సామూహిక సద్వర్తన

ABN , First Publish Date - 2020-03-25T08:12:27+05:30 IST

దేశవ్యాప్తంగా ఇరవయ్యొక్కరోజుల ‘లాక్‌ డౌన్‌’ ను ప్రధానమంత్రి ప్రకటించారు. ఈకాలంలో దేశ ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, కరోనాను కట్టడి చేయడానికి అదొక్కటే మార్గమని ఆయన అన్నారు...

సామూహిక సద్వర్తన

కరోనా మీద యుద్ధం–2

దేశవ్యాప్తంగా ఇరవయ్యొక్కరోజుల ‘లాక్‌ డౌన్‌’ ను ప్రధానమంత్రి ప్రకటించారు. ఈకాలంలో దేశ ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, కరోనాను కట్టడి చేయడానికి అదొక్కటే మార్గమని ఆయన అన్నారు. వైరస్‌ వ్యాప్తి గురించిన ఆందోళనకరమైన సమాచారం ఉండడం వల్ల ఇటువంటి తీవ్రనిర్ణయం తీసుకున్నారో, లేక, ఇంతటి జాగ్రత్త ద్వారా మాత్రమే పెనుప్రమాదాన్ని నివారించవచ్చునన్న అంచనాకు వచ్చారో తెలియదు కానీ, ఈ కట్టుబాటును భారతసమాజం తలదాల్చకతప్పదు. తన కోసం, తన ఉనికి కోసం, మనుగడ కోసం, భవిష్యత్తు కోసం. 


ఇటువంటి పరిస్థితి మునుపు మనకు పరిచితమైనది కాదు. పెద్ద ఎత్తున మృత్యువును విస్తరింపజేసే వ్యాధుల నివారణలో కూడా ఇటువంటి పద్ధతులను అనుసరించి ఉండలేదు. ఈ కోవిడ్‌ 19 ప్రత్యేకత, వేగం– ఇటువంటి వ్యూహాన్ని అనివార్యం చేస్తున్నాయి. ఇది ప్రజల సొంత సమస్య, సొంత పరిష్కారం కాబట్టి, ఈ విపత్తు నిర్వహణలో ప్రజలు పాలుపంచుకోవాలి. వారు కేవలం ఆదేశాలను స్వీకరించేవారుగానో, పోలీసు బలగంతో నియంత్రించబడేవారిలాగానో మిగిలిపోతే, ఆశించిన ఫలితం సమకూరదు. వ్యాధిసోకినవారిని, సోకుతుందని అనుమానిస్తున్నవారిని చూసుకోవడానికి వైద్యసిబ్బంది కష్టపడుతున్నారు. రానున్న కాలంలో వారిసేవలు మరింత విస్తృతంగా, నిర్విరామంగా అవసరమవుతాయి. మరొకవైపు శాంతిభద్రతల నిర్వహణకు పోలీసుయంత్రాంగమూ అహర్నిశలు కష్టపడవలసి ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమయ్యే మానవీయ పరిస్థితిలో తగిన ప్రజాసదుపాయాలను కల్పించడానికి అధికారయంత్రాంగం కూడా శ్రమించవలసి ఉంటుంది. అయితే, రాజకీయ, పరిపాలనా నేతల నిర్దేశం, అధికారయంత్రాంగం ఆచరణ, వైద్యఆరోగ్య సిబ్బంది అంకిత భావం ఇవి మాత్రమే సరిపోతాయా? వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ, వృత్తి, విద్యా శ్రేణుల ప్రతినిధులు, సంఘసేవకులు, పౌరసమాజంగా భావించే విశిష్ట సామాజికులు– ఈ ఆపత్కాలంలో చేయడానికి ఏమీ లేదా? 


ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధుల శ్రేణులన్నీ భాగస్వామ్యం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన నిర్దేశం విలువైనది. ఈ ఆదేశం ఇంతకుముందే వెలువడి ఉంటే మరింత ప్రయోజనం ఉండేది . అగ్రనేత చెప్పేదాకా ఆగకుండా, మంత్రులు, శాసనసభ్యులతో సహా వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు తమంతట తామే ప్రజాక్షేత్రంలోకి దూకి ఉండవలసిన మాట. కరోనా ఉపద్రవం అత్యంత సంక్లిష్ట విషాద సన్నివేశాలను సృష్టిస్తున్నది. మనుషుల స్వచ్ఛంద నిగ్రహం, విచక్షణ, వివేకం, బాధ్యతాయుత వర్తన అవసరమైన సందర్భం ఇది. క్రమశిక్షణాయుతమైన, ఆలోచనాపూర్వకమైన ప్రవర్తనను విశాల ప్రజానీకం నుంచి స్వచ్ఛందంగా ఆశించడం అత్యాశ అన్న వ్యాఖ్యానాలు వినవలసిన పరిస్థితి ఏర్పడింది. మానవజాతి పురోగతి అంతా సమష్టిగా జరిగిందే. సామ్రాజ్యాలు నిర్మించినా, కూల్చినా, నాగరికతలను సృష్టించినా, శాస్త్రవిజ్ఞానాలను ఆవిష్కరించినా– అంతా సమష్టి కోసం జరిగిన సామూహిక ప్రయత్నమే. కానీ, కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు విడి మనుషులు వ్యక్తులుగా భయంతోనో, స్వార్థంతోనో వ్యవహరించవచ్చును కానీ, అటువంటి సందర్భాలలోనే తెగింపుతో, త్యాగంతో వ్యవహరించిన సమూహాలను, వర్గాలను చరిత్రలో చూస్తాము. ఎందుకు, ఇప్పుడు ఈ ప్రమాద సమయంలో, మృత్యువుతో చెలగాటమాడే విధంగా ప్రవర్తనలుంటున్నాయి? కనీస విజ్ఞతను, ఆలోచనను ఎందుకు ప్రదర్శించడం లేదు? 


