జల రాజకీయం!

ABN , First Publish Date - 2020-05-17T06:24:32+05:30 IST

నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు. అలాగే రాయలసీమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు...

జల రాజకీయం!

నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు. అలాగే రాయలసీమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం సాధ్యం అవుతున్నదని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఏడాదిలో పది రోజులకు మించి శ్రీశైలానికి వరద వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు ఎన్ని నీళ్లు తరలించినా నిల్వ చేసుకోగల సామర్థ్యం ఇప్పుడు రాయలసీమలో నిర్మితమైన జలాశయాలకు లేదు. మొత్తం 70 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37 టీఎంసీలకు మించి నింపుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోకుండా పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి?


1999 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజలలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికై తటస్థులు, మేధావులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. దీనివల్ల ప్రజలలో ఆయనపై సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఈ ఎత్తుగడను జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో మార్పులు చేసి నాటి ముఖ్యమంత్రిపై వ్యతిరేక ప్రచారానికి మేధావులను వాడుకున్నారు. రాజధాని అమరావతి తమది అని ఇతర ప్రాంతాల ప్రజలు అనుకోకుండా చేయగలగడంలో జగన్‌ అండ్‌ కో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సైకాలజీని ఒడిసిపట్టుకున్న జగన్‌ అండ్‌ కో అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుని ప్రజల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచగలిగింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే అప్పుడు ఏమి జరిగింది.. ఇప్పుడు ఏమి జరుగుతున్నదో తెలుస్తుంది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై రాయలసీమ ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు. ఈ మేరకు జగన్మోహన్‌రెడ్డి లక్ష్యం నెరవేరిందన్న మాట! కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించి రాజకీయ ప్రయోజనం పొందడం ఆ ప్రాంత నాయకులకు అలవాటుగా మారిపోయింది. కర్నూలులో హైకోర్టు కావాలని హడావుడి చేశారు. సరే అయితే హైకోర్టు పెడతామని, కర్నూలును జ్యుడీషియల్‌ రాజధానిగా చేస్తాననీ జగన్‌ ప్రకటించారు. ఆ ప్రకటనతో రాయలసీమ అంతా అభివృద్ధి చెందినట్టేనని ప్రజలు సంతృప్తిపడిపోయారు. అయితే హైకోర్టు వస్తే కర్నూలు ఎలా బాగుపడిపోతుందో తెలియదు. అయినా కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు వ్యవహారం కూడా అంతే అవుతుంది.


మద్యం ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపిన జగన్‌ తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికి, ‘‘మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికై ధరలు పెంచి మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తున్నాను’’ అని ఫుల్‌ పేజీ ప్రకటనలను జారీ చేశారు.  పొరుగున ఉన్న తెలంగాణలో తక్కువ ధరకు మెరుగైన బ్రాండ్ల మద్యం దొరుకుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోంది. ఆ విషయం అంగీకరించడానికి కూడా వారు సిద్ధపడరు. మద్యం ధరల మాదిరిగానే విద్యుత్‌ చార్జీల విషయంలో కూడా ఫుల్‌ పేజీ ప్రకటనలు జారీ చేస్తారేమో చూడాలి. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడానికి చార్జీలు పెంచామని చెబుతారేమో! రేపోమాపో ఆర్టీసీ చార్జీలను మరోమారు పెంచబోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే బస్సు ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతో చార్జీలు పెంచుతున్నామని మరో ఫుల్‌పేజీ ప్రకటన విడుదల చేయవచ్చు. ఇటువంటి వాదనలను సంప్రదాయ రాజకీయ నాయకులు చేయలేరు. వారి ఊహలకు కూడా తట్టవు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఇప్పుడు ఎదురుదాడి నిత్యకృత్యం అయింది. 


