ముప్పు ముంగిట

ABN , First Publish Date - 2020-03-24T06:09:09+05:30 IST

కనీవినీ ఎరుగని ఉత్పాతమిది. భూకంపమో సునామీయో వరదలో క్షామమో అయితే అవన్నీ తెలిసినవే, విన్నవే, అనుభవించినవే. ఊళ్లకుఊళ్లు శ్మశానాలుగా మారిపోయిన...

ముప్పు ముంగిట

కరోనా మీద యుద్ధం–1

కనీవినీ ఎరుగని ఉత్పాతమిది. భూకంపమో సునామీయో వరదలో క్షామమో అయితే అవన్నీ తెలిసినవే, విన్నవే, అనుభవించినవే. ఊళ్లకుఊళ్లు శ్మశానాలుగా మారిపోయిన మహమ్మారులు, ఉన్న ఊళ్లు వదిలి పరిగెత్తించిన గత్తరలు చరిత్రలో అనేకం. కానీ, ఇది వేరు. ఈ జాతికే చెందిన పూర్వపు ప్రమాదాల కంటె కూడా ఇది వేరు. ఇది లోకాన్ని మొత్తంగా చుట్టేసింది. అభివృద్ధి చెందిన దేశాలనే అల్లల్లాడిస్తోంది. కరోనా అనీ కోవిడ్‌ 19 అనీ పిలుచుకుంటున్న ఒక రోగక్రిమి మనుషుల శ్వాసకోశం మీద దాడిచేసి ఊపిరి హరిస్తున్నది. బలహీనులను వయోధికులను గురిపెట్టి బాధిస్తున్నది. 


మనుషుల మధ్య ఉండే సామీప్యం మీద ఆధారపడి వ్యాపిస్తున్న ఈ వ్యాధికి నివారణ, ఆ సామీప్యాన్ని నివారించడం లేదా శుభ్రీకరించడం. వ్యాధిసోకిన వారి ముక్కు నుంచి, నోటి నుంచి తుమ్ముదగ్గుల ద్వారా వెలువడే తుంపర్లలోని సూక్ష్మభాగాలలో ఈ క్రిమి దాగి, మరొకరికి ప్రసారమవుతుంది. చేతుల మీద వాలిన క్రిమి కరచాలనంతో ఎదుటివారిచేతికి చేరుతుంది, అదే చేతితో ముఖాన్ని ముట్టుకుంటే తన మీద కూడా దాడిచేస్తుంది. ఈ వ్యాధి ఎట్లా వస్తుంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేశంలో దాని తీవ్రత ఎంత ఉన్నది అనే సమాచారం గత కొద్దిరోజులుగా కుప్పలుతెప్పలుగా వస్తున్నది. వాటిలో కొన్ని అబద్ధాలు, అర్థ సత్యాలు, వక్రీకరణలు, దుష్ప్రచారాలు ఉండడం విచారం. వైరస్‌ మీద చేస్తున్నట్టే, ఫేక్‌వార్తల మీద కూడా యుద్ధం చేయవలసి వస్తున్నది. 


చైనాలో మొదలైన ఈ క్రిమి ఇప్పుడు దాదాపు భూప్రదక్షణం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులతో భారతదేశంలో మొదట వ్యక్తమైన ఈ వ్యాధికారక క్రిమి, ఇప్పుడు విదేశాల నుంచి వచ్చినవారి కుటుంబీకులకు, సన్నిహితులకు కూడా సోకడం మొదలైంది. అంతూ దరీ చిక్కకుండా, సమూహంలో విస్తృతంగా వ్యాపించే దశను మూడో దశ అనీ, ఆ దశలోకి భారతదేశం ప్రవేశించకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దశలోకి ప్రవేశించడం అంటూ జరిగితే, దానంత దుస్థితి భారతదేశానికి మరొకటి ఉండదు. దేశమంతా వ్యాపించిన వ్యాధి, చాలని ఆస్పత్రులు, వైద్యవసతులు, లెక్కకు మిక్కిలి మరణాలు, మధ్యయుగాల నాటి దుర్భరమైన ఏ మహమ్మారియో పునరావృత్తమైనట్టు ఏర్పడే సన్నివేశం. 


ఇటలీ, ఇరాన్‌, అమెరికా వంటి దేశాలు చేజేతులా జాగు చేసి, పరిస్థితిని విషమింపజేసుకున్నాయని తెలుసుకుంటున్నాము. భారతదేశం సరైన సమయంలో స్పందించిందో లేదో తెలియదు కానీ, స్పందన మాత్రం చురుకుగా ఉన్నది. చర్యలు వేగం పుంజుకున్నాయి. అందరి కంటె ముందే కరోనా స్పర్శ తగిలిన కేరళ తొలిదశలో శీఘ్రచర్యలు తీసుకున్నది. మార్చి మాసారంభం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వం స్పందించి, ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఇరవై రోజుల కాలం పట్టింది, కానీ, అంతకుముందే తెలంగాణలో చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సందేశంతో, జనతా కర్ఫ్యూ పిలుపుతో కరోనా వ్యతిరేక ప్రచారం ఉద్యమస్థాయికి చేరింది.