విద్యాగంధం లేనివారో, లోకజ్ఞానం లేనివారో అయితే అర్థం చేసుకోవచ్చు. చదువుకున్నవారు, విదేశాలకు ప్రయాణించేవారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, శాసనసభ్యులు– అందరూ సమష్టి కోసం విధించుకున్న నిబంధనలను ఉల్లంఘించాలని ప్రయత్నించేవారే? తమకేమీ కాదనే పిచ్చి నమ్మకంతో అందరి ఆరోగ్యాలనూ ప్రమాదంలో పడవేసేవారే? విమానాశ్రయాలలో తనిఖీలు చేస్తారనే ఉద్దేశంతో జ్వరంబిళ్లలు మింగేవారిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఇతరుల పట్ల బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం, మరో వైపు, వ్యాధి సోకినవారిని, వారి కుటుంబసభ్యులను, క్వారంటైన్‌ అయినవారిని వెలివేసేట్లు చూడడం, చివరకు కరోనా వ్యాధిగ్రస్తులకు కానీ, అనుమానితులకు కానీ చికిత్సలు చేసే వారిని కూడా అభ్యంతరపెట్టడం చూస్తున్నాము. ఇవన్నీ కేవలం అవగాహనారాహిత్యాలే కాదు, కొంత మూఢత్వం కూడా ఇందులో ఇమిడి ఉన్నది. కరచాలనం వల్ల రాదని తెలిసినా హెచ్‌ఐవి పేషెంట్లను వెలివేయడం చూశాము. అంటువ్యాధి కాకపోయినా కుష్టురోగులను అసహ్యించుకోవడం చూశాము. అదే కోవలో కరోనా వ్యాధి విషయంలో, తమకు అది సోకదు అన్న అలక్ష్యం దగ్గరనుంచి, అది సోకినవారు సమాజంలో ఉండదగనివారు అన్న భావం దాకా ఉంటున్నాయి. వీటిని తొలగించవలసిన బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరూ కరోనా పరిధిలో ఉన్నవారేనని, పరస్పరం సహకరించుకుంటే తప్ప దాన్ని నివారించడమో, నిదానించడమో చేయలేమని అవగాహన కలగాలి. అది పోలీసులు ఇవ్వగలిగేది కాదు.


ఈ సుదీర్ఘమైన లాక్‌డౌన్‌, అందులోనూ వ్యాధివాప్తి గురించిన ఉద్రిక్తత మనుషులను కలచివేస్తాయి. కానీ, ఏ పూటకు ఆపూట సంపాదించుకుని బతికేవారు, బొటాబొటి సంపాదనలతో బతుకు ఈడ్చేవారు– ఈ కాలంలో అదనంగా మరో పోరాటం చేయవలసి ఉంటుంది. ఆహారధాన్యాలను, నిత్యావసర ఖర్చులకు కొంత మొత్తాన్ని ఇస్తామని రాష్ట్రప్రభుత్వాలు చెప్పాయి. కేంద్రం కూడా అందులో చేయిచేసుకోవచ్చు. కానీ, పత్రాలూ లెక్కలూ లేని వలసజీవులు, కుటుంబావసరాలకు అధిక మొత్తాలు అవసరమైన ఆపన్నులు కష్టపడతారు. సరుకుల కొరత, భారీ డిమాండ్‌ స్వార్థాన్ని పెంచిపోషిస్తుంది. ఇవన్నీ శాంతిభద్రతల పరిస్థితులకు దారితీయవచ్చు. దండోపాయం ఒక భయకారకంగా ఉండవచ్చునేమో కానీ, అది తరణోపాయం అయితే కాదు. ఈ గృహనిర్బంధం తమ మనుగడను దెబ్బతీయదని అనుకున్నప్పుడే, ప్రజలు సహకరిస్తారు.

Read more