అతని కోసం కూడా...

ABN , First Publish Date - 2020-11-06T05:59:01+05:30 IST

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున ముంబయి వర్లిలోని...

అతని కోసం కూడా...

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున ముంబయి వర్లిలోని నివాసంలో అరెస్టు చేయడం అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. ఆయనకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి– పోలీసులకు మధ్య కొంతకాలంగా తగాదా నడుస్తున్నది. అదేమీ చిన్న తగాదా కాదు. బిజెపి–శివసేన మధ్య ఉన్న ఘర్షణ అది. రెండు హిందూత్వ పార్టీల మధ్య స్పర్థ అనుకోవచ్చు. కేంద్రీకరణ కోరే జాతీయ అధికారపార్టీకి, ఎంతో కొంత సొంత ప్రతిపత్తి కోరే ప్రాంతీయ అధికారపార్టీకి మధ్య ఏర్పడిన వైరం అది. ఏ ఏ కారణాలు ఎట్లా పరిణమించి ఇట్లా అర్ణబ్‌ అరెస్టు జరిగినప్పటికీ, అది దేశాన్ని కొన్నేళ్లుగా మోతమోయిస్తున్న నయా పాత్రికేయానికి, పలుకు చల్లగా ఉండే సజ్జన పాత్రికేయానికి మధ్య విలువల చర్చను కూడా తీసుకువచ్చింది. 


గోస్వామిది ఒక తరహా టీవీ జర్నలిజం. మరెవరూ పోటీకి రాకపోతే, దాన్ని భారతదేశంలో తీర్చిదిద్దిన ఘనత ఆయనే తీసుకోవచ్చు. ఆ తరహాను జర్నలిజమని పిలవడమే తప్పు అని వాదించేవారు దేశంలో తగినంతమందే ఉన్నారు. వర్థమాన హిందీ నటుడు సుశాంత్‌ రాజ్‌పుట్‌ దురదృష్టకరమైన ఆత్మహత్య అనంతరం, బాలీవుడ్‌పై గురిపెట్టి నడిచిన మీడియా యుద్ధానికి గోస్వామి, ఆయన రిపబ్లిక్‌ టీవీ నాయకత్వం వహించాయి. బాలీవుడ్‌లో సువ్యవస్థితులైన సీనియర్లు కొత్తవారిని ఎదగనివ్వడం లేదని, మాదకద్రవ్యాలు బాలీవుడ్‌లో విపరీతంగా వాడుకలో ఉన్నాయని, సుశాంత్‌ స్నేహితురాలు అతని మరణానికి కారణమని– జాతీయ న్యూస్‌ మీడియా కొవిడ్‌–19 కల్లోలం దేశాన్ని కుదిపివేస్తున్న సమయంలో నిరంతర కథనాలను ప్రసారం చేసింది. ఈ మొత్తం ప్రచారయుద్ధం తమ ప్రభుత్వాన్ని, పోలీసులను లక్ష్యంగా పెట్టుకుని సాగుతున్నదని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలకు ఉపక్రమించింది. మొదట టిఆర్‌పి రేటింగుల విషయంలో జరుగుతున్న అవకతవకలను బొంబాయి పోలీసులు బయటపెట్టారు. చానెల్‌ రేటింగు కోసం అక్రమ మార్గాలకు పాల్పడుతున్న అభియోగం ఉన్న సంస్థల్లో రిపబ్లిక్‌ టీవీ కూడా ఉన్నది. రియా చక్రవర్తి విషయంలోను, అంతకు ముందు ఇద్దరు సాధువులను దొంగలుగా భ్రమించి స్థానికులు కొట్టి చంపిన ఉదంతంలోను, మహారాష్ట్ర ప్రభుత్వం, ఉద్ధవ్‌ ఠాక్రే, ముంబై పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ పేర్లను గొంతు చించుకుని పెడబొబ్బలు పెట్టిన అర్ణబ్‌ గోస్వామి టిఆర్‌పి వివాదం తరువాత తగ్గవలసి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన అప్రతిష్ఠ కుంగదీస్తున్న సమయంలో, ఇప్పుడు ఈ అరెస్టు జరిగింది. ఈ అరెస్టు జర్నలిజానికి సంబంధించి జరిగింది కాదు. 2018లో రిపబ్లిక్‌ టీవీ ఆఫీసులో అలంకరణ పనులను చేసిన ఒక ఆర్కిటెక్ట్‌కు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల అతను, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బు ఇవ్వకపోవడం వల్లనే తమ కుటుంబ పెద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కూతురు, భార్య ఎప్పటినుంచో ఆరోపిస్తు న్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. శివసేన ప్రభుత్వం పట్టించుకుంది. 


