హస్తినతో దోస్తీ!
ABN , First Publish Date - 2020-12-20T06:06:45+05:30 IST
నిజానికి ప్రజల్లో తన పట్టును తిరిగి పొందడానికి కావలసినంత వ్యవధి కేసీఆర్‌కు ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీ పెద్దలను కలిసి మంచి చేసుకోవడానికి ఎందుకు తొందరపడ్డారో తెలియదు. కొన్ని సందర్భాలలో కేసీఆర్....

నిజానికి ప్రజల్లో తన పట్టును తిరిగి పొందడానికి కావలసినంత వ్యవధి కేసీఆర్‌కు ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీ పెద్దలను కలిసి మంచి చేసుకోవడానికి ఎందుకు తొందరపడ్డారో తెలియదు. కొన్ని సందర్భాలలో కేసీఆర్ తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కూడా అతిగా అనిపిస్తాయి. ఉదాహరణకు మజ్లిస్ పార్టీతో అవసరానికి మించి ఆయన స్నేహం చేశారు. దీంతో బీజేపీకి అదే ఆయుధం అయింది. ఇప్పుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అడుగుతున్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇలాంటి అతి చర్యల వల్లే ఆయనకు నష్టం జరుగుతోంది. మొత్తానికి తాజా ఢిల్లీ పర్యటన వల్ల కేసీఆర్ రాజకీయంగా దెబ్బతిన్నారన్న అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది. తెలంగాణలో ఆయన పనైపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజమవుతాయా? కేంద్ర పెద్దలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్‌ను కూర్చోబెడతారా?
కేసీఆర్ అంటే అరివీర భయంకరుడు, ఎవరినీ లెక్కచేయని ధైర్యశాలి అని తెలంగాణ ప్రజలు నమ్ముతూ వచ్చారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆయన చేష్టలతో ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ పాతాళానికి వెళ్లిందని చెప్పవచ్చు. కేసీఆర్ మాట మీద నిలబడే రకం కాదని ఆయన గురించి బాగా తెలిసినవారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన నైజం ఏమిటో తెలంగాణ ప్రజానీకం కూడా గ్రహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ తిరుగు ప్రయాణమైన తర్వాత ఆయన గురించి ఢిల్లీలో చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి కేసీఆర్ మాత్రమే కారణం! ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కబుర్లు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో తనకు ఆటంకాలు సృష్టించరని కేసీఆర్ భావించడమే తప్పు. భారతీయ జనతాపార్టీ మాత్రమే బలపడాలని మోదీ, షా ద్వయం కోరుకుంటారు. ఈ క్రమంలో మిత్రపక్షాలను కూడా వారు ఉపేక్షించరు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బీజేపీ పెద్దలతో రాజీ పడాలనుకోవడం తొందరపాటు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఢిల్లీకి ఉరుకులు పరుగులు పెట్టినంత మాత్రాన కేంద్ర పెద్దలు ఆయనను స్థిమితంగా ఉండనిస్తారా?
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్రెడ్డి ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసివచ్చారు. ముఖ్యమంత్రులిద్దరూ వెంటవెంటనే ఎందుకు వెళ్లారు? కేంద్ర పెద్దల ఆహ్వానం మేరకు వెళ్లారా? లేక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లారా? అపాయింట్మెంట్ తీసుకుని ఉంటే.. అడిగిన వెంటనే అనుమతి ఇచ్చారంటే.. ఏమి జరిగి ఉంటుంది? ఇత్యాది అంశాలపై రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వద్దాం. కేంద్రంపై ఇక యుద్ధమే అని ప్రకటించిన వెంటనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కలుసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు ఆర్థిక సహాయం చేయాలని, కాళేశ్వరం మూడవ దశకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను కేసీఆర్ కోరినట్టు లీకులిచ్చారు. అయితే ఈ వార్తలను ప్రతిపక్షాలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదు. ఢిల్లీలో పెద్దల ముందు పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వెంటనే ప్రకటనలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది. ఇంతకూ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను ఏం కోరారు? ఏ హామీ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. బీజేపీకి చెందిన ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది ఆ పార్టీ పెద్దలతో సంధి కుదుర్చుకోవడానికే! ‘నేను అలసిపోయాను, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఆ సీటులో నా కుమారుడైన కేటీఆర్‌ను కూర్చోబెట్టబోతున్నాను..
