లోపాలు చూపితే శాపాలా?!

ABN , First Publish Date - 2020-04-12T05:53:20+05:30 IST

‘‘నాకుకరోనా వైరస్‌ సోకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శపించారు’’. అయితే ఆయనకంటే అత్యంత శక్తిమంతుడైన దేవుడి దయవల్ల నేను ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నాను. అయినా మహమ్మారి కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాల్సిన ముఖ్యమంత్రి ఫలానా వారికి కరోనా వైరస్‌ సోకాలని శపించడం...

లోపాలు చూపితే శాపాలా?!

తెలంగాణలో ఇవ్వాళ ఎవరైనా మనుగడ సాగించాలంటే ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయాల్సిందే! వైద్యుల సమస్యను వెలుగులోకి తెచ్చిన పాపానికి ‘ఆంధ్రజ్యోతి’కి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తానని కూడా కేసీఆర్‌ హెచ్చరించారు. మంచిదే! అంతా తనకే తెలుసును అని భావిస్తున్న కేసీఆర్‌కు ఒక విషయం గుర్తుచేయాలి. ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవు.  శిక్షలు విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుంది. అయినా వాళ్లకీ, వీళ్లకీ కరోనా సోకాలని శపించడం ద్వారా ఆ వైరస్‌ వ్యాప్తిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న మీకే న్యాయంగా శిక్ష పడాలి!


నిజానికి ప్రజలందరికీ పరీక్షలు నిర్వహిస్తే మన దేశంలో, ముఖ్యంగా తెలుగునాట కొన్ని వేల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డికి మాత్రం కరోనా కనిపించడం లేదు. తన ఎజెండా అమలుకు అడ్డుగా మారిన కరోనాపై ఆయనకు అంతులేని కోపం ఉంది. అలా అని కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారా? అంటే అదీ లేదు. ఒక్క ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ వైద్యులకు కనీస రక్షణ పరికరాలు లేవు. అదేమని ప్రశ్నించిన వారిని సస్పెండ్‌ చేస్తున్నారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ చేపట్టడాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసినా జగన్మోహన్‌రెడ్డికి కనిపించదు– వినిపించదు.


సొంతంగా ఆలోచించే అవసరం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలనే తాను కూడా ప్రకటిస్తూ వచ్చిన జగన్మోహన్‌రెడ్డిలో ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈనెల ఐదవ తేదీన తొమ్మిది నిమిషాలపాటు ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్‌రెడ్డిని గమనిస్తే ఆయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇంటి వెలుపలకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తొమ్మిది నిమిషాలు కూడా పూర్తికాక ముందే లోపలకు వెళ్లిపోవడానికి రెండు మూడు పర్యాయాలు ప్రయత్నించారు. అధికారులు వారించడంతో ఆగిపోయారు.


లాక్‌డౌన్‌ ఎత్తేసినా మరికొంత కాలంపాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని జగన్మోహన్‌రెడ్డి ఉవ్విళ్లూరడాన్ని ఏమనుకోవాలి?  కరోనా కారణంగా ఎన్నికలను కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్టు అప్పుడు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. స్థానిక సంస్థలకు ఈ నెలలో పోలింగ్‌ నిర్వహిస్తే.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న భౌతిక దూరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించే పక్షంలో ఆయన భావిస్తున్నట్టు ఎన్నికలు జరగవు. అది ఉభయభ్రష్టత్వమే అవుతుంది. అయినా సభ్య సమాజం నివ్వెరపోయే నిర్ణయాలు తీసుకోవడం ఒక్క జగన్మోహన్‌రెడ్డికే సాధ్యం!


