ప్రజా త్రాసులో పాలకులు

ABN , First Publish Date - 2020-05-13T09:02:39+05:30 IST

‘భారత దేశంలో అభివృద్ధి వెలిగిపోతున్నదన్న విషయంలో సందేహం లేదు. కాని ఈ అభివృద్ధి కథ అంతా మధ్యతరగతి, సంపన్న వర్గాలకు, అహారేతర, నిత్యావసరం కాని, వినియోగ వస్తువులకు, తద్వారా విస్తరిస్తున్న మార్కెట్‌కు పరిమితమయింది. ..

ప్రజా త్రాసులో పాలకులు

కరోనా కల్లోల పరిస్థితుల్లో తమకు ప్రజాదరణ తగ్గిపోయిందా అన్న భయం ఢిల్లీ పెద్దలకు పట్టుకున్నట్లు కనపడుతోంది. మోదీ జనాదరణ గత ఏడాది ఏప్రిల్‌లో 71 శాతం ఉండగా, ఈ ఏడాది మేలో 79 శాతానికి పెరిగినట్లు ఒక టీవీ ఛానెల్ సర్వే తేల్చింది. ప్రజాదరణ గురించి ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావాలి? బహుశా నెలరోజుల క్రితం చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని చెప్పిన నాటికీ, ఇప్పటికీ తమ పట్ల ప్రజల అభిమానం తగ్గిందని ఏలినవారికి అనిపించి ఉండవచ్చు. అలా అనిపించినప్పుడల్లా ఇటువంటి సర్వేలు కొంత ఉత్సాహాన్నిస్తాయి.


‘భారత దేశంలో అభివృద్ధి వెలిగిపోతున్నదన్న విషయంలో సందేహం లేదు. కాని ఈ అభివృద్ధి కథ అంతా మధ్యతరగతి, సంపన్న వర్గాలకు, అహారేతర, నిత్యావసరం కాని, వినియోగ వస్తువులకు, తద్వారా విస్తరిస్తున్న మార్కెట్‌కు పరిమితమయింది. జనాభాలో 77 శాతం పేదలు, అణగారిన వర్గాల దుర్భర జీవన పరిస్థితులు ఈ కథను దుఃఖాంతం చేస్తున్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లింలు. వీరిది మరో ప్రపంచం. జనాభాలో మూడింట నాలుగోవంతున్న సామాన్య జీవుల ప్రపంచం. అభివృద్ధి వెలుగులు వీరి జీవితాల్లో ప్రసరించవు’-... ఈ వాక్యాలు, అసంఘటిత రంగంలోని పని పరిస్థితులపై యుపిఏ ప్రభుత్వం నియమించిన జాతీయ కమిషన్ 13ఏళ్ల క్రితం రూపొందించిన నివేదిక ఉపోద్ఘాతం లోనివి. ఈ నివేదికను రూపొందించిన వారిలో ప్రముఖ ఆర్థిక వేత్త అర్జున్ సేన్ గుప్తా, ప్రధానమంత్రి కార్యాలయంలో మాజీ అధికారి బి.ఎన్. యుగంధర్, ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు జీవించిలేరు. కాని వారు ఆ రోజు చేసిన అపారమైన శ్రమ మాత్రం ఇంకా సజీవంగా ఉన్నది. అసంఘటిత రంగంలో ఏ ఒక్కరినీ వారు విస్మరించలేదు. దినసరి కూలీలు, వేతన జీవులు, స్వయం ఉపాధిపై బతికేవారు, సంఘటిత రంగంలో ఏ రక్షణా లేకుండా పనిచేసేవారు, చెత్త ఏరుకునేవారు, చివరకు ఇళ్లలో పని చేసే పనిమనుషులను కూడా వారు పరిగణనలోకి తీసుకున్నారు. వారిలో అత్యధిక శాతం భూమి, ఇళ్లు లేని నిరుపేదలుగా తేల్చారు. ప్రమాదకరమైన రసాయనాలు, జంతు వ్యర్థ పదార్థాలు, విపరీతమైన వేడి, గాలీ వెలుతురూ సోకని ఇరుకైన ప్రాంతాల్లో ఘోరమైన పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా యుపిఏ ప్రభుత్వం 2008లో పార్లమెంట్‌లో ఒక చట్టం చేసింది. అయితే ఆ చట్టం కొందరు పదవులు పొందేందుకే మాత్రమే ఉపయోగపడింది తప్ప ఆచరణలో అసంఘటిత రంగంలోని అభాగ్యులకు దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. ఇక మోదీ ప్రభుత్వం అసంఘటిత రంగంలోని వారికి పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది కాని పెద్దగా ప్రయోజనాల్ని సాధించలేదు.


