ప్రళయ సంధి వేళ

ABN , First Publish Date - 2020-03-28T08:45:12+05:30 IST

కరోనా మహమ్మారి తీసుకువచ్చిన పరిస్థితులు ఇంకా జనానికి పూర్తిగా జీర్ణం కాలేదు. ఇప్పుడున్నది కనీవినీ ఎరుగని సన్నివేశం. సిడ్నీలో ఉన్నా, న్యూయార్క్‌లో ఉన్నా, లండన్‌లో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా, మనుషులు వాట్సప్‌లో ..

ప్రళయ సంధి వేళ

కరోనా మీద యుద్ధం–5

కరోనా మహమ్మారి తీసుకువచ్చిన పరిస్థితులు ఇంకా జనానికి పూర్తిగా జీర్ణం కాలేదు. ఇప్పుడున్నది కనీవినీ ఎరుగని సన్నివేశం. సిడ్నీలో ఉన్నా, న్యూయార్క్‌లో ఉన్నా, లండన్‌లో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా, మనుషులు వాట్సప్‌లో మాట్లాడుకోవచ్చును, స్కైప్‌లో పలకరించుకోవచ్చును కానీ, అన్నిచోట్లా అందరూ లాక్‌డౌన్‌ లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియని అయోమయంలో ఉన్నారు. ప్రపంచయుద్ధాలు చూసినవారుండవచ్చు, అనేక ప్రాంతీయ, స్థానిక యుద్ధాలలో అష్టకష్టాలు పడినవారుండవచ్చు. దశాబ్దాల తరబడి బాంబుల వర్షంలో జీవితాన్ని ఈడ్చిన లెబనాన్‌ వంటి దేశాలుండవచ్చు, కానీ, ప్రపంచమంతా, దాదాపు 200 దేశాల్లో ప్రతిఒక్కరినీ ప్రమాదంలోకి నెట్టిన ఉపద్రవం మునుపు లేదు. గతంలో ఏ దేశంలో ఆ దేశం, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం స్థానికమయిన క్షామాలను, ఈతిబాధలను చవిచూసి ఉండవచ్చు. కానీ ప్రపంచీకరణ, అందరినీ అనుసంధానం చేసింది, ప్రళయంలో కూడా. ప్రపంచం ఇంత కుగ్రామంగా మారకపోతే, ఇవాళ కరోనా వికటాట్టహాసం గ్లోబు నలుమూలలా ప్రతిధ్వనించేది కాదు. ఒకప్పుడు వివిధ సిద్ధాంతాల అనుయాయులను వెటకరించేవారు, ఫలానావాడు రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతాడని, ఇంకొకడు, అమెరికా వాడు మాట్లాడితే ఇక్కడ చప్పట్లు కొడతాడని. ఇప్పుడు ఆ వెటకారం నిజమై కూర్చుంది. చైనాలో పుట్టిన వైరస్‌, పెరిగి ప్రపంచాన్ని చుట్టింది. అమెరికాను అతలాకుతలం చేస్తున్నది, ఇటలీని ఇక్కట్ల పాలు చేస్తున్నది. భారత్‌ను భయపెడుతున్నది. ఇది ఎంతవరకు వెడుతుందో, మనం ఏ మాత్రం నియంత్రించగలుగుతామో కానీ, ఈ సందర్భంలో మనం ఉన్నామని, బతకడానికి ప్రయత్నించామని గర్వపడవచ్చు. యువకులైనవారు, ఈ గండాన్ని సులువుగానే గట్టెక్కి, తమ పిల్లలకు, మనవలకు, తాము ఏ మహాప్రళయాన్ని దాటుకుని వచ్చారో కథలుకథలుగా చెప్పుకోవచ్చు. ముగిసినవారికి విషాదగాథ. నిలిచినవారికి విజయగాథ. 


కనీవినీ ఎరుగని ఈ నిర్బంధం, కొత్త అనుభవాలను ముందుకు తెస్తున్నది. సొంతపనులకు ఇతరుల మీద ఆధారపడే సంపన్నులకు, నడిమితరగతి వారికి మళ్లీ శ్రమ విలువ తెలియజెబుతున్నది. కష్టమంటే ఏమిటో, ఏ కష్టానికి తాము ఏ ప్రతిఫలమిస్తున్నామో ఆలోచించేట్టు చేస్తున్నది. రద్దీలో హడావుడిలో వడలిపోయిన కుటుంబసంబంధాలను చివురింపుజేసుకోవడం ఎంత కష్టమో తెలియజెబుతున్నది. సమయం అపారంగా దొరుకుతున్నప్పుడు, దాన్ని సద్వినియోగం చేసుకోగల అవకాశాలను ఎంతగా విస్మరించామో కూడా ఇప్పుడు తెలియవస్తున్నది. అధికాదాయ వర్గాలు – తమ అవసరాలను తీర్చుకోవడానికి కావలసినన్ని పద్ధతులు, అవకాశాలు లభిస్తున్నప్పుడు, ఇతరులతో కలసి పంచుకోవడం, దేనికోసమైనా క్యూలో నిలబడడం, దేని కొరతనైనా అనుభవించడం పూర్తిగా మరచిపోయారు. ఇప్పుడు, పరిమితమైన సప్లైల కోసం ఇతరులతో కలసి ఎదురుచూడడం, తమకు దొరకదేమోనన్న ఆందోళనతో ఎగబడడం, సేవలు లభించకపోతే స్వయంసేవలకు పాల్పడడం– ఇవన్నీ కొత్త అనుభవాలే. మనుషులకు తెలిసి ఉండవలసిన జ్ఞానాలే. 