‘‘నాకుకరోనా వైరస్‌ సోకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శపించారు’’. అయితే ఆయనకంటే అత్యంత శక్తిమంతుడైన దేవుడి దయవల్ల నేను ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నాను. అయినా మహమ్మారి కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాల్సిన ముఖ్యమంత్రి ఫలానా వారికి కరోనా వైరస్‌ సోకాలని శపించడం ఏమిటి? హద్దులు లేని అసహనానికి ఇది నిదర్శనం కాదా? ఇంతకీ శాపం పెట్టాల్సినంత తప్పు నేను గానీ, ‘ఆంధ్రజ్యోతి’ గానీ ఏమి చేసినట్టు? ‘వైద్యులకు రక్షణ ఏది?’ అన్న శీర్షికన ప్రచురించిన వార్తలో పీపీఈ కిట్లు చాలినన్ని లేవు అని పేర్కొన్నాం. 40 వేలకు పైగా కిట్లు స్టాక్‌ ఉన్నాయని విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ చెప్పినప్పటికీ, గవర్నర్‌కు సమర్పించిన నివేదికలో ఆరు వేల కిట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయినా రెండు నెలల క్రితం వరకు కరోనా మహమ్మారి గురించి మనకు తెలియదు కనుక ఏ ప్రభుత్వమైనా పీపీఈ కిట్లను సేకరించి పెట్టుకోదు. ముప్పు ముంచుకొచ్చినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడం మీడియా బాధ్యత! ఇందులో మేం గానీ, మరొకరు గానీ బాధ్యతారహితంగా ప్రవర్తించింది ఎక్కడ? ఆ మాటకొస్తే కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే తొలుత బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా కూడా మామూలు జ్వరం లాంటిదే. పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే తగ్గిపోతుంది’’ అని మాట్లాడటం బాధ్యతారాహిత్యం కాదా? ఇంద్రుడుకి ఒళ్లంతా కళ్లు అన్నట్టుగా కేసీఆర్‌కు లేవు కదా!? రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో మనో నేత్రంతో తెలుసుకోలేరు కదా? ప్రభుత్వ నిర్ణయాలలోని లోపాలను, వ్యవస్థలోని లొసుగులను పాలకుల దృష్టికి తీసుకురావడానికే మీడియా ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం తగ్గి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో 50 శాతం కోత విధించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి అహర్నిశలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కూడా జీతాల్లో కోత విధించడం ఏమిటి? అని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించడం వల్లనే కదా ప్రభుత్వం తన ఉత్తర్వులను సవరించుకుంది! సమీక్షల పేరిట అధికారులతో గంటల తరబడి సమావేశం అవుతున్న కేసీఆర్‌కు ఈ విషయం ఎందుకు తట్టలేదు? వైద్య సిబ్బందికి జీతాల్లో కోత విధించడం సబబు కాదని ఒక్కరు కూడా ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోయారు? మర్కజ్‌ వెళ్లి వచ్చిన ముస్లింలకు కరోనా వైరస్‌ సోకుతున్నందున హోం మంత్రి మహమూద్‌ అలీని కలుసుకోవడానికి కూడా ఇష్టపడకుండా, ఇంటికి వచ్చిన మనిషిని గేటు వద్ద నుంచే వెనక్కు పంపిన మీది మాత్రమే ప్రాణమా? రోగుల నుంచి తమకు కూడా వ్యాధి సోకుతుందని తెలిసినా ధైర్యంగా చికిత్స చేస్తున్న వైద్యులకు రక్షణ పరికరాలు సమకూర్చడం ప్రభుత్వం బాధ్యత కాదా?


