కుట్ర సిద్ధాంతం

ABN , First Publish Date - 2020-10-07T06:11:54+05:30 IST

సత్యాన్ని ఎదుర్కొనలేక, అబద్ధం దగ్గర ఆశ్రయం పొందితే, ఆ క్షణానికి తప్పించుకోవచ్చును కానీ, అక్కడితో ఆ ఉదంతం ముగిసిపోదు...

కుట్ర సిద్ధాంతం

సత్యాన్ని ఎదుర్కొనలేక, అబద్ధం దగ్గర ఆశ్రయం పొందితే, ఆ క్షణానికి తప్పించుకోవచ్చును కానీ, అక్కడితో ఆ ఉదంతం ముగిసిపోదు. సత్యం ప్రశ్నలు వేస్తున్నకొద్దీ అబద్ధం మీద అబద్ధం పుట్టించవలసివస్తుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం హథ్రాస్‌ అత్యాచారం, హత్య విషయంలో సత్యంతో ముఖాముఖి తలపడడానికే నిర్ణయించుకున్నట్టుంది. మరణవాంగ్మూలానికి ఉన్న శక్తి మరి దేనికీ లేదు. స్త్రీలపై అత్యాచారాల విషయంలో బాధితురాలి కథనానికి ఉన్న విలువ మరి దేనికీ లేదు. అయినా, యుపి పోలీసులు అత్యాచారం జరగలేదనే తమ వాదనను పునరుద్ఘాటిస్తున్నారు. అంతే కాదు, తమ రాష్ట్రంలో కల్లోలం సృష్టించడానికి అంతర్జాతీయ కుట్ర జరిగిందని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. శాంతి భద్రతల రక్షణ కోసం, కుటుంబ సభ్యుల కోరిక మేరకే, వారి సమక్షంలోనే అర్ధరాత్రి వేళ అంత్యక్రియలు జరపవలసి వచ్చింది తప్ప, అందులో వేరే ఉద్దేశ్యాలేవీ లేవని కూడా అత్యున్నత న్యాయస్థానం ముందు యుపి ప్రభుత్వం నివేదించింది. పై వాదనలు, ప్రకటనలు ఎంత మేరకు విశ్వసనీయంగా ఉన్నాయో ఎవరికి వారు తేల్చుకోవాలి. ఒక సామాజిక కార్యకర్త వేసిన వ్యాజ్యం మీద విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సాక్షుల రక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఎందుకింత తెలివితక్కువగా ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో తెలియడం లేదు. ఏదో కుట్ర ఉన్నదని చెప్పడానికి చూపుతున్న ఆధారాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని చూడడం కూడా ప్రాసిక్యూషన్‌ చేయలేదు. అమెరికాలో ‘‘బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌’’ ఉద్యమంలో ఉపయోగించిన కరపత్రాలను యథాతథంగా దించి, ఆధారాలుగా అందించారు. అందులోని అంశాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ‘ది వైర్‌’ పత్రిక సవివరంగా రాసింది. చూడబోతే, యుపి ప్రభుత్వం మరో భీమా కోరేగావ్‌ కేసు వంటి కేసును తయారుచేయబోతున్నట్టు ఉన్నది. ప్రభుత్వం మీద రాజకీయ, ఇతర కుట్రలు జరిగినట్టు అనేక కేసులను వివిధ పోలీసు స్టేషన్లలో నమోదు చేశారు. ఈ కుట్రలో గుర్తు తెలియని అనేక మంది వ్యక్తులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అని రాశారంటే, ఎవరిని కావాలంటే వారిని అందులో చేర్చే అవకాశాన్ని ఉంచుకోవడం అన్న మాట. భీమ్‌ ఆర్మీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ సరే, ఆయన మీద ఇప్పటికే 144 సెక్షన్‌ ఉల్లంఘన, అంటువ్యాధుల చట్టం ఉల్లంఘన కేసులు పెట్టారు, రాజద్రోహాలు గట్రా కూడా త్వరలో పెట్టవచ్చు. ఆయనతో పాటు, ఏఏ రాజకీయ నాయకులు ఈ సారి  కుట్రకేసుల్లో చేరతారో చూడవలసి ఉన్నది. జరిగినదాన్ని మీడియా కుట్ర అని కూడా అంటున్నారు కాబట్టి, ఈ సారి హథ్రాస్‌ కుట్రకేసులో జర్నలిస్టులు అనేకులు ఏళ్ల తరబడి ఖైదు కావచ్చు. 