ఆన్‌లైన్‌ కోర్సులు చదవవచ్చు. కొత్త భాష ఏదైనా నేర్చుకోవచ్చు. మరచిపోయిన పుస్తకపఠనాన్ని మొదలుపెట్టవచ్చు. రాయదలచుకున్నవన్నీ రాసేయొచ్చు లేదా ఈ ఏకాంత నిర్బంధాన్నే రాసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు కలసి ఆడుకునే ఆటలను గుర్తు చేసుకోవచ్చు. ఇల్లు సర్దుకోవచ్చు. దుమ్ము దులుపుకోవచ్చు. మానవీయమైన అనేక కార్యకలాపాలకు ఈ సందర్భం తెరతీసింది. కొన్నేళ్ల కిందట, ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నప్పుడు, గ్రామాల్లో జనం ఆ సమయంలో ఇళ్ల బయటకు వచ్చి, పొరుగువారితోను, స్నేహితులతోను ముచ్చటలాడేవారు. మనుషులు తమ సహజత్వంలోకి వెళ్లడానికి కరెంటు కోత కావలసివచ్చింది. టీవీలు ఆగిపోవలసి వచ్చింది. ఇప్పుడు సమస్త ప్రపంచమే స్తంభించిపోయింది. ఆధునిక మౌలిక వ్యవస్థలు, సాంకేతిక సదుపాయాలు అన్నీ పాక్షికంగానే అందుబాటులో ఉన్న సమయం. ఈ సమయాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవలసిన తరుణం. ఎందుకంటె, ఇళ్లలోనే ఉండాలి. బతికి బట్టగట్టాలంటే ఇళ్లలో ఉండడమే మార్గం. మరి, ఇంటిజీవితం బాగుంటే, ఇళ్లలో ఉండడం సులువు అవుతుంది. ఈ సమయం వృథా కాకుండా, ఏదో ఒక కొత్త శక్తి సమకూరుతుంది. 


ఆలోచించడం మానకండి. ప్రమాదం ఉన్న మాట నిజమే కానీ, అనుక్షణం భయపడుతూనే ఉండకండి. జాగ్రత్తల్లో ఉంటూనే, మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం వదులుకున్న హక్కులు రేప్పొద్దున తిరిగి మనకు వచ్చేస్తాయా? ఈ లాక్‌డౌన్‌, షట్‌డౌన్‌ ప్రక్రియలు రేపు రాజకీయ ఉద్యమాల మీద కూడా ప్రభుత్వాలు ప్రయోగిస్తాయా? 

ఈ ఆపత్కాలంలో మనం ప్రభుత్వాధినేతల మీద పెట్టుకుంటున్న విశ్వాసం ఆ తరువాత కూడా కొనసాగించగలమా? అసలు, కరోనా అనంతరం ప్రపంచం ఎట్లా ఉంటుంది? బలాబలాలు ఎట్లా మారతాయి? మన డబ్బు ఎంతగా పతనం అవుతుంది? మన ఆదాయాలు ఎక్కడికి దిగజారతాయి? కూడబెట్టుకున్నవి ఏమవుతాయి? కష్టానికి ప్రతిఫలాలు ఎంత వస్తాయి? విద్వేషరాజకీయాల సుడిగుండంలో కొట్టుకుంటున్న భారతీయ సమాజానికి కరోనా ఒక ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ శాంతి తరువాత కూడా ఉంటుందా? ఉపద్రవం మీది ఈ యుద్ధంలో విజేతలు ఎవరు ప్రజలా, ప్రభుత్వాలా, రోగులా, వైద్యులా?


మనుషుల్ని ఇంతకాలం గృహనిర్బంధంలో ఉంచవచ్చునని, ఇన్ని రకాల సేవలను, ఉత్పత్తులను ఇంటి నుంచి పనిచేయడం ద్వారా సాగించవచ్చునని తెలిశాక, కార్పొరేట్‌ ప్రపంచానికి ఏమేమి కొత్త ఊహలు వస్తాయో, కొత్త ఆలోచనలు వస్తాయో? ఎదురుచూడాలి. 


ప్రపంచం ఇక మునుపటి వలె ఉండబోదు. కొత్త ప్రపంచానికి మనల్ని మనం సన్నద్ధుల్ని చేసుకోవాలి. ఈ ప్రళయ సంధి కాలాన్ని అధిగమించిన తరువాత, అనేక రంగాల్లో అంశాల్లో మళ్లీ పునాదులనుంచి పేర్చుకుంటూ రావలసి రావచ్చు. కొన్నిటిని సులువుగానే పునరుద్ధరించగలగవచ్చు. ఒక మృత్యుపవనం వీచినతరువాత, మనుషులందరికీ తాత్విక మయిన ఒక తెలివిడి కలిగి, కొంత మంచితనం కూడా వెల్లివిరియవచ్చు!!

Updated Date - 2020-03-28T08:45:12+05:30 IST