‘ఆంధ్రజ్యోతి’ దుర్మార్గంగా రాసిందని మీరు విమర్శించిన మరుసటి రోజే గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు తమకు అవసరమైన సదుపాయాల కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు పిలుపు ఇచ్చింది వాస్తవం కాదా? నాకే అంతా తెలుసు, నా బాధ్యత ఇంకొకరు గుర్తుచేయాలా? అని హూంకరిస్తున్న కేసీఆర్‌ దీనికి ఏమి చెబుతారు? వివిధ కారణాల వల్ల తెలంగాణలో కేసీఆర్‌కు మీడియా పూర్తిగా సహకరిస్తున్నది. దీంతో చిన్న చిన్న విమర్శలను కూడా సహించలేని స్థితికి ఆయన వచ్చారు. తాను అద్భుతంగా పనిచేస్తున్నానని ప్రపంచానికి నిత్యం చెబుతుండాలని కోరుకుంటున్నారు. నిజానికి సమీక్షల పేరిట మీరు నిర్వహిస్తున్న సమావేశాలలో జరుగుతున్నది ఏమిటో ప్రజలకు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! మీకు నచ్చిన అధికారులను, పార్టీ వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని గంటల తరబడి ముచ్చట్లు చెప్పే మీరు అధికారులను మాట్లాడనిస్తారా? పిల్లల కోడిలా కొంతమందిని వెంటేసుకుని విలేకరుల సమావేశం పెట్టి ఆ తర్వాత వెంటనే మాయమైపోవడం లేదా? గడిచిన పది రోజులలో మీరు ఎన్ని రోజులు ఫామ్‌హౌస్‌లో గడిపారో ప్రజలకు చెప్పారా? అదేమంటే నేను ఎక్కడ ఉంటే అక్కడే ప్రభుత్వం ఉంటుందంటారు! ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌లో దండిగా ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగానికి వెలితి ఉండటం లేదు. అది మీ గొప్ప కాదు. సమర్థులైన అధికారులు తెలంగాణలో ఉన్నందున కేసీఆర్‌ పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వ్యవస్థ తన పని తాను చేసుకుపోతున్నది. అదంతా మీ గొప్ప అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడపడం నిజం కాదా? కేసీఆర్‌ భాషలో చెప్పాలంటే.. అవతలివాడు నీకంటే సన్నాసి అయినప్పుడు నీకే మంచి పేరు వస్తుంది.


కేసీఆర్‌ విషయంలో అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహార శైలి కారణంగా కరోనా విషయంలో కేసీఆర్‌ బాగా వ్యవహరిస్తున్నారన్న పేరు వచ్చిన విషయం వాస్తవం కాదా? డొనాల్డ్‌ ట్రంప్‌ మూర్ఖత్వం వల్ల ఇవ్వాళ అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. దీంతో లాక్‌డౌన్‌ ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల నాయకులు ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లనే ఆ దేశాలు ఇప్పుడు కుదేలయ్యాయి. నిజానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఫిబ్రవరి మాసంలోనే నిషేధించి ఉంటే మన దేశంలోకి కరోనా ప్రవేశించి ఉండేది కాదు. అంతెందుకు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల సమస్య ఈ స్థాయిలో ఉంటుందని కాలజ్ఞాని అయిన మీరు ఎందుకు ఊహించలేకపోయారు? అంతా తనకే తెలుసన్న అహంకారపూరిత ధోరణి తలకెక్కడంతో కేసీఆర్‌లో అసహనం హద్దులు దాటుతోంది. మీడియా సమావేశాలలో ప్రశ్నలు అడిగిన విలేకరులను ఈసడించుకోవడం ఆయనకే చెల్లింది. తమను అంతలా అవమానిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితిలో ఇవ్వాళ జర్నలిస్టులు లేరు. యాజమాన్యాల సహకారం కూడా ఉండటం లేదు. నేను జర్నలిజంలోకి ప్రవేశించిన 1980వ దశకంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రులు పరుషంగా మాట్లాడితే సదరు సమావేశాన్ని బహిష్కరించి విలేకరులు వెళ్లిపోయిన సంఘటనలను నా కళ్లతో చూశాను. అప్పట్లో జర్నలిస్ట్‌ సంఘాలు కూడా బలంగా ఉండేవి. ఇప్పుడు జర్నలిస్ట్‌ సంఘాలు చీలికలు పీలికలై కొన్ని ముఖ్యమంత్రి జేబులోకి దూరిపోయాయి. ఇందుకు అందరూ బాధ్యులే! జర్నలిస్టులు పూర్వంలా ఉండివుంటే కేసీఆర్‌ వంటివారి ఆటలు సాగేవి కావు. కేసీఆర్‌ ఏం మాట్లాడితే అది పోటీలు పడి మరీ రిపోర్టు చేయవలసిన దుస్థితిలో ఇప్పటి మీడియా ఉంది. ఈ కారణంగానే ప్రశ్నలను సహించలేకపోతున్నారు.