దాడి చేసిన వ్యక్తి, తన మీద బాధితులు పెట్టిన కేసుకు ప్రతిగా, తనమీదే దాడి జరిగినట్టుగా పోటీ కేసు పెట్టడం గురించి తరచు వింటూ ఉంటాము. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దళితుల ఆగ్రహాన్ని ఎదుర్కొనడానికి పోటీ కేసు పెడుతున్నదా? ఎవరెవరు తనపై దాడిచేసి, రేప్‌ చేశారో బాధితురాలు చెప్పిన వాంగ్మూలం ఉన్నది, తమకు చివరి చూపు కూడా లేకుండా అంత్యక్రియలు చేశారని బాధితురాలి కుటుంబం మీడియా ముందు చేసిన ప్రకటన ఉన్నది, ఆ రాత్రి అంత్యక్రియలు ఎట్టా జరిగాయో ప్రత్యక్షంగా చూసి వీక్షకులకు, పాఠకులకు చెప్పిన జర్నలిస్టులు ఉన్నారు, అయినా, అంతా అబద్ధమని ప్రభుత్వం చెప్పదలచుకున్నది. బహుశా, దారికి రాకపోతే కుటుంబసభ్యులతో సహా సాక్షులుగా ఉన్నవారందరినీ కుట్రదారులని అభియోగం మోపనున్నది. అందుకేనేమో, న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సాక్షుల భద్రత గురించి సుప్రీంకోర్టులో ప్రస్తావించవలసి వచ్చింది.


తప్పు చేసినవారు అధికారపార్టీకి చెందినవారు కాదు. ఏ మంత్రికీ, అధికారికీ సంబంధించిన నేరం కాదు. మరి ప్రభుత్వం ఎందుకు దోషుల విషయంలో ఔదార్యం, బాధితులపై కాఠిన్యం చూపుతున్నది? ఎందుకు ఉపశమన హస్తం చాచలేకపోతున్నది? బాధితులకు సాంత్వన చేకూర్చడానికి వచ్చేవారిని కపటప్రేమికులని, కుట్రదారులని విమర్శిస్తున్నది? ఉద్యమిస్తున్నవారిని హింసావాదులంటున్నది? ఏదో ఎక్కడో కుట్ర జరిగిందని చెప్పి, మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నది? ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, చట్టాలు కఠినంగా అమలుజరిగేట్టు చూస్తే చాలు. అది విధి. వాజపేయి చెప్పినట్టు, అది రాజధర్మం. 


చట్టాల ఆధారంగా ప్రభుత్వానికి నేరాల మీద ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఆచరణలో ప్రతిఫలించాలంటే, ప్రభుత్వంలో ఉన్నవారికి కూడా ఆ అవగాహన విచక్షణ ఉండాలి, సంకల్పమూ ఉండాలి. ఆడపిల్లలకు సరైన పెంపకం ఇవ్వకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయన్న అవగాహన అధికారంలో ఉన్నవారికి ఉంటే, ఇక చట్టం ఏమి చెబితే మాత్రమేమి ప్రయోజనం? ఆడవాళ్లు అణగిమణిగి ఉండాలని, కులవ్యవస్థ గొప్పదని, రిజర్వేషన్లు పొరపాటని– ఇటువంటి గతకాలపు నీతులతో తాదాత్మ్యం చెందేవారికి, అత్యాచార నేరస్థుల మీద తగినంత ఆగ్రహం రాకపోవడం సహజమే. నేరస్థుల తరఫున నిస్సిగ్గుగా, బోరవిడిచి మాట్లాడుతున్న గుంపుల అమానవీయతను చూడవలసిన దుస్థితిలో ఉన్నాము. ఒక సరికొత్త సామాజిక, సాంస్కృతిక ప్రభంజనం ముంచెత్తి, కులాహంకారంతో సహా సమస్త అంతరాలనూ కల్మషాలనూ తుడిచిపెట్టేస్తే తప్ప ఈ హీనత్వం, నీచత్వం పోదు.

Updated Date - 2020-10-07T06:11:54+05:30 IST