పట్టుమని ఏడాది కూడా కాలేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పెనవేసుకున్నట్టు ప్రదర్శితమైన స్నేహబంధానికి బీటలు పడటం మొదలైంది. ‘‘చంద్రబాబు తన హయాంలో అనవసరంగా తెలంగాణతో గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. ఇప్పుడు చూడండి.. మేమిద్దరం కలిసిమెలిసి రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం బృహత్తర ప్రణాళికలు అమలు చేయబోతున్నాం. వృథాగా పోతున్న గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించడానికై ఉమ్మడి ప్రాజెక్టు చేపట్టబోతున్నాం’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో మందీమార్బలంతో రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ ఆతిథ్యం స్వీకరించి గంటల తరబడి చర్చలు జరిపారు. ఉభయ రాష్ట్రాల అధికారుల బృందాలు కూడా పలు దఫాలు చర్చలు జరిపాయి. కేసీఆర్‌ కూడా విజయవాడ వచ్చి జగన్మోహన్‌రెడ్డి నివాసాన్ని పావనం చేశారు. అతిథిమర్యాదలు అందుకున్నారు. ‘‘జగన్మోహన్‌రెడ్డిని బుట్టలో వేసుకోవడానికి కేసీఆర్‌ ఎత్తుగడ వేస్తున్నారు’’ అని గిట్టనివారు విమర్శించగా, ‘‘మా ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. పొరుగు రాష్ట్రంతో గొడవ పడకుండా రాయలసీమ అభివృద్ధికి సహకారం పొందుతున్నారు.


స్నేహం అంటే ఇదేరా’’ అని అధికార వైసీపీ నాయకులు భుజాలు చరుచుకున్నారు. ఏడాది గడవకముందే ఈ మురిపాలు, ముచ్చట్ల స్థానంలో చిటపటలు మొదలయ్యాయి. ఉమ్మడి ప్రాజెక్ట్‌ ఊసు గాలికిపోయింది. జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జీవో జారీ చేయడమే ఇందుకు కారణం. పోతిరెడ్డిపాడు వ్యవహారం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ వివాదానికి దారితీసింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీవోలో పేర్కొన్నట్టుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణలో కేసీఆర్‌తో ఆడుకోవచ్చుననీ, ఆయనను దెబ్బతీయడానికి మంచి అవకాశం దొరికినట్టేననీ ప్రతిపక్షాలు ఆశపడుతున్నాయి. నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు. అలాగే రాయలసీమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం సాధ్యం అవుతున్నదని అధికారులు చెబుతున్నారు.


దీని ప్రకారం చూస్తే ఏడాదిలో పది రోజులకు మించి శ్రీశైలానికి వరద వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు ఎన్ని నీళ్లు తరలించినా నిల్వ చేసుకోగల సామర్థ్యం ఇప్పుడు రాయలసీమలో నిర్మితమైన జలాశయాలకు లేదు. గోరుకల్లు జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు కాగా 8 టీఎంసీలే నింపుకోగలుగుతున్నారు. గండికోటలో దాదాపు 27 టీఎంసీలకు గాను 11 టీఎంసీలు, చిత్రావతి రిజర్వాయరులో పది టీఎంసీలకు గాను 6, సర్వరాయ సాగర్‌లో మూడు టీఎంసీలకుగాను ఒకటిన్నర, బ్రహ్మంసాగర్‌లో 17.7 టీఎంసీలకు గాను పది టీఎంసీలను మాత్రమే నింపుకోగలుగుతున్నారు. అంటే 70 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37 టీఎంసీలకు మించి నింపుకోలేని పరిస్థితి. మిగతా 33 టీఎంసీల సామర్థ్యాన్ని వివిధ కారణాల వల్ల నింపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోకుండా పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత రిజర్వాయర్లను పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించలేకపోవడానికి పునరావాస ప్యాకేజీ అమలు చేయకపోవడమే కారణం. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల దిగువకు పడిపోతే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించలేరు.


ఈ కారణంగా పంటలు మధ్యలో ఎండిపోకుండా నివారించడానికై చంద్రబాబునాయుడు 2017లో చడీచప్పుడు లేకుండా 200 కోట్లు ఖర్చు చేసి ముచ్చుమర్రి లిఫ్ట్‌ను పూర్తిచేశారు. దీనివల్ల 810 అడుగులకు నీటిమట్టం పడిపోయినా శ్రీశైలం నుంచి నీరు ఎత్తిపోసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 2017–18, 2018–19లో దాదాపు మూడు టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సుమారు 6,800 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పోతి రెడ్డిపాడు విస్తరణ పథకం మొదలుకాకముందే వివాదంలో చిక్కుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తొలగించి, జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించడానికి సంబంధించినటువంటి జీవోలను రహస్యంగా జారీ చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. పోతిరెడ్డిపాడు జీవోను ఆర్భాటంగా జారీ చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతోపాటు కొత్త రిజర్వాయర్లను నిర్మించకుండా కేవలం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల రాయలసీమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై రాయలసీమ ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు.