ఉద్యోగ సంఘాలతో కనీసం మాట మాత్రమైనా సంప్రదించకుండా జీతాల్లో కోత విధించినా నోరెత్తలేని స్థితిలో ఆయా సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో ఇవ్వాళ ఎవరైనా మనుగడ సాగించాలంటే ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయాల్సిందే! వైద్యుల సమస్యను వెలుగులోకి తెచ్చిన పాపానికి ‘ఆంధ్రజ్యోతి’కి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తానని కూడా కేసీఆర్‌ హెచ్చరించారు. మంచిదే! అంతా తనకే తెలుసును అని భావిస్తున్న కేసీఆర్‌కు ఒక విషయం గుర్తుచేయాలి. ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవు. శిక్షలు విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుంది. అయినా వాళ్లకీ, వీళ్లకీ కరోనా సోకాలని శపించడం ద్వారా ఆ వైరస్‌ వ్యాప్తిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న మీకే న్యాయంగా శిక్ష పడాలి! మీడియాను బెదిరించడానికి అలవాటుపడిన కేసీఆర్‌, ఇప్పుడు సూచనలను కూడా స్వీకరించే స్థితిలో లేరు. శిక్షలు విధిస్తానని హెచ్చరికలు చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇలాంటి హెచ్చరికలు అలవాటే! మీరు గుడ్లు ఉరిమితే ఇక్కడెవరూ భయపడరు! మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము. ఆరేళ్లుగా ఫామ్‌హౌస్‌లోనో ప్రగతిభవన్‌లోనో సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉన్న మీకు ఇప్పటి లాక్‌డౌన్‌ వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలిసే అవకాశం లేనందున, ప్రజా సమస్యలను మేం బాజాప్తా ప్రచురిస్తాం. ప్రచురిస్తూనే ఉంటాం!


దేవుడే కాపాడాలి!

‘ఊరందరిది ఒకదారి అయితే ఉలిపికట్టెది మరో దారి’ అంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధోరణి ఇలాగే ఉంది. దేశంలోని ముఖ్యమంత్రులు అందరూ.. ఆ మాటకొస్తే ప్రపంచ దేశాల అధినేతలందరూ కరోనా మహమ్మారిని అరికట్టే విషయమై తలమునకలై ఉండగా, జగన్మోహన్‌రెడ్డి మాత్రం తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. దేనికైనా సమయం– సందర్భం చూసుకోవాలి అని అంటారు. జగన్‌కు మాత్రం ఇలాంటివేమీ పట్టవు. ఆయనది విపరీత మనస్తత్వం అని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే విషయం ఆలోచించకుండా తన ఎజెండా అమలుకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ కారణంగానే గుడ్‌ఫ్రైడే ప్రభుత్వానికి సెలవు అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీచేయడంతోపాటు ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ జీవో విడుదల చేశారు. అంతేకాదు.. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రమేశ్‌కుమార్‌ను తొలగించడం సరైందా? కాదా? న్యాయ సమీక్షలో నిలబడుతుందా? లేదా? అన్న విషయాలు పక్కనపెడితే.. ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కేవలం జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. కరోనా వైరస్‌ను ఆయన మొదటి నుంచీ తేలిగ్గానే తీసుకుంటున్నారు. ‘‘వైరస్‌ వచ్చిన విషయం, పోయిన విషయం కూడా మనకు తెలియదు’’ అని ఆయన తనను కలిసిన వారివద్ద వ్యాఖ్యానిస్తున్నారు కూడా! కరోనా విషయంలో అధికారులు అనవసరంగా హైరానా పడుతున్నారని కూడా ఆయన విసుక్కుంటున్నారు.


