ఇప్పుడు కూడా..?

ABN , First Publish Date - 2020-04-01T06:05:26+05:30 IST

ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటూ ఏవేవో చెప్పారు కానీ, ప్రళయ వైరాగ్యం గురించి ఎవరూ చెప్పలేదు. లోకం పుట్టి మునిగిపోతున్నప్పుడు, మనుషుల కళ్లు తెరుచుకుంటాయా? నహి నహి రక్షతి డుకృఞ్కరణే...

ఇప్పుడు కూడా..?

ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటూ ఏవేవో చెప్పారు కానీ, ప్రళయ వైరాగ్యం గురించి ఎవరూ చెప్పలేదు. లోకం పుట్టి మునిగిపోతున్నప్పుడు, మనుషుల కళ్లు తెరుచుకుంటాయా? నహి నహి రక్షతి డుకృఞ్కరణే, అని తెలివి కలుగుతుందా, లోకమంతా భ్రమ అని, స్వార్థం, లోభం, మదం మాత్సర్యం అన్నీ పాపాలే అని తెలిసివస్తుందా? మనుషులం పరస్పరం ప్రేమాదయాకరుణా చూపించుకుంటే ప్రపంచం క్షణికమైనా స్వర్గంగా మారుతుందని గ్రహింపు కలుగుతుందా?


కలగదేమో? మనిషి ప్రవృత్తి ఇంకా ఇంకా అరిషడ్వర్గాలవైపే మొగ్గు చూపుతుందేమో? అప్పుడెప్పుడో నలభయ్యేళ్ల కింద మింట ఎగిరే ఉపగ్రహం విరిగి మీద పడుతుందని తెలిసి, జనం ఏమి చేశారు? ఉన్న నాలుగురోజులు తెగ తిందాం తాగుదాం అనుకున్నారు, క్షణికమే కదా అని ఇంకా బిగుతుగా కావలించుకున్నారు. ఏ ద్వేషాన్నీ వదులుకోలేదు, ఏ ఆస్తినీ పంచిపెట్టలేదు.


ఒక రోగ కారక అర్ధజీవి, మనిషి నుంచి మనిషికి లంఘిస్తూ, ఉనికికే ప్రమాదం తెస్తున్న సమయంలో, మానవులు ఏమి చేయాలి? ఈ గండం గట్టెక్కడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనిషి అన్నది తప్ప మరొక తరగతిని ఆలోచనల్లోకి రానివ్వకూడదు. నిన్నటిదాకా, డబ్బుతోను, మతంతోను, కులంతోను, హోదాతోను, స్త్రీపురుష భేదంతోను, తెగతోను, ప్రాంతంతోను, రంగుతోను.. రకరకాలుగా చూపించిన తేడాలన్నిటినీ తుడిచిపెట్టుకుని, ఒకరికొకరం నిలబడాలి. కానీ, ప్రాణం పోతున్నా తేడాలని వదలని చరిత్ర మనది. ప్రాణాలు తీసైనా తేడాలను కాపాడుకునే ఘనత మనది. అందుకని, ఈ ప్రళయకాలం ఇవ్వవలసినంత వైరాగ్య జ్ఞానాన్ని, కావలసినంత మనుగడల జ్ఞానాన్ని ఇవ్వడంలేదు.


ఒక మత సంబంధ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల కారణంగా కరోనా ఆందోళనకరంగా వ్యాపిస్తున్న మాట నిజమే. అటువంటి ప్రమాదం ఏ రకమైన సమూహాల వల్లనైనా జరిగే అవకాశమున్నది. బాధ్యతారహితంగా మన పౌరులు ధిక్కరిస్తున్న లాక్‌డౌన్‌ నియమాల వల్ల కూడా జరగవచ్చు. జనతాకర్ఫ్యూ ప్రకటించిన మరుక్షణమే దుకాణాలపై దాడికి వెళ్లినట్టు వెళ్లిన జనాల వల్ల జరగవచ్చు. వేలాది, లక్షలాది మంది వలసకార్మికులు, తామున్నచోట మనుగడలేక తండోపతండాలుగా చేస్తున్న ప్రయాణాల ద్వారా కూడా జరగవచ్చు. ఇటువంటి సంఘటనలకు కుట్రసిద్ధాంతాలను ఆపాదించడం అంటే, ఈ కల్లోలంలోనూ మన పుర్రెలలో పాత వైరస్‌ తలెగరేస్తున్నదన్న మాట. కుట్రను ఒక దేశానికి ఆపాదించడమైనా, ఒక వర్గానికో ఒక శ్రేణికో ఆపాదించడమైనా, పరీక్షాకాలంలో మనం వదులుకోని అరిషడ్వర్గాలకే సూచిక. 


