కాంగ్రెస్‌కు మంచికాలం వస్తుందా?

ABN , First Publish Date - 2020-12-30T05:54:58+05:30 IST

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎవరో మీకు కొత్త సంవ త్సరంలో తెలుస్తుంది అని ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్...

కాంగ్రెస్‌కు మంచికాలం వస్తుందా?

ప్రజల అసంతృప్తి, రాజకీయ శక్తులు బలోపేతం కావడం సకాలంలో జరిగినప్పుడే బలమైన రాజకీయ, సామాజిక ఉద్యమాలను నిర్మించేందుకు అవకాశం ఉన్నది. బీజేపీయేతర పార్టీల నాయకులు అందుకు సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ అయితే పలాయనమంత్రాలు పఠిస్తున్నారు. ఎన్నికల మధ్యలో సిమ్లాలో విహారానికి, కొత్త సంవత్సరం ఇటలీకి వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశ రాజధాని శివార్లలో చలితో వణుకుతున్న లక్షలాది రైతులకు ఆయన తన పర్యటనలతో ఏ సంకేతాలను అందించదలుచుకున్నారు?


తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎవరో మీకు కొత్త సంవ త్సరంలో తెలుస్తుంది అని ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ మంగళవారం నాడు చెప్పారు. కొత్త సంవత్సరంలో ఎప్పుడు? మొదటి వారంలోనా? అని అడిగినప్పుడు కొత్త సంవత్సరం అన్నాను కదా, కొత్త సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు.. అని చెప్పి ఆయన తప్పించుకున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉన్నాయో మాణిక్కం ఠాగూర్ మాటలను బట్టి అర్థం అవుతుంది. సరిగ్గా పది రోజుల క్రితం ఆయనను ఇదే ప్రశ్న అడిగినప్పుడు తాము తెలంగాణలో పర్యటించి వందలాది నేతలతో మాట్లాడి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చామని, త్వరలో పార్టీ అధ్యక్షుడు ఎవరో ప్రకటిస్తామని చెప్పారు. అయితే సోనియా గాంధీ ఇప్పుడు నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం లేదు. అనారోగ్యం వల్ల మాత్రమే కాదు, తన కుమారుడు రాహుల్ గాంధీ సలహా ఇస్తే కాని ఆమె నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి రాహుల్ తమ నివేదికను చూడకుండానే ఆదివారం నాడు ఇటలీ వెళ్ళిపోయారని తెలిసి కాంగ్రెస్ నేతలు హతాశులయ్యారు. కాంగ్రెస్ 136వ సంస్థాపక దినం సందర్భంగా ఏఐసిసిలో జరిగిన కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. కొత్త సంవత్సరాది ఆయన ఇటలీలో గడిపి నిదానంగా వస్తారని, ఆ తర్వాతే తెలంగాణ పీసీసీకి సంబంధించి ఫైలుకు కదలిక వస్తుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. 


ఒక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలోకి దిగజారిందని దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితికి బాధ్యత వహించి ఆత్మ విమర్శ చేసుకోకుండా పదవుల కోసం పోటీపడడం, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఒకర్నొకరు విమర్శించుకోవడం, కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బిజెపికి భజంత్రీపరులుగా వ్యవహరించడం ప్రజలు గమనించకపోలేదు. నిజానికి ఇలాంటి సంస్కృతి మూలంగానే కాంగ్రెస్ చేతుల్లోంచి తెలంగాణ జారిపోయి, తెలంగాణ రాష్ట్ర సమితి పట్టులోకి వెళ్లిపోయింది. సిఎం పదవికోసం పదిమందికిపైగా నేతలు నాడు పోటీపడడం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలో అవలంబించిన ఆత్మహత్యా సదృశమైన, అవకాశ వాద రాజకీయాలవల్లే నేతలు విశ్వసనీయత కోల్పోయారు. బహుశా ఆనాడు బలమైన ప్రతిపక్షంగా మరో పార్టీ లేనందువల్లే కాంగ్రెస్ రెండో స్థానం పొందగలిగింది కాని ఇవాళ భారతీయ జనతాపార్టీ బలంగా ఆవిర్భవించే పరిస్థితి కనపడేసరికి ప్రజలకు ప్రత్యామ్నాయం కనపడుతున్నదనడంలో అతిశయోక్తి లేదు. అయిదు దశాబ్దాలుగా చూసిన ముఖాలనే కాంగ్రెస్‌లో చూసీ చూసీ ప్రజలకు విరక్తి కలిగే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని సార్లు ఓటమి పాలైనా ఆత్మ విమర్శ అంటూ లేని దుస్థితిలో చిక్కుకుంది, ఈ పరిస్థితుల్లో కొత్త శక్తులను ఆహ్వానించి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం ప్రయత్నించే బదులు పదవుల కోసం ప్రాకులాడటం, వెన్నుపోట్లకు సిద్ధపడడం చూస్తుంటే కాంగ్రెస్లో చింతచచ్చినా పులుపు చావలేదన్నట్లు కనిపిస్తుంది. అయినా వారేమి చేయగలరు? పై నుంచి నాయకత్వం బలంగా అందించాల్సిన నేతలే తమ స్వంత సుఖాలకోసం ప్రాధాన్యతలను విస్మరించి పర్యటనలు చేస్తుంటే క్రింది నేతలు మారకపోవడంలో ఆశ్చర్యం లేదు. 