ఈ మేరకు జగన్మోహన్‌రెడ్డి లక్ష్యం నెరవేరిందన్న మాట! కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించి రాజకీయ ప్రయోజనం పొందడం ఆ ప్రాంత నాయకులకు అలవాటుగా మారిపోయింది. కర్నూలులో హైకోర్టు కావాలని హడావుడి చేశారు. సరే అయితే హైకోర్టు పెడతామని, కర్నూలును జ్యుడీషియల్‌ రాజధానిగా చేస్తాననీ జగన్‌ ప్రకటించారు. ఆ ప్రకటనతో రాయలసీమ అంతా అభివృద్ధి చెందినట్టేనని ప్రజలు సంతృప్తి పడిపోయారు. అయితే హైకోర్టు వస్తే కర్నూలు ఎలా బాగుపడిపోతుందో తెలియదు. అయినా కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు వ్యవహారం కూడా అంతే అవుతుంది. తెలంగాణలోని ప్రతి పక్షాలు భావిస్తున్నట్టుగా శ్రీశైలం నుంచి నీళ్లన్నీ ఆంధ్రాకు తరలించుకుపోవాలంటే రిజర్వాయర్లు కూడా నిర్మించుకోవలసి ఉంటుంది. అదంతా జరగాలంటే ఏళ్లు పూళ్లు పడతాయి.


ఈలోపు దుమ్ముగూడెం నుంచి కేసీఆర్‌ తలపెడుతున్న ఎత్తిపోతల పథకమే పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కావలసినంత నీటిని నాగార్జునసాగర్‌ జలాశయంలోకి తరలించవచ్చు. అప్పుడు దక్షిణ తెలంగాణ కూడా సస్యశ్యామలం అవుతుంది. జగన్‌తో స్నేహం కొనసాగినప్పుడు కేసీఆర్‌ ప్రతిపాదించింది కూడా ఇటువంటి పథకమే! ఈ ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయ్యేది లేదు.. పొయ్యేది లేదు అని నేను అప్పుడే స్పష్టంచేశాను. ఇప్పుడు జరిగింది కూడా అదే! తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్‌ ఒక్క అడుగు కూడా వేయరు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడులో ఏదో జరిగిపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతుందని రాష్ట్రంలోని రాజకీయపక్షాలు ఆందోళన చెందడం, ఆ ప్రాజెక్టుతో రాయలసీమలో కాళ్ల కింద నీళ్లు పారతాయని సీమ ప్రజలు ఆశపడటం అనవసరం. అయితే ఇటువంటి వివాదాల వల్ల అధికారంలో ఉన్నవారికి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలను చికాకు పెట్టే సమస్యలు కనుమరుగవుతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే! విశాఖపట్టణంలో గ్యాస్‌ లీక్‌ బాధితుల ఆక్రందనలు పోతిరెడ్డిపాడు వివాదంతో గాలిలో కలిసిపోయాయి. పాలకులు కోరుకునేది ఇదే!


l మరి అది గొప్ప కాదా!?

రాజకీయ నాయకుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలు మరిచిపోవాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ ఎరుగనట్టుగా నిర్ణయాలు తీసుకోగలగాలి. నిన్న చెప్పిన విషయాన్ని ఇవాళ గుర్తుపెట్టుకోకూడదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ విద్యలో ఇప్పుడు ఆరితేరిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలలో మార్పులు చేసినందుకే విమర్శించారు. చార్జీలను పెంచి ప్రజలను బాదేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ప్రజలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో విద్యుత్‌ చార్జీలను పూర్తిగా తగ్గించి వేస్తానని జగన్‌ ప్రకటించారు. కొన్ని నెలలు గడిచేసరికి అవన్నీ మరిచిపోయి విద్యుత్‌చార్జీలను పెంచారు. ప్రతి వాక్యానికి ముందూ– వెనుకా ‘పేదలు’ అని సాగదీసే జగన్మోహన్‌రెడ్డికి విద్యుత్‌ చార్జీలు పెంచే విషయంలో పేదలపై భారం పడుతుందని గుర్తుకురాలేదంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టే కదా! మద్యం ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపిన జగన్‌ తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికై, ‘‘మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికై ధరలు పెంచి మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తున్నాను’’ అని ఫుల్‌ పేజీ ప్రకటనలను కూడా జారీ చేశారు.