బీజేపీతో కలసిమెలసి పని చేయడానికి మేం సిద్ధం.. గ్రేటర్ మేయర్ పదవిని బీజేపీ కోరుకుంటే అందుకు కూడా సహకరిస్తాం’ అని కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో నమ్మబలికినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తాను ఎప్పుడు తప్పుకొంటున్నదీ కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదట. అయితే కేసీఆర్ మాటలను కేంద్ర పెద్దలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తన ఆరోగ్యం సహకరించడం లేదనీ, ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడికి కట్టబెట్టాలనుకుంటున్నాననీ గతంలోనూ కేంద్ర పెద్దల వద్ద కేసీఆర్ చెప్పారు. ఈ మాట చెప్పి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ కారణంగానే బీజేపీ అగ్ర నేతలు ఆయనను ఇప్పుడు విశ్వసించడం లేదు. ‘కేసీఆర్ చెప్పే మాటలను అసలు నమ్మకూడదు. మీరు జాగ్రత్తగా ఉండండి’ అని రాష్ర్టానికి చెందిన పార్టీ ఎంపీ ఒకరి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అన్నారట. మొత్తం మీద కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన విశ్వసనీయతకు గండిపడింది. జాతీయస్థాయి నాయకుల వద్ద గతంలోనే విశ్వసనీయతను కోల్పోయిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా పరపతి కోల్పోతున్నారు. తెలంగాణలో ఆయనకు ఇప్పటివరకు ఒక ఇమేజ్ ఉంది. కేసీఆర్ అంటే అరివీర భయంకరుడు, ఎవరినీ లెక్కచేయని ధైర్యశాలి అని తెలంగాణ ప్రజలు నమ్ముతూ వచ్చారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆయన చేష్టలతో ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ పాతాళానికి వెళ్లిందని చెప్పవచ్చు. కేసీఆర్ మాట మీద నిలబడే రకం కాదని ఆయనను బాగా ఎరిగినవారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన నైజం ఏమిటో తెలంగాణ ప్రజానీకం కూడా గ్రహించారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ తిరుగు ప్రయాణమైన తర్వాత ఆయన గురించి ఢిల్లీలో చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి కేసీఆర్ మాత్రమే కారణం! ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కబుర్లు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో తనకు ఆటంకాలు సృష్టించరని కేసీఆర్ భావించడమే తప్పు. భారతీయ జనతాపార్టీ మాత్రమే బలపడాలని మోదీ, షా ద్వయం కోరుకుంటారు. ఈ క్రమంలో మిత్రపక్షాలను కూడా వారు ఉపేక్షించరు. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బీజేపీ పెద్దలతో రాజీ పడాలనుకోవడం తొందరపాటు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఢిల్లీకి ఉరుకులు పరుగులు పెట్టినంత మాత్రాన కేంద్ర పెద్దలు ఆయనను స్థిమితంగా ఉండనిస్తారా? అయినా కేసీఆర్ అంత హడావుడి ఎందుకు పడ్డారో తెలియదు. గతంలో బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేసినప్పుడు.. ‘విరాళాలు తీసుకోని రాజకీయ పార్టీ దేశంలో ఉందా? మీరు విరాళాలు తీసుకోవడం లేదా? మేం కూడా బాజాప్తాగా పార్టీ కోసం డబ్బు తీసుకుంటాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని బహిరంగంగా సవాల్ చేసినప్పుడు– ‘అదీ మా కేసీఆర్ సత్తా’ అంటూ టీఆర్ఎస్ శ్రేణులతోపాటు ప్రజలు కూడా అభినందించారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడింత బేలతనం ఎందుకు ప్రదర్శిస్తున్నారో టీఆర్ఎస్ నాయకులకు కూడా అంతుపట్టడం లేదు.