అర్జున్ సేన్ గుప్తా కమిటీ నివేదిక సమర్పించి 13 ఏళ్లయినా ఇవాళ సమాజంలోని 77 శాతం మంది అభాగ్య జీవుల పరిస్థితి మరింత దుర్భరంగానే మారింది కాని పెద్దగా మెరుగుపడడం లేదని లాక్‌డౌన్ తర్వాత నుంచి ఇప్పటి వరకూ వలస కార్మికుల జీవన దృశ్యాల్ని బట్టి అర్థమవుతోంది. ఇటీవల నైరుతి ఢిల్లీలోని కపాషెరా ప్రాంతంలో ఒక భవనంలో 40మందికి కరోనా సోకింది. ఈ భవనంలోనే ఇరుకిరుకు గదుల్లో పలువురు కలిసికట్టుగా జీవిస్తారని, శౌచాలయాలు పంచుకుంటారని వెల్లడయింది. ఢిల్లీలో పాలికాబజార్, నెహ్రూ ప్లేస్, కరోల్ బాగ్, చాందినీ చౌక్ మొదలైన అనేక ప్రాంతాల్లోను, న్యూఢిల్లీ నడిబొడ్డున ఉండే అంతరిక్ష భవన్ వంటి అనేక భవనాల అండర్ గ్రౌండ్ ఆఫీసుల్లోనూ లక్షలాది మంది చిరుద్యోగులు చాలీచాలని జీతాలపై పనిచేస్తుంటారు. సాఫ్ట్‌వేర్ ప్రపంచంగా పేరొందిన ఒక్క నెహ్రూ ప్లేస్‌లోనే 2 లక్షలమంది పనిచేస్తున్నారని అక్కడ సాఫ్ట్‌వేర్ వ్యాపారం చేసే మిత్రుడొకరు చెప్పారు. వీరందరూ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారు?


‘వలస కార్మికులు ఇళ్లకు వెళ్లాలనుకోవడం మానవస్వభావం..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ముఖ్యమంత్రుల సమావేశంలో అన్నారు. అది మానవ స్వభావం కన్నా ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం అనే ప్రధానంగా చెప్పాలి. తమ జీవన పరిస్థితులు బాగుంటే, తమ బాగోగులు చూసుకునే ప్రభుత్వాలుంటే ఎవరూ మైళ్లకు మైళ్లు నడిచి ఇళ్లకు వెళ్లాలనుకోరు. రైలు పట్టాలపై నిద్రపోయి రైలు చక్రాల క్రింద పడి నలిగి చావాలనుకోరు. ఇదే మానవ స్వభావం అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మధ్యతరగతి, సంపన్న జీవులకు ఎందుకు వర్తించదు? వారెందుకు రైళ్లు, విమానాలు ప్రారంభమయ్యేవరకు వేచి ఉన్నారు? కాశీలో చిక్కుకుపోయిన యాత్రికులో, రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులో పెద్దలకు వినతిపత్రాలు సమర్పించుకుని రవాణా ఏర్పాట్లు చేసుకున్న సందర్భాలున్నాయి. మరి వలస కార్మికులు ఎవరికి వినతిపత్రాలు సమర్పించుకోవాలి?


అయిదవసారి ప్రదానమంత్రి నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. ‘మరింత వ్యూహాత్మకంగా పనిచేయాలి, నూతన వాస్తవికతకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి..’ అని ఆయన ఎప్పటిలాగే చెప్పారు. ఎటొచ్చీ ఈ సమావేశంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రులను ప్రశంసించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ, వారు ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని, క్షేత్ర స్థాయి అనుభవాలతో విలువైన సూచనలు చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాని ఇంతవరకూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వారు చేసిన ఏ విజ్ఞప్తిపైనా ఆయన ప్రతిస్పందించలేదు. అంతేకాదు, ఆఖరుకు రైళ్లు నడిపే విషయంలో కూడా ఆయన ముఖ్యమంత్రులను సంప్రదించలేదని స్పష్టమవుతోంది. రైళ్లను నడపడం సరైంది కాదని తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు స్పష్టంగా చెప్పారు. ఇక రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లను నిర్ణయించే విషయంలో కూడా ముఖ్యమంత్రులను సంప్రదించడం లేదని, ఇష్టానుసారం నిర్ణయిస్తున్నారని కొందరు సిఎంలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ముఖ్యమంత్రుల క్షేత్ర స్థాయి అనుభవాలను ప్రధానమంత్రి ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారో అర్థం కావడంలేదు.