ఉదారవాద, వామపక్షాలకు వ్యతిరేకంగా, యథాతథ వాదాన్ని, మితవాదాన్ని, మెజారిటీ మతవాదాన్ని ఆయన వార్తా ప్రసారంలో ఒక వైఖరిగా తీసుకున్నారు. అతని పద్ధతితో దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, ప్రజాసంస్థలు, మేధావులు, క్రియశీలురు విసిగిపోయారు. ప్రజల హక్కుల విషయంలో కనీస గౌరవం లేకుండా, బాధితులను కూడా టీవీ బోనులో మరింత బాధ పెట్టే వార్తాకార్యక్రమాలు అతనివి. తానే దేశం, తానే జాతి. బిగ్గర గొంతు. భాగస్వాములను మాట్లాడనివ్వని గొంతు. అమెరికాలో ‘ఫాక్స్‌ న్యూస్‌’కు పదింతలు రిపబ్లిక్‌ టీవీ. 


అర్ణబ్‌ గోస్వామి శివసేన ప్రభుత్వంతో స్నేహంగా ఉంటే, ఇప్పుడీ కేసును రంగంమీదకు తెచ్చేవారా? గోస్వామి శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార యుద్ధం చేస్తున్నందువల్లనే కదా, అతనికి గుణపాఠం చెప్పాలని అనుకున్నది? అటువంటప్పుడు, జర్నలిస్టుకావడం వల్లనే గోస్వామికి వేధింపులు అన్నది నిజమే కదా? ఈ ప్రశ్నలు సహజమైనవే. గోస్వామి విషయంలో ఒక్క బిజెపి తప్ప మరే ప్రధాన రాజకీయపార్టీ ఖండన ప్రకటనలు చేయలేదు. అంటే, అతనికి ఉన్న రాజకీయ అనుబంధం స్పష్టమవుతున్నది. ఎడిటర్స్‌ గిల్డ్‌ గోస్వామి అరెస్టును ఖండించింది. గోస్వామి మార్గంతో ఏకీభవించకపోయినా, అరెస్టును అంగీకరించలేమని నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ వ్యాఖ్యానించింది. ఏ కారణం చేత అయినా సరే, పాత్రికేయులను, పత్రికా ప్రసార సంస్థలను ఇబ్బందిపెట్టే పని చేయడం సరైనది కాదు. తగిన శాస్తి జరిగిందని మౌనంగా ఉండడమూ మంచిది కాదు. ఒక విలువగా అది పొరపాటు. పాత్రికేయుల అరెస్టులు, వారిపై కుట్ర కేసులతో సహా అనేక సందర్భాలలో గోస్వామి వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూనే, అతని విడుదల కోసం కూడా డిమాండ్‌ చేయాలి. 


అదే సమయంలో, అర్ణబ్‌ గోస్వామి విషయంలో అనేకమంది చదువరులు, వీక్షకులు, ఆలోచనాపరులు ఒక నిర్లిప్తతతో ఉండడం గమనించవలసి ఉన్నది. అతని పద్ధతులు, ఆలోచనలు, అప్రజాస్వామికమయిన నిర్వహణ అతని స్థాయిని కుదించాయి. ఎంతో గౌరవాన్ని పొందవలసిన స్థానంలో ఉన్న వ్యక్తికి సమాజం తగినంత పరిగణన ఇవ్వనప్పుడు అంతకు మించిన గుణపాఠం, స్వీకరించగలిగితే, మరొకటి ఉండదు.

Updated Date - 2020-11-06T05:59:01+05:30 IST