ఇలా చేయగలగడం మగతనమేనని ఆయన మద్దతుదారులు జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. పొరుగున ఉన్న తెలంగాణలో తక్కువ ధరకు మెరుగైన బ్రాండ్ల మద్యం దొరుకుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోంది. ఆ విషయం అంగీకరించడానికి కూడా వారు సిద్ధపడరు. మద్యం ధరల మాదిరిగానే విద్యుత్‌ చార్జీల విషయంలో కూడా ఫుల్‌ పేజీ ప్రకటనలు జారీ చేస్తారేమో చూడాలి. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడానికి చార్జీలు పెంచామని చెబుతారేమో! రేపోమాపో ఆర్టీసీ చార్జీలను మరోమారు పెంచబోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే బస్సు ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతో చార్జీలు పెంచుతున్నామని మరో ఫుల్‌పేజీ ప్రకటన విడుదల చేయవచ్చు. ఇటువంటి వాదనలను సంప్రదాయ రాజకీయ నాయకులు చేయలేరు. వారి ఊహలకు కూడా తట్టవు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఇప్పుడు ఎదురుదాడి నిత్యకృత్యం అయింది. ఈ నేపథ్యంలోనే పోయిన వారం జగన్‌ గురించి నేను చేసిన విశ్లేషణకు ఎవరికివారు సొంత భాష్యం చెప్పుకొన్నారు. కొందరు అర్థంచేసుకోగా, మరికొందరు అర్థమైందని నమ్మారు. జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన, అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలను ఎవరైనా గుర్తించి తీరాల్సిందే! ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండటాన్ని మాత్రమే మనం ఇప్పటిదాకా చూశాం.


అయితే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగైదేళ్లుగా సాగిన రాజకీయం వేరు. సరికొత్త పంథాలో సాగింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని అప్రతిష్ఠపాల్జేయడానికై జగన్‌ పకడ్బందీ వ్యూహరచన చేసుకున్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను గరిష్ఠంగా వాడుకున్నారు. అవాస్తవాల ప్రచార హోరులో నిజం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితిలోకి ప్రజలను నెట్టారు. ఈ క్రమంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విశ్వసనీయత కలిగివున్న కొంతమందిని చేరదీసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించారు. ఈ జాబితాలో జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, అజయ్‌ కల్లం, లక్ష్మణరెడ్డి వంటివారు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వారందరికీ ప్రభుత్వ పదవులు కట్టబెట్టారు. రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్‌ కో అంతులేని అవినీతికి పాల్పడ్డారని రాష్ట్రమంతా పర్యటించి ప్రచారం చేసి.. పుస్తకాలు రాసిన అజయ్‌ కల్లం ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉన్నారు.


చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ప్రచారం చేసిన జస్టిస్‌ ఈశ్వరయ్యను ఉన్నత విద్య రెగ్యులటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టారు. తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఈశ్వరయ్య ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పదవీ విరమణ తర్వాత ఆయనే ఊరూవాడ తిరిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా బీసీలను సమీకరించే బాధ్యతను తలకెత్తుకున్నారు. మరో హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి రాయలసీమలో విస్తృతంగా పర్యటించి చంద్రబాబు ప్రభుత్వం సీమకు అన్యాయం చేస్తున్నదని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయనను లోకాయుక్తగా నియమించారు. హైకోర్టు జడ్జిగా పనిచేశారు కనుక రాయలసీమ వాసులపై ఆయన చేసిన ప్రచారం ప్రభావం చూపింది. జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌గా ఉండిన లక్ష్మణరెడ్డిని ఇదేవిధంగా వాడుకున్నారు. ఇప్పుడు ఆయనను మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించారు.


ఈ ప్రముఖులు మాత్రమే కాకుండా మరెందరో స్లీపర్‌ సెల్స్‌గా వ్యవహరించి చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేసి పెట్టారు. వారిలో కొందరు కులాభిమానంతో, మరికొందరు చంద్రబాబుపై వ్యతిరేకతతో జగన్మోహన్‌రెడ్డితో చేతులు కలిపారు. వీటన్నింటికి తోడు ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ చేయని దుష్ప్రచారం లేదు. పట్టిసీమ పథకంలో భారీ అవినీతి జరిగిందని విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తం 1400 కోట్ల రూపాయల వ్యయం అయిన ఈ ప్రాజెక్టులో అవినీతి భారీగా జరిగి ఉంటే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించకపోవడానికి కారణం ఎవరు చెప్పాలి? ప్రజలు కూడా ఆ విషయం మరిచిపోయారు. ఇప్పుడు పట్టిసీమను రాజశేఖర్‌రెడ్డి నిర్మించారని అడ్డంగా వాదిస్తున్నారు. 1999 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజలలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికై తటస్థులు, మేధావులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. దీనివల్ల ప్రజలలో ఆయనపై సానుకూల అభిప్రాయం ఏర్పడింది.


