్తమానంలో సఖ్యంగా ఉండాలన్న ప్రయత్నమే ఇటీవలి కాలంలో రెండుదేశాల వైఖరిలో కనిపించింది. గత ఏడాది ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తూ, లద్ధాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనాను ఆందోళనకు గురిచేసినట్టున్నది. ఇప్పుడు ఘర్షణ జరిగిన గల్వన్‌ లోయలో యథాతథ స్థితిని చైనా భగ్నం చేస్తున్నదని భారత్‌ ఆరోపిస్తున్నట్టే, లద్దాఖ్‌ ప్రతిపత్తి మార్చడం కూడా యథాతథస్థితిని మార్చడమే అని చైనా అంటున్నది.


గల్వన్‌ సంఘటన అనంతరం వెంటనే స్పందించలేదని ప్రధానమంత్రిని ప్రతిపక్ష నాయకులు తప్పు పడుతున్నారు. చైనాతో జరిగిన ఘర్షణ విషయంలో ఆచితూచి స్పందించాలని కేంద్రంలోని అధికారపార్టీకానీ, కేంద్రప్రభుత్వం కానీ భావించవచ్చు. ‘డిప్లమటిక్‌’గా ఉండడం అంటే లౌక్యంగా, గోడమీది పిల్లిలా ఉండడం అనే అర్థఛాయ ఇంగ్లీషు వ్యవహారంలో ఉండవచ్చును కానీ, దౌత్యభావన తప్పేమీ కాదు. సోషల్‌మీడియా దేశభక్తులదేముంది, యుద్ధం చేద్దాం చేద్దాం అంటారు. ముందూ వెనుకా చూడకుండా యుద్ధంలోకి దిగితే నెహ్రూకు ఎదురైన విమర్శలు ఎదురుకావచ్చు. గల్వన్‌లో జరిగినది స్థానికమయిన సంఘటనో, చైనా అగ్రనాయకత్వం కూడా ఆ దారుణానికి వ్యూహరచన చేసిందో ఇంకా తెలియాలి. జరిగిననష్టానికి చైనాను నిలదీయవలసిందే. ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టవలసిందే. అంతకు మించి ఆలోచనలు దేశానికి మేలు చేయవు. శక్తిసామర్థ్యాల అంచనా, ప్రస్తుతం నెలకొని ఉన్న కరోనా విపత్తు వాతావరణం కూడా రెండుదేశాల పరిగణనలో ఉండాలి. సంతోష్‌బాబుతో సహా, ఈ దురదృష్టకర సంఘటనలో మరణించినవారంతా, యుద్ధరంగంలో మరణించిన వీరులే. వారి త్యాగం వృథా పోదు అని ప్రధాని అన్నారంటే అర్థం, పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతామని కాదు. సార్వభౌమాధికారం విషయంలో రాజీ ఉండదు అన్న ప్రకటన ఒక్కటి భారతప్రధాని మాటల్లో కీలకమయినది. అదే సమయంలో దౌత్య మార్గాలను అన్వేషించడం, అవాంఛనీయమైన పరిణామాలను నివారించడం దేశపాలకుల బాధ్యత. దేశప్రధాని, రక్షణ మంత్రి నిగ్రహంగానూ, వాస్తవిక దృష్టితోను వ్యవహరిస్తుండగా, వారి పార్టీ అభిమానులూ శ్రేణులే మీడియాలోనూ బయటా యుద్ధభాష మాట్లాడుతూ ఉండడం విచిత్రం, విచారకరం.

Updated Date - 2020-06-18T05:59:49+05:30 IST