2017లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు బిహార్ కాంగ్రెస్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్టీలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ రాహుల్ నింపుతారని ప్రశంసిస్తూ బిహార్ పిసిసి తీర్మానం చేసింది. ఇవాళ మూడేళ్ల తర్వాత చూస్తే అదే బిహార్ కాంగ్రెస్‌లో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు పోటీ చేసి 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తీవ్రతరమయ్యాయి. సిఎల్‌పి నేతృత్వం కోసం జరిగిన సమావేశంలో బాహాబాహీ ఘటనలు జరిగాయి. బిహార్ కాంగ్రెస్‌ను పునర్వ్యవస్థీకరించాలంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్ఖు ఝాతో పాటు అనేక మంది నేతలు డిమాండ్లు చేశారు. నేతలు పార్టీ టిక్కెట్లను అమ్ముకున్నారని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కోసం రహస్యంగా పనిచేశారని ఆరోపణలు చేశారు.


తెలంగాణ, బిహార్‌లోనే కాదు, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్లో ముఠా రాజకీయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు లేని రాష్ట్రమంటూ మనకు కనపడదు. ఈ తగాదాల వల్ల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్నే పోగొట్టుకుంటే రాజస్థాన్ ప్రభుత్వం పడబోయి ఆగింది. ఈ పరిస్థితుల్లో బిహార్, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యకరమైనవి కావు. బిహార్‌లో దాదాపు వందేళ్ల క్రితం సదాఖత్ భవన్ పేరుతో కట్టిన భవనంలో కాంగ్రెస్ కార్యాలయం ఉన్నది. ఆ భవనం నుంచే గాంధీజీ, కృపలానీ వంటి వారు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ బిహార్ పార్టీ అధ్యక్షుడుగా ఆ భవనం నుంచే బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా రాష్ట్రపతి పదవీ విరమణ అనంతరం తన చరమ దశను అక్కడే గడిపారు. ఈ చరిత్రాత్మక భవనం ఇప్పుడు కాంగ్రెస్ చరమ దశకు నిదర్శనంగా నిలిచింది. పార్టీలో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేని దుస్థితిలో బిహార్ కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నా, ముఠా తగాదాలకు మాత్రం కొదవ లేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వెంటనే మేల్కొని సంఘటిత శక్తిగా నిలవకపోతే అనేక కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచిన గాంధీ భవన్ కూడా చరిత్రలో తెరమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు.


కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే దేశంలో జరుగుతున్న పరిణామాలకు తగ్గట్లుగా బిజెపియేతర పార్టీలు సన్నద్ధం కావడంలో అలసత్వం వహిస్తున్నాయి. తత్ఫలితంగానే కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం తిరుగులేని శక్తిగా మారింది. ఇందులో సందేహం లేదు. మోదీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవారు ఎంతమంది ఉన్నారో, అసంతృప్తిగా ఉన్న వారు కూడా అంతేమంది ఉండి ఉంటారు. అయితే తమపై విశ్వాసం ఉన్న వారిని కూడగట్టుకోవడంలో మోదీ విజయవంతమైనట్లుగా, అసంతృప్తిగా ఉన్న వారిని సంఘటితం చేసి వారికి విశ్వాసం కలిగించడంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. ప్రజల అసంతృప్తి, రాజకీయ శక్తులు బలోపేతం కావడం సకాలంలో జరిగినప్పుడే బలమైన రాజకీయ, సామాజిక ఉద్యమాలను నిర్మించేందుకు అవకాశం ఉన్నది. కాని దేశంలో నాయకులు అందుకు సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ లాంటి వారు పలాయనమంత్రాలు పఠించడం, ఎన్నికల మధ్యలో సిమ్లా వంటి విహార ప్రాంతాలకు, ఆ తర్వాత కొత్త సంవత్సరం గడిపేందుకు అమ్మమ్మ గారి దేశానికి వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తనకు రాజకీయాల పట్ల పెద్ద పట్టింపు లేనట్లు ఆయన కనిపిస్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది రైతులు చలితో వణుకుతున్న వేళ ఆయన తన పర్యటనలతో ఏ సంకేతాలను అందించదలుచుకున్నారు? అలాంటప్పుడు పార్టీలో నూటికి 99 శాతం మంది రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారని ఆయన నియమించిన పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా ప్రకటించడంలో ఔచిత్యమున్నదా? 


బిజెపియేతర పార్టీల్లో ఒక డోలాయమాన స్థ్థితి కనిపిస్తోంది. నాయకుడన్న వాడు ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా, మాట తప్పకుండా ప్రజలకు దిశా నిర్దేశం చేయగలిగి ఉండాలి. వారిని ఏకం చేయగలగాలి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయోద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ఎంత బలోపేతంగా జరిగాయంటే ఇవాళ కూడా ఎన్ని కడగండ్లకు గురైనా అవి ఎంతో కొంత స్థాయిలో నిలదొక్కుకోగలుగుతున్నాయి. తమిళనాడులో పెరియార్ వి. రామస్వామి, అన్నాదురై, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్, బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ లాంటి నేతలు నాటిన బీజాలను ఇప్పటికీ పెరికివేయలేక పోతున్నారు. కాని అందరు నాయకులను అదే విధంగా ఊహించుకోలేం. ‘ఏం చేస్తాం, మోదీతో మేమెక్కడ పెట్టుకుంటం? ఆయనను తట్టుకొని మేం బతగ్గలమా, మాకు పైసలు గావాలి. ఆయన మా జోలికి రాకుండా జూసుకోవాలి.’ అని ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మాజీ ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు.


అంత మాత్రాన అందరూ మోదీకి భయపడి తమ రాజకీయాలు మార్చుకుంటారని కూడా చెప్పలేం. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాడో పేడో తేల్చుకుని ఢీకొనేందుకు సిద్ధపడుతున్నారు. తమిళనాడులో డిఎంకె అధినేత స్టాలిన్ ఒక విస్పష్టమైన వైఖరితో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తున్నారు. మహారాష్ట్రలో బిజెపి ఆధిపత్యాన్ని ధిక్కరించి శివసేన--.. ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధపడింది. కేంద్రంలో భాగస్వామ్య పార్టీ అయిన అకాలీదళ్ పదవులను వదులుకుని రైతుల ఉద్యమానికి అండగా నిలిచింది. ఆఖరుకు రాజస్థాన్‌లో అత్యంత చిన్న పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో వ్యతిరేకించిన బిజూజనతాదళ్ రైతులకు కనీస మద్దతు ధర విషయంలో స్థిరమైన వైఖరికి కట్టుబడి ఉంటామని తాజాగా ప్రకటించింది. అదే సమయంలో భారత్ బంద్ లాంటి వాటికి దూరంగా ఉంటూ తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. విచిత్రమేమంటే ఒకప్పుడు కేంద్రంలో మంత్రి పదవులను త్యాగం చేశామని చెప్పుకుంటున్న వారిని, స్వయంగా సొంత రాష్ట్రంలో అధికారం అనుభవించడం ప్రారంభించాక ఏ భయం వెంటాడుతోంది? కొత్త సంవత్సరంలోనైనా దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయాలు వస్తాయని ఆశిద్దాం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-12-30T05:54:58+05:30 IST