హాంకాంగ్‌లో చిచ్చు!

ABN , First Publish Date - 2020-05-29T05:57:45+05:30 IST

చైనాఅనుకున్నదే చేసింది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్నీ, వేర్పాటువాదాన్నీ, విదేశీ జోక్యాన్నీ నివారించే పేరిట అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించే జాతీయ భద్రతా చట్టాన్ని చైనా పార్లమెంటు ఆమోదించింది...

హాంకాంగ్‌లో చిచ్చు!

చైనాఅనుకున్నదే చేసింది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్నీ, వేర్పాటువాదాన్నీ, విదేశీ జోక్యాన్నీ నివారించే పేరిట అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించే జాతీయ భద్రతా చట్టాన్ని చైనా పార్లమెంటు ఆమోదించింది. హాంకాంగ్‌లో తొలిసారిగా చైనా భద్రతాదళాలు ప్రత్యక్షంగా ప్రవేశించి చైనాకు వ్యతిరేకంగా మాట్లాడినవారినీ, ఆదేశాలను ధిక్కరించినవారినీ దేశద్రోహులాగా ప్రకటించి వారి పనిపడతాయి. బిల్లు ఆమోదం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలను చైనా పూచికపుల్లలా తీసిపారేసింది. చైనా మాటను శిరసావహించే హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ అధికారి కేరీ ల్యామ్‌ కూడా ఈ చట్టాన్ని శిరసావహిస్తానని అంటున్నారు కనుక, ఒకే దేశం– రెండు వ్యవస్థలన్న గతకాలపు డెంగ్‌ హామీ పూర్తిగా వీగిపోయినట్టే. 


ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లదంటూ చైనా ఏవో కథలు చెబుతున్నది కానీ, అమెరికా మాత్రం హాంకాంగ్‌ ఇక స్వతంత్ర నగరం కాదని తేల్చేసింది. చైనానుంచి అది స్వేచ్ఛగా లేదని ప్రకటించడం ద్వారా హాంకాంగ్‌మీద అమెరికా పలు కఠినమైన నిర్ణయాలతో విరుచుకుపడబోతున్నది. ఈ అంతర్జాతీయ వాణిజ్య నగరానికి ఇంతకాలమూ ఇచ్చిన స్పెషల్‌ ఎకనామిక్‌ స్టేటస్‌ను ఉపసంహరించడతో పాటు, వీసాలు, సుంకాలు ఇత్యాది అనేకాంశాల్లో తీవ్రమైన మార్పుచేర్పులు జరగవచ్చు. ఆర్థిక, వాణిజ్యాంశాల్లో ప్రధాన చైనాతో అమెరికా ఎలా వ్యవహరిస్తున్నదో ఇకపై హాంకాంగ్‌తోనూ అదేవిధంగా ఉంటుందని అంటున్నారు. హాంకాంగ్‌లో ఉంటున్న మూడులక్షలమంది బ్రిటిషర్లకు భవిష్యత్తులో బ్రిటిష్‌ పౌరసత్వానికి ఇబ్బంది లేకుండా వారి వీసా హక్కులను పొడిగించాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. స్వేచ్ఛకు, పౌర హక్కులకు తలమానికంగా ఉన్న హాంకాంగ్‌ అభివృద్ధిలో అంతర్జాతీయ సమాజం పాత్ర అధికంగా ఉన్నమాట చైనా మరిచిపోయిందని అమెరికా మిత్రదేశాలు విమర్శించాయి. ఇప్పటికే అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు చైనా దెబ్బకు జడిసి హాంకాంగ్‌నుంచి తరలిపోయేందుకు సిద్ధపడుతున్న దశలో, ఈ కొత్త చట్టం ఆ పని వేగంగా పూర్తయ్యేట్టు చేయవచ్చు.


బిల్లు ఆమోదం పొందగానే హాంకాంగ్‌ మరింత వేడెక్కింది. చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు జోరందుకున్నాయి. హాంకాంగ్‌ పాలనా వ్యవస్థ అనుమతి కూడా అవసరం లేని రీతిలో ఈ కొత్తచట్టాన్ని చైనా నేరుగా రుద్దిందని అంటున్నారు కనుక, ఒక్కదెబ్బతో చైనా అంతర్జాతీయ హామీలన్నింటినీ తుంగలో తొక్కినట్టే. 1997లో ఈ నగరంమీద బ్రిటన్‌కున్న లీజు ముగిసి, చైనా చేతికి వస్తున్నప్పుడే తీవ్రమైన అల్లర్లు జరిగాయి. వాటిని ఉపశమింపచేసేందుకు డెంగ్‌ అనేక హామీలు ఇచ్చారు. చైనాలో అమలయ్యే విధానాలేవీ ఇక్కడ అమలుకావనీ, యాభైయేళ్ళపాటు, 


అంటే, 2047వరకూ పాతవిధానాలనే కొనసాగిస్తూ దాని స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు భంగం రానివ్వబోమని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అదే అన్ని శాసనాలు, నిర్ణయాలు చేసుకోవచ్చునన్న ఆ హామీ క్రమంగా వీగిపోవడం ఆరంభమైంది. సర్వాధికారాలు దఖలు పడ్డ జిన్‌పింగ్‌ హాంకాంగ్‌ను పూర్తిగా దారికి తెచ్చుకొనేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. గత ఏడాది నేరస్తుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌ నెలల తరబడి రగిలిపోయింది. ఇకపై అటువంటి పరిస్థితులకు తావివ్వకుండా చైనా తరహాలోనే హాంకాంగ్‌నూ నియంత్రించాలని పాలకులు నిర్ణయించుకున్నారు. ఇకపై హాంకాంగ్‌లోనూ ఎవరూ నోరువిప్పకుండా, తలెత్తకుండా చూసేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. రాజకీయ సంస్కరణల గురించి రాసినందుకు నోబుల్‌ విజేతను సైతం దశాబ్దకాలంగా జైల్లో ఉంచినట్టే, ఇకపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడిన, రోడ్లమీదకు వచ్చిన హాంకాంగ్‌ పౌరులను జైళ్ళలో కుక్కవచ్చు. అమెరికా చైనా మధ్య వేడి మరింత పెంచే ఈ నిర్ణయంతో పాటుగానే, ‘శాంతియుత తైవాన్‌ పునరేకీకరణ’ ఉద్దేశాన్ని కూడా చైనా ఈ మారు అధికారికంగా వెలిబుచ్చింది. హాంకాంగ్‌ తరువాత మా లక్ష్యం తైవాన్‌ అని హెచ్చరించడం దాని ఉద్దేశం కావచ్చు. చైనా దూకుడుమీద గతంలో ఎన్నడూ లేనంత దృష్టిపెట్టాల్సిన అవసరం భారతదేశానికి ఉన్నది.

Updated Date - 2020-05-29T05:57:45+05:30 IST