అయోమయంలోను, భీతిలోను ఉన్న ప్రజలకు, విశ్వసనీయమైన, దృఢమైన నాయకత్వం కావాలి. తమ మాట ఆలకిస్తూ, తమను నడిపించే చేయి కావాలి. దేశవ్యాప్తంగా ఒకే నేత ద్వారా ఈ ఆశ్వాసన లభిస్తుందని చెప్పలేము. కానీ, ప్రాంతీయంగా, రాష్ట్రస్థాయిలో ఈ పోరాటానికి గట్టి నాయకత్వం ఇచ్చేవారు కావాలి. అదే సమయంలో రాజకీయాల ప్రతికూల లక్షణాలు కరోనా కట్టడిలో కనిపించకూడదు. కేరళలో సిపిఎం ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేతతో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతటి ఉదారత అన్నిటా ఆశించలేము కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సకాలంలో రంగంలోకి దిగి, ప్రజలకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జనప్రియత గల నాయకత్వం ఉన్నచోట, ప్రజలకు అభయం దొరుకుతుంది. దురదృష్టవశాత్తూ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. కరోనా ప్రమాదానికీ, స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పడిన వివాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్‌ అసలు కరోనా అంశంపైనే విముఖత పెంచుకున్నారు. జనతాకర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన నిర్లిప్తత కొట్టొచ్చినట్టు కనిపించింది. నిజానికి, తొలిదశలో కేవలం ఆరోగ్యశాఖ యంత్రాంగమే కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, క్షేత్రస్థాయిలో విదేశాలకు వెళ్లివచ్చినవారి సమాచారసేకరణ వంటి కీలకచర్యలు చేపట్టారు. ఆ మాత్రం చొరవ కూడా ఇకపై ఉండబోదేమోనని నాయకుని నీరసప్రసంగంతో ఆందోళన కలుగుతోంది. 


ప్రధానమంత్రి అంతగా చెప్పినా, ముఖ్యమంత్రులు బతిమాలి చెబుతున్నా, ప్రజల నుంచి స్వచ్ఛంద గృహ నిర్బంధానికి పూర్తి మద్దతు దొరకడం లేదు. ఈ అంశంపై ప్రధాని సోమవారం ఉదయం అసహనం ప్రకటించారు. తెలంగాణలో కూడా రాష్ట్ర డిజిపి, ప్రధాన కార్యదర్శి సంయుక్త పత్రికాసమావేశంలో అనేక హితవులు, హెచ్చరికలు చెప్పారు. పెద్దగా ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి కర్ఫ్యూ విధించారు కూడా. కరోనా అంశాన్ని తేలికగా తీసుకోగూడదని ప్రజలు గ్రహించాలి. ప్రకటించిన లాక్‌డౌన్‌లు సెలవులు కావు, విహారసమయాలు కావు. ఒక పెనుప్రమాదాన్ని నివారించడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టాలు ఉంటాయి. వాటిని తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి కానీ, ప్రజలు కూడా కొన్నిటిని భరించడానికి సిద్ధపడాలి. అల్పాదాయ వర్గాల వారికి, రోజువారీ ఆర్జన ఉండే శ్రేణులకు ఇప్పటికే ప్రకటించిన మద్దతుకు తోడు, మరిన్ని సహాయకాలు కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. అదే సమయంలో, ప్రజలు ఈ సందర్భాన్ని తమ మీద విధించిన నిర్బంధంగా భావించడం పొరపాటు. అనవసరంగా ఇంత ఆర్భాటం చేస్తున్నారన్న అభిప్రాయం ఎవరిలో ఉన్నా దాన్ని వెంటనే తొలగించుకోవాలి. ప్రమాదం మన ముంగిటే ఉన్నది. దాని తీవ్రత ఎట్లా ఉంటుందో ఇటలీని చూస్తే తెలుస్తుంది. మనదాకా రాదన్న నిశ్చింతకు ఎటువంటి ప్రాతిపదికా లేదు. మనం ఆదమరిస్తే, మనదాకా వస్తుంది. మనల్ని కష్టపెడుతుంది. ప్రజలలో ఎందుకు ఈ లాక్‌డౌన్‌ భావన ఇంకడం లేదో, వారి శ్రేయస్సుకే ఉద్దేశించిన చర్యలను వారెందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదోప్రభుత్వం కూడా ఆలోచించాలి. మరింత నిర్బంధ చర్యలు తీసుకోవడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు. ప్రజలను అట్టడుగు శ్రేణి దాకా చేరడానికి ఏ మార్గాలను అనుసరించాలో పరిశీలించాలి. కేవలం బ్యూరోక్రటిక్‌ చర్యల వల్ల, భద్రతాచర్యల వల్ల పూర్తి ఫలితాలు రాకపోవచ్చు. కరోనాను కట్టడి చేద్దాం. సర్వశక్తులనూ సమాయత్తం చేద్దాం!!

Updated Date - 2020-03-24T06:09:09+05:30 IST