ఒకపక్క, కరోనా ముప్పు ముసురుకుంటున్నప్పటికీ, అమెరికా వాడు యుద్ధవిమానాలను మాత్రం కిందకు దింపలేదు. ఇరాక్‌నో ఇరాన్‌నో బెదిరించడానికి బాంబులు వేస్తూనే ఉన్నాడు, మార్చి 15 దాకా. ఇరాన్‌లో మహమ్మారి విజృంభించి అంతమందిని కబళిస్తున్నా కూడా, ఆ దేశం మీద ఆంక్షలను సడలించడానికి కూడా ట్రంపుగారికి మనసు రాలేదు. కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్న దేశం ఏమి యుద్ధం చేయగలదు? ప్రపంచమంతా లాక్‌డౌన్‌ కావడానికి ముందే కశ్మీర్‌లో లాక్‌డౌన్‌ అమలయింది. అక్కడ ఇంటర్నెట్‌ను బ్యాన్‌ చేశారు. సడలింపులలో భాగంగా పునరుద్ధరించారు కానీ, పురాతన 2జి స్థాయిలోనే అక్కడి కమ్యూనికేషన్లను అనుమతిస్తున్నారు. 4జి వేగం లేకపోవడం వల్ల, వైద్యసర్వీసులను అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను డాక్టర్లు చెబుతున్నారు. రాజకీయాలు, ఉద్యమాలు, నిర్బంధాలు తరువాత చూసుకోవచ్చు. ప్రాణాలు కాపాడాలి కదా ముందు, కనీసం వ్యాధిగ్రస్త ప్రాణాలు. 


కరోనా నుంచి ప్రధానంగా ఉన్న ముప్పు వయోధికులకు. వ్యాధి ప్రబలిన అనేక దేశాల్లో, వయోధికులనే కాదు, శిక్షలనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేశారు. జైళ్లలో వ్యాధి వ్యాపిస్తుందనే ఉద్దేశంతో, బంధుమిత్రులు కలవడానికి వీలులేకుండా ఆంక్షలు విధించారు. దానితో జైళ్లలో మగ్గుతున్నవారి కష్టాలు రెట్టింపయ్యాయి. కనీసం వయోధికులను, పోనీ, కనీసం రాజకీయకారణాలతో నిర్బంధించినవారిలో పెద్దవయసు వారిని, కనీసం తాత్కాలికంగా విడుదల చేయమని అడిగితే, ప్రాసిక్యూషన్‌ ససేమిరా అన్నది, న్యాయమూర్తి వారితో ఏకీభవించి, విడుదల కుదరదన్నారు. కరోనాతో పోరాడుతున్న వేళ, సుప్రసిద్ధ తెలుగు కవి, ఎనభైఏళ్ల వయోధికుడు వరవరరావును జైలులో నిర్బంధించి ఉంచడం ఈ వ్యవస్థకు అంత ముఖ్యమా? ప్రాణభయంతో అంతా సొంతంగా గృహనిర్బంధంలో ఉంటున్న ఈ కాలంలో, జైళ్లలోని వయోవృద్ధులను ఒకసారి తలచుకోవడం ఈ సమాజానికి అవసరం. 


ఒక స్తంభనలో ఉన్నామంటే, ఎక్కడి వాటిని అక్కడ నిలుపుదల చేసి, ఒక దశ దాటిన తరువాత, తిరిగి ప్రయాణం ప్రారంభిస్తామని అర్థం. ఈ దశలో వైరుధ్యాలు, శత్రుత్వాలు పక్కనపెట్టాలి. ఇది మనిషికీ, ఒక వ్యాధికీ మధ్య పోరాటం కదా? ఈ దశను అదునుగా తీసుకుని పైచేయి కోసం ఎవరూ చూడకూడదు. ఆప్ఘనిస్థాన్‌లో ఏదో ఒక ఒప్పందం జరిగింది. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని భంగపరిచే విధంగా దాడులు, ఘర్షణలు సరిఅయిన పద్ధతి కాదు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు కూడా ఇప్పుడు ఘర్షణలు జరగడంలో అర్థం లేదు. యాంబుష్‌లు జరిపి, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను చంపడం కానీ, ఎదురుకాల్పుల్లో మావోయిస్టులను చంపడం కానీ అసందర్భం. ఇప్పటి ప్రాధాన్యాలను గుర్తించి, ఉభయపక్షాలూ సంధి పాటించాలి. ఈ సంధి రేపటి అవగాహనకు కూడా ఉపయోగపడవచ్చు. 


ఈ సమయంలో క్యూబాను అభినందించకుండా ఉండలేము. ఫిడెల్‌ కాస్ట్రో తప్పుకున్నా, రౌల్‌ కాస్ట్రో తప్పుకునే దశలో ఉన్నా, ఆ దేశం తన సత్సంప్రదాయాలను వదులుకోలేదు. ప్రజారోగ్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన క్యూబా మానవవిలువలలో కూడా తన విశిష్టతను చాటుకున్నది. స్వయంగా తను కరోనాను ఎదుర్కొంటూనే ఇతరులకు సాయం చేస్తున్నది. ఏ దేశమూ తన తీరాన్ని తాకడానికి అంగీకరించనప్పుడు, కరోనా వ్యాధిపీడితులతో ఉన్న ఒక బ్రిటిష్‌ నౌకను తన రేవుకు పిలిచి, వైద్యం అందించింది. అమెరికా అండలోనే ఉండే బ్రిటన్‌ క్యూబాకు మిత్రదేశమేమీ కాదు. నాటో కూటమిలో ఉండే ఇటలీకి వైద్యుల బృందాన్ని పంపింది. ఈ మంచితనమే కదా, ప్రపంచానికిప్పుడు కావల్సింది?

Updated Date - 2020-04-01T06:05:26+05:30 IST