బీజేపీతో యుద్ధం చేస్తానని చెప్పిన వెంటనే మా నాయకుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుసుకోవడంతో మేం తలెత్తుకుని తిరగలేకపోతున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసుల భయం కేసీఆర్‌కు పట్టుకుందని తెలంగాణలో చిన్న పిల్లగాడు కూడా మాట్లాడుతున్నాడని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ‘మా నాయకుడు రాజకీయ గండరగండడు అని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. ఆయనలో పిరికితనం ఎక్కువగానే ఉందని ఇప్పుడు భావించాల్సి వస్తోంది’ అని పార్టీ ముఖ్య నాయకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీపై కూడా కేసీఆర్ తన పట్టును కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపించడం మొదలెట్టారు. తెలంగాణలో ఊపు మీదున్న బీజేపీతో చేతులు కలపడానికి టీఆర్ఎస్ ముఖ్యులు కొందరు పావులు కదుపుతున్నారు. దీనికి తోడు రోజుల తరబడి మేధో మథనం చేసి తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల చిక్కులు రావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది. ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటానికి కారణాలు అన్వేషించకుండా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు ఓటు వేయకపోవడం ఏమిటో అంటూ నిష్ఠూరమాడడం ఆత్మవంచనే అవుతుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అధికారాన్ని కట్టబెడతాయని అనుకోవడం పొరపాటే. వివిధ కారణాల వల్ల ప్రజల్లో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటూ వస్తోంది. భారీ హామీలివ్వడం, వాటి అమలు మరచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎంత గొప్ప సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా దాని ప్రభావం కొంతకాలమే ఉంటుంది. కేసీఆర్‌కు ఇవన్నీ తెలియవనుకోలేం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా హామీలు ఇచ్చుకుంటూ పోవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోంది. నిజానికి ప్రజల్లో తన పట్టును తిరిగి పొందడానికి కావలసినంత వ్యవధి ఆయనకు ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీ పెద్దలను కలిసి మంచి చేసుకోవడానికి ఎందుకు తొందరపడ్డారో తెలియదు.
కొన్ని సందర్భాలలో కేసీఆర్ తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కూడా అతిగా అనిపిస్తాయి. ఉదాహరణకు మజ్లిస్ పార్టీతో అవసరానికి మించి ఆయన స్నేహం చేశారు. దీంతో బీజేపీకి అదే ఆయుధం అయింది. ఇప్పుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అడుగుతున్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇలాంటి అతి చర్యల వల్లే ఆయనకు నష్టం జరుగుతోంది. మొత్తానికి తాజా ఢిల్లీ పర్యటన వల్ల కేసీఆర్ రాజకీయంగా దెబ్బతిన్నారన్న అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది. తెలంగాణలో ఆయన పనైపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజమవుతాయా? కేంద్ర పెద్దలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కేటీఆర్‌ను కూర్చోబెడతారా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం మరికొంత కాలం వేచిచూడాలి.
కేంద్ర పెద్దల చల్లనిచూపు కావాలి!