వెంటనే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఆయన వాదిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. స్థానిక సంస్థలకు ఈ నెలలోనే ఎన్నికలు జరపాలి. అమరావతిలో ప్రభుత్వానికి దఖలుపడిన భూములను ఇళ్ల స్థలాల కింద పేదలకు పంపిణీ చేసి అమరావతిని చంపేయాలనుకోవడమే! దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ శుక్రవారంనాడే ప్రకటించారు. నిజానికి ప్రజలందరికీ పరీక్షలు నిర్వహిస్తే మన దేశంలో, ముఖ్యంగా తెలుగునాట కొన్ని వేల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డికి మాత్రం కరోనా కనిపించడం లేదు. తన ఎజెండా అమలుకు అడ్డుగా మారిన కరోనాపై ఆయనకు అంతులేని కోపం ఉంది. అలా అని కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారా? అంటే అదీ లేదు. ఒక్క ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ వైద్యులకు కనీస రక్షణ పరికరాలు లేవు. అదేమని ప్రశ్నించిన వారిని సస్పెండ్‌ చేస్తున్నారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ చేపట్టడాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసినా జగన్మోహన్‌రెడ్డికి కనిపించదు–వినిపించదు. సొంతం గా ఆలోచించే అవసరం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలనే తాను కూడా ప్రకటిస్తూ వచ్చిన జగన్మోహన్‌రెడ్డిలో ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈనెల ఐదవ తేదీన తొమ్మిది నిమిషాలపాటు ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్‌రెడ్డిని గమనిస్తే ఆయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇంటి వెలుపలకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తొమ్మిది నిమిషాలు కూడా పూర్తికాక ముందే లోపలకు వెళ్లిపోవడానికి రెండు మూడు పర్యాయాలు ప్రయత్నించారు. అధికారులు వారించడంతో ఆగిపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందున ముఖ్యమంత్రి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అధికారులు మాత్రం కరోనా నియంత్రణపై దృష్టిపెట్టారు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా మరికొంత కాలంపాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని జగన్మోహన్‌రెడ్డి ఉవ్విళ్లూరడాన్ని ఏమనుకోవాలి? ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కరోనా కారణంగా ఎన్నికలను కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్టు అప్పుడు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కోరుకుంటున్నట్టు స్థానిక సంస్థలకు ఈ నెలలో పోలింగ్‌ నిర్వహిస్తే.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న భౌతిక దూరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించే పక్షంలో ఆయన భావిస్తున్నట్టు ఎన్నికలు జరగవు. అది ఉభయభ్రష్టత్వమే అవుతుంది. అయినా సభ్య సమాజం నివ్వెరపోయే నిర్ణయాలు తీసుకోవడం ఒక్క జగన్మోహన్‌రెడ్డికే సాధ్యం! రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంఘాలలో నియమితులైన వారిని తొలగించడానికై జగన్‌ అండ్‌ కో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా తిక్కరేగి దేశంలో ముఖ్యమంత్రుల పదవీకాలాన్ని రెండేళ్లకో, మూడేళ్లకో కుదిస్తూ రాజ్యాంగ సవరణకు పూనుకుంటే జగన్‌ సమర్థిస్తారా? ఇంతకాలంగా జగన్‌ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను సమర్థిస్తున్న ఆయన మద్దతుదారులు ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమర్థించగలరా? తాను రూపొందించిన బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపుతారా? అన్న కోపంతో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు తన అభిమతాన్ని గుర్తించి అమలుచేయని రమేశ్‌కుమార్‌ను ఇంటికి పంపాలనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని విమర్శించినవాళ్లను ఎందుకు తప్పుబట్టాలి? అయినా ఇంతటి అసంబద్ధమైన ఆర్డినెన్స్‌ను గంటల వ్యవధిలో గవర్నర్‌ ఎలా ఆమోదించారో తెలియదు! ఎన్నికలలో గెలుపు అనేది రాజ్యాంగ విఘాతానికి సమర్థన కాజాలదు అని జగన్‌ ప్రధాన సలహాదారుడు అజయ్‌ కల్లాం ‘కల్లాంవారి మేలుకొలుపు’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలను ఆయన ఎలా సమర్థిస్తున్నారో తెలియదు. రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే అవినీతిపరుడుగా మారవచ్చు. నేరబుద్ధి ఉన్నవారు అధికారంలోకి వస్తే పాలన అంతా నేరమయంగా ఉంటుందని అంటారు. జగన్మోహన్‌రెడ్డి వంటి నేపథ్యం ఉన్నవారు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నిర్ణయాలు కూడా ఇంతకంటే ఉన్నతంగా ఎందుకు ఉంటాయి? ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి! అంతవరకు పదేపదే విస్తుపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. అధికారం కట్టబెట్టిన ప్రజలే దాని పర్యవసానాలను కూడా అనుభవించాలి. జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏడాది క్రితం ఇదే ఏప్రిల్‌ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి మరీ ఓట్లు వేశారు కనుక మంచికీ–చెడుకీ వారే బాధ్యులు!


ఆర్కే
యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-04-12T05:53:20+05:30 IST