ఈ ఎత్తుగడను జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో మార్పులు చేసి నాటి ముఖ్యమంత్రిపై వ్యతిరేక ప్రచారానికి మేధావులను వాడుకున్నారు. రాజధాని అమరావతి తమది అని ఇతర ప్రాంతాల ప్రజలు అనుకోకుండా చేయగలగడంలో జగన్‌ అండ్‌ కో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సైకాలజీని ఒడిసిపట్టుకున్న జగన్‌ అండ్‌ కో అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుని ప్రజల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచగలిగింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే అప్పుడు ఏమి జరిగింది.. ఇప్పుడు ఏమి జరుగుతున్నదో తెలుస్తుంది. అయితే ప్రజలకు అంత జ్ఞాపక శక్తి, అవగాహన ఉండదు కనుక ‘పేదలు’ అన్న పదాన్ని స్మరిస్తూ ఓటుబ్యాంకును కాపాడుకోవడానికై జగన్‌ ప్రయత్నిస్తున్నారు. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములు అమ్ముతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజంలో స్పృహ లేకపోవడానికి కారణం ఓటుబ్యాంకు రాజకీయమే! చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజాలు మాట్లాడినా కేసులలో ఇరికించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో నోరుండి, మెదడు చురుగ్గా ఉన్నవాళ్లు కూడా తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. ఏడాదిగా అభివృద్ధి పనులు ఆగిపోయినా అడిగేవారు లేని పరిస్థితి కల్పించుకోవడం జగన్మోహన్‌రెడ్డి గొప్పతనం కాదా?


l అదంతే.. మేరా భారత్‌ మహాన్‌!

ఈ విషయం అలా ఉంచితే, కరోనా వైరస్‌ ఇప్పట్లో పోదు కనుక దానితో కలిసి జీవించాల్సిందేనని పాలకులు ఇంత కాలానికి కోరస్‌గా పాడుతున్నారు. రెండున్నర నెలల లాక్‌డౌన్‌ తర్వాత ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు కరోనాతో కలిసి జీవించమని తాపీగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇవే మాటలను మొదట్లోనే అంటే అందరం తిట్టాం. అమెరికాలో కరోనా బారిన పడినవారిలో అత్యధికులు ట్రంప్‌ మద్దతుదారులు కాదట! మన పాలకులు అలా లెక్కలు వేసి ఉండరు గానీ, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్న మాటను ముందే చెప్పి ఉండవచ్చు కదా అన్న సందేహం కలుగుతోంది. రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ విధించి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి.. కంపెనీలు, వ్యాపారాలను కోలుకోకుండా చేయడం ఎందుకు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ప్రారంభంలో ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్నవాళ్లు.. ఇప్పుడు ఆర్థికరంగం ముఖ్యం అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర హాస్యాస్పదంగా మారింది.


ఇప్పటివరకు ఈ సంస్థకు ఎంతో విశ్వసనీయత ఉండేది. కరోనా దెబ్బతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు, లెక్కలను పట్టించుకోవలసిన అవసరం లేదని ప్రపంచం భావించే పరిస్థితి ఏర్పడింది. వివిధ మతాల ప్రార్థనా మందిరాలను మూయించిన పాలకులు.. మద్యంషాపులను మాత్రం తెరిపించారు.ప్రభుత్వానికి ఆదాయం కావాలి కనుక ప్రజలు కరోనా బారినపడినా పర్వాలేదని భావించారేమో! జరగాల్సిన అనర్థం జరిగాక ఇప్పుడు ‘‘మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.. మేం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తాం’’ అని ప్రభుత్వాలు చావుకబురు చల్లగా చెబుతున్నాయి. అదేమంటే కరోనా బారిన పడిన వారిలో మృతిచెందుతున్న వారి శాతం మూడులోపేనని అంటున్నారు. దేశ జనాభాలో మూడు శాతం పోయినా పర్వాలేదనుకుంటే ఆర్థికవ్యవస్థను ఎందుకు దెబ్బతీశారు? విధ్వంసం జరిగిపోయింది కనుక ఇప్పుడు ఎవరి బతుకు వారు బతకా ల్సిందే! ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలి! బతికి బట్టకట్టిన వాళ్లు కష్టపడి సంపాదించి పన్నులు కట్టండి. లేదా మద్యం తాగండి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టండి. వాళ్లు ఆ పథకం, ఈ పథకం అంటూ పంచిపెడుతూ, సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నట్టుగా దానకర్ణుల వలె పోజులు కొడుతూ ఉంటారు. మేరా భారత్‌ మహాన్‌!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-05-17T06:24:32+05:30 IST