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు అనుగుణంగానే నిధులు విడుదల చేయాలని మాత్రమే అమిత్‌షాను కోరినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ ఒక్క అంశం మాత్రమే చర్చించారంటే నమ్మడం కష్టం. సదరు సమావేశంలో రాజకీయ అంశాలు చర్చకు రాకుండా ఎందుకుంటాయి? కేంద్రప్రభుత్వం తలపెట్టిన రైతు సదస్సులను విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా కోరడానికి జగన్‌ను ఢిల్లీ పిలిపించారని కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే జగన్‌రెడ్డి ఢిల్లీలో మాత్రం వినయవిధేయతలు ప్రదర్శించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారన్నది వాస్తవం. అయితే ఈ కారణంగా రాష్ట్రంలో తన పరపతి దెబ్బతినకుండా ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ కంటే జగన్‌కే కేంద్ర పెద్దల చల్లని చూపు కావాలి. అయినా కేసీఆర్ భయపడుతున్నట్టుగా ఆయన భయపడటం లేదు. తన కేసుల విషయంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉండడమే ఇందుకు కారణం. అదే సమయంలో కేంద్ర పెద్దలతో ఢీకొనే సాహసాన్ని కూడా జగన్‌రెడ్డి చేయడం లేదు. కేంద్రంతో లౌక్యంగా వ్యవహరిస్తూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు ఉన్నందున కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా కొన్ని సందర్భాలలో ఆయనకు సహకారం అందిస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ర్టాలలో బలమైన నాయకులుగా ఉన్న కేసీఆర్, జగన్‌రెడ్డి కేంద్ర పెద్దల వద్ద మాత్రం తలలు వంచుతున్నారు.
మోదీయే చేతులు జోడిస్తున్నా..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఒక అడుగు వెనక్కి వేసేలా చేసింది. నోట్లరద్దు తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన– ‘శిరస్సు వంచి, చేతులు జోడించి వేడుకుంటున్నా, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి..’ అని అంటున్నారు. దీన్ని బట్టి రైతుల ఉద్యమ ప్రభావం ప్రధానమంత్రిపై బలంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. మోదీ వంటి బలమైన నాయకుడు కూడా రైతులకు శిరస్సు వంచి, చేతులు జోడిస్తున్నా అంటున్నారు గానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మనసు కరగడం లేదు. రైతులకు నచ్చజెప్పవలసిన రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు వారిని అవహేళన చేస్తున్నారు. రైతుల రోదనలు, వేదనలను ప్రత్యక్షంగా చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను కూడా టార్గెట్ చేసుకున్నారు. మూడు రాజధానులు కావాలంటూ కిరాయి మూకతో ఉద్యమం చేయించడమే కాకుండా న్యాయమూర్తులను సైతం రెచ్చగొట్టేలా వారు కోర్టుకు వెళ్లే సమయంలో ప్లకార్డులు ప్రదర్శింపజేస్తున్నారు.
ఢిల్లీ పొలిమేరల్లో మూడు వారాలుగా ఉద్యమం చేస్తున్న రైతుల ఆందోళనపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. రైతుల ఉద్యమాన్ని సామరస్యంగా పరిష్కరించని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం అవుతుందని సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తంచేసింది. అమరావతి రైతుల విషయంలో రాష్ట్ర హైకోర్టు సానుభూతితో కూడిన దృక్పథాన్ని తీసుకోవడం ముఖ్యమంత్రి జగన్ అండ్ కో సహించలేకపోతోంది. దక్షిణాది విషయంలో జాతీయ మీడియా ఎప్పటి నుంచో పక్షపాత దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నందున అమరావతి రైతుల ఉద్యమం జాతీయస్థాయిలో తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇటు అమరావతిలో, అటు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు పిటిషన్ల రూపంలో తమ ముందుకు వస్తున్నందున హైకోర్టు కూడా స్పందిస్తోంది. ఈ క్రమంలో జస్టిస్ రాకేశ్‌కుమార్ వంటివారు భావోద్వేగానికి గురవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పరిధి దాటి చేసినవిగా అనిపించవచ్చు.
రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్నది తేల్చడానికి విచారణ జరుపుతామని జస్టిస్ రాకేశ్‌కుమార్ ప్రకటించారు. దానిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... రాజ్యాంగ విచ్ఛిన్నం విచారణపై శుక్రవారంనాడు అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ రాకేశ్‌కుమార్ నిర్ణయం ఆందోళన కలిగించేదిగా ఉందనీ, ఇలాంటి ఉత్తర్వులను గతంలో తాము చూడలేదనీ, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న అభిప్రాయానికి జడ్జి రావడానికి ప్రభావితం చేసిన అంశాలేమిటో తెలియాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బిహార్‌కు చెందిన జస్టిస్ రాకేశ్కుమార్ది దూకుడు మనస్తత్వం అని చెబుతుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఆయన.. కొన్ని సందర్భాలలో పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన మాట కూడా వాస్తవమే. రాష్ట్రప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు కూడా కోర్టులోనే ఆయనతో వాదనకు దిగుతూ రెచ్చగొడుతూ వచ్చారు. న్యాయమూర్తులు సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుందన్నది ఎంత వాస్తవమో, న్యాయమూర్తులను రాష్ట్రప్రభుత్వం గౌరవించవలసి ఉంటుందన్నది కూడా అంతే వాస్తవం. కేసుల పూర్వాపరాలను బట్టి న్యాయమూర్తులు స్పందించి వ్యాఖ్యలు చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం సర్వసాధారణం. రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టి, అరెస్టు చేసి జైలుకు పంపడంపై సుప్రీంకోర్టు స్పందించి బెయిల్ మంజూరు చేసింది.
సెలవు రోజున కూడా కోర్టు ప్రత్యేకంగా సమావేశమై గోస్వామికి బెయిల్ ఇచ్చింది. అమాయకులు ఒక్క రోజు కూడా జైలులో ఉండకూడదన్న సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఆయనకు బెయిల్ ఇస్తున్నట్టు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోస్వామికి సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద బెయిల్ ఇవ్వడాన్ని పలువురు న్యాయనిపుణులు తప్పుబట్టారు కూడా. న్యాయస్థానాల నిర్ణయాలను, తీర్పులను తప్పుబట్టడం కొత్తేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తప్పుబట్టింది. తుది విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి. హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కోర్టులు కావు. కనుక హైకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రప్రతిపత్తి కలిగి ఉంటారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు అన్ని తీర్పులు ఇవ్వడానికి కారణం ఏమిటి? న్యాయమూర్తులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు దోహదపడుతున్నాయా? మొదలైన అంశాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా తెలుసుకోవడం వాంఛనీయంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో పోలీసు శాఖ పనితీరు కచ్చితంగా ఆందోళనకరంగా ఉంది. న్యాయవ్యవస్థను సైతం ధిక్కరిస్తున్న పోలీసులు అధికార పార్టీ సేవలో తరించిపోతున్నారు. తన వద్ద విచారణకు వచ్చిన హెబియస్ కార్పస్ పిటిషన్‌లోని వాస్తవాలను గమనించిన జస్టిస్ రాకేశ్‌కుమార్ విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న నిర్ణయానికి సదరు న్యాయమూర్తి రావడం తప్పా? ఒప్పా? అన్నది పక్కనపెడితే, ప్రాథమిక హక్కులనేవి అందరికీ ఒకేలా ఉండాలి కదా!
ఉదాహరణకు.. నేను ఒక కేసుకు సంబంధించి స్వయంగా ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే సమయంలో అధికార పార్టీ వారి మెప్పు కోసం, ప్రభుత్వాన్ని విమర్శించారని ఎంతోమందిని నిర్బంధిస్తున్నారు. నాలాంటి వాడు ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ లా అమలు కానప్పుడు పౌరులు న్యాయస్థానాలనే కదా ఆశ్రయించేది! తామేం చేసినా న్యాయస్థానాలు అడ్డు రాకూడదన్న అహంభావంతో పాలకులు వ్యవహరించడం వల్ల న్యాయవ్యవస్థ కూడా వివాదాస్పదమవుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పరిస్థితులు మరీ అరాచకంగా ఉంటున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడినట్టుగా జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను ప్రభావితం చేసిన అంశాలేమిటో ఉన్నత న్యాయస్థానం తేల్చడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టితో పరిశీలించాల్సిన అవసరముంది. తప్పంతా హైకోర్టులోనే ఉందని సుప్రీంకోర్టు భావించినా, మరొకరు భావించినా పౌర సమాజానికి కనీస న్యాయం కూడా లభించదు!
ఆర్కే
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
QR Code scanచేయండి