ఏమైతేనేం ఆర్థికంగా ఆదుకోకపోయినా ముఖ్యమంత్రులు బాగానే చేస్తున్నారని ప్రశంసించి ప్రధానమంత్రి మొదటి సారి వారి అహాలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బిజెపి అనుకూల టీవీ ఛానెల్ ఒకటి ఇటీవల జరిపిన సర్వేను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఛానెల్ చేసిన సర్వే ప్రకారం కొవిడ్ -19ను బాగా అరికట్టిన ముఖ్యమంత్రుల్లో అరవింద్ కేజ్రీవాల్, యడ్యూరప్ప తర్వాత కేసీఆర్‌కు మూడో స్థానం; పళనిస్వామి, ఉద్దవ్ ఠాక్రేల తర్వాత మమతా బెనర్జీకి ఆరో స్థానం కల్పించారు. ఏ ప్రాతిపదికన వీరు ముఖ్యమంత్రులకు ర్యాంకులిచ్చారో, కేజ్రీవాల్‌కు 65 మార్కులు, కేసిఆర్‌కు 49 మార్కులు ఎలా వేశారో అన్న విషయం స్పష్టీకరించలేదు. కేరళ ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నారో చెప్పలేదు. దేశంలో కొన్ని సర్వేలు రాజకీయాలకు అనుగుణంగా ఎలా ఉంటాయన్నది దీన్ని బట్టి అర్థం అవుతుంది.


దేశవ్యాప్తంగా కరోనా ఒకవైపు ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. వలసకార్మికుల దుస్థితి కళ్లకు కట్టినట్లు కనపడుతుంటే లక్షలాది ప్రైవేట్ యజమానులు తమ వ్యాపార సంస్థలు ఎలా నడపాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మార్కెట్, ఉత్పత్తి స్తంభించిపోయాయి. ఉత్పత్తులకు డిమాండ్ లభించడం లేదు. వినియోగదారులు తమ ప్రాధాన్యతల్ని మార్చు కుంటున్నారు. ఉత్పాదక వ్యయం తగ్గకపోయినా, ఆదాయం మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. మరో వైపు దేశంలో లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు నెలాఖరు అవుతుంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ ఖాతాలో ఎంత జీతం పడుతుందో, అసలు పడుతుందో లేదో వారికి తెలియని స్థితి. నెలసరి ఆదాయం తగ్గిపోయినా కుటుంబ ఖర్చులు ఏ మాత్రం తగ్గడంలేదు. ‘ఈ నెల మొత్తం జీతం ఇవ్వలేను. సగం మాత్రమే ఇస్తాను. అయినా నీవు పనికి రాలేదు కదా. మాక్కూడా జీతం తగ్గించారు.’ అని అనేక అపార్ట్ మెంట్లలో పనిమనుషులతో చెబితే వారు నిస్సహాయంగా తిరిగి వెళుతున్నట్లు మిత్రులతో సంభాషణల వల్ల తెలుస్తోంది.


ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్న పెద్దలకు తమ ఆదరణ తగ్గిపోయిందా అన్న భయం వేసినట్లు కనపడుతోంది. ప్రతి కొద్దిరోజులకూ ఒక సర్వే బయటకు వచ్చి మోదీ జనాదరణ శాతం పెరిగినట్లు ప్రకటిస్తోంది. పట్టణాల్లో నివసించే 87శాతం భారతీయులు మోదీని ఆదరిస్తున్నట్లు రెండు వారాల క్రితం ‘ఇప్సోస్’ అన్న సంస్థ ప్రకటించింది. తాజాగా టీవీ ఛానెల్ ఒకటి నిర్వహించిన సర్వేలో మోదీ జనాదరణ గత ఏడాది ఏప్రిల్‌లో 71శాతం ఉండగా, ఈ ఏడాది మేలో 79 శాతానికి పెరిగినట్లు తేల్చింది. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో తమ జనాదరణ గురించి ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావాలి? ఎలాగూ దేశంలో మోదీకంటే పెద్ద నేత ఎవరూ లేరు కదా! బహుశా నెలరోజుల క్రితం చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని చెప్పిన నాటికీ, ఇప్పటికీ ఏలిన వారి పట్ల అభిమానం తగ్గిందని అనిపించి ఉండవచ్చు. తమకే అలా అనిపించినప్పుడల్లా ఇటువంటి సర్వేలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే ఈ సర్వేను ట్వీట్ చేసి అసాధారణ సమయంలో ప్రధానమంత్రి మోదీ పట్ల జనాదరణ తార స్థాయికి చేరుకున్నదని, కరోనాపై పోరుకు వ్యతిరేకంగా దేశానికే ఆయన బలమైన నాయకత్వం అందిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ‘అసలు మీరు ఆర్థిక మంత్రా లేక మోదీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరా? ఒకవైపు దేశ అభివృద్ధి రేటు శూన్యానికి పడిపోయిందని మూడీ ఇన్వెస్టర్స్ సర్వీస్ చెబుతుంటే ప్రధానమంత్రికి ప్రజాదరణ ఎలా పెరిగింది?’ అని అనేకమంది ఆమె ట్వీట్‌పై బహిరంగంగా స్పందించారు. దేశ రాజధానిలో కేంద్ర మంత్రులు మనుగడ ఎలా సాధిస్తారో చెప్పడానికి మన ఆర్థిక మంత్రే ఒక చక్కటి ఉదాహరణ.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more