మోదీ వెలిగించిన ఆశా దీపాలు

ABN , First Publish Date - 2020-04-08T05:59:38+05:30 IST

స్వాతంత్ర్య సమర కాలంలో మహా త్మా గాంధీ పిలుపు ఇస్తే కోట్లాది ప్రజలు పాటించేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీ పిలుపును పాటించి లక్షలాది దేశ భక్తులు విదేశీ వస్త్ర దహనం చేశారు...

మోదీ వెలిగించిన ఆశా దీపాలు

మోదీ పాలనలో ఎన్ని తప్పులు జరుగుతున్నా, ప్రతిపక్షాల్లో తాము అనుసరించగలిగిన నేతలు లేరని ప్రజలు భావిస్తున్నందువల్లనే వారు మోదీతో కనెక్టు కాగలుగుతున్నారు. ప్రధానమంత్రిపై విమర్శలు చేసే వారికి విశ్వసనీయత లేదని జనం భావిస్తున్నట్టుంది. మోదీ పట్ల వ్యతిరేకత ఏర్పర్చగలిగినంత స్థాయిలో ప్రజలతో కనెక్టు కాగలిన నాయకులు ప్రతిపక్ష శిబిరంలో ఆవిర్భవించేవరకూ లేదా మోదీనీ ఆయన మాయాజాలాన్నీ ఇక భరించలేమని ఓటర్లు అనుకునేంతవరకూ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం లేదు.


స్వాతంత్ర్య సమర కాలంలో మహా  త్మా గాంధీ పిలుపు ఇస్తే కోట్లాది ప్రజలు పాటించేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీ పిలుపును పాటించి లక్షలాది దేశ భక్తులు విదేశీ వస్త్ర దహనం చేశారు. స్వాతంత్ర్యానంతరం నాయకులు ఉపన్యాసాలు వెలువరించడం, సందేశాలు ఇవ్వడం మామూలైపోయింది. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీల నేతల సభలకు హాజరయ్యే లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్పడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు  భారీ ఎత్తున ప్రజలు హాజరైనప్పటికీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అసలు టీవీల్లో, రేడియోల్లో నేతలు ఇచ్చిన సందేశాల్ని ప్రజలు వింటున్నారా అన్న అనుమానాలు కూడా అప్పుడప్పుడూ కలుగుతుంటాయి.


కానీ ఆశ్చర్యకరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల రెండు సందర్భాలలో ఇచ్చిన పిలుపులను దేశ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుని పాటించారు. మార్చి 23న ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా మోదీ ఇచ్చిన పిలుపును పాటించి కోట్లాది మంది సాయంత్రం అయిదు గంటలకు రకరకాల కరతాళ ధ్వనులు చేశారు. మళ్లీ ఏప్రిల్ 5న ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలు గుర్తు పెట్టుకుని మరీ లైట్లు ఆర్పేసి దివ్వెలు వెలిగించారు. దేశ రాజధాని ఢిల్లీ లోనే కాదు, దేశంలో నలుమూలలనుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే అసంఖ్యాక ప్రజలు దీపాలు వెలిగించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కమ్యూనిస్టు నాయకుడు కూడా దీపాలు వెలిగించి ఫోటోలు పంపితే సిరిసిల్లా నుంచి ఒక ప్రగతిశీల రచయిత ఫోన్‌లో మాట్లాడుతూ తమ చుట్టుప్రక్కల అంతా దీపాలు వెలిగించినట్లు తెలిపారు. ‘ఇదేమిటి మీరు మోదీ పిలుపును పాటించారా..’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు ‘ఏం చేస్తాం. మా ఆవిడ, పిల్లలు నా సలహా ఏమైనా తీసుకుంటే కదా..’ అన్నాడు. ‘చప్పట్లు కొట్టమన్నప్పుడు వచ్చిన ప్రతిస్పందన దీపాలు వెలిగించమన్నప్పుడు రాకపోవచ్చని అనుకున్నాను కాని అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన వచ్చింది’ అని హైదరాబాద్ నుంచి ఒక సంపాదకుడితో మాట్లాడినప్పుడు చెప్పారు. ఢిల్లీలో రోడ్లు తుడిచే ఒక మహిళ కూడా పహార్ గంజ్‌లో తమ బస్తీలో అంతా దీపాలు వెలిగించినట్లు చెప్పింది. ‘ఎందుకో గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవలి కాలంలో ఒక అనుబంధం ఏర్పడినట్లుంది..’ అని ఆమె చెప్పడం గమనార్హం. కాని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఒక ఐఏఎస్ అధికారిని కదిపినప్పుడు ‘ఇదేం తమాషా అండీ.. ఆర్థిక చర్యలను ప్రకటించాలికాని చప్పట్లుకొట్టమనడం, దీపాలు వెలిగించమనడం ఏమిటి..’ అని అడిగారు. కాని ఈ దేశంలో మెజారిటీ ప్రజలు సదరు అధికారి మాటలతో ఏకీభవిస్తున్నట్లు కనపడడం లేదు.


ప్రస్తుత పరిస్థితిని స్వాతంత్ర్య సమయంలో ఉన్న పరిస్థితితో పోల్చడం లేదు కాని టీవీలో ప్రధానమంత్రి చెప్పినంత మాత్రాన ప్రజలు అంత సీరియస్‌గా తీసుకుంటారా? అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ మన దేశంలో దాదాపు 20 కోట్ల టీవీ సెట్లు ఉన్నాయని, 80 కోట్ల మొబైల్స్ ఉన్నాయని అంచనా. అందులో దాదాపు 40 కోట్లు ముఖేశ్ అంబానీ ప్రవేశపెట్టిన జియో ఫోన్లే ఉన్నాయని గణాంక వివరాలు చెబుతున్నాయి. మరి మోదీ ఇచ్చిన సందేశం ఏదో రకంగా ప్రజలకు చేరితే ఆశ్చర్యం ఏమున్నది? చేరితే చేరనీ.. ప్రజలు దాన్ని ఎందుకు గౌరవించాలి? అంటే కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ప్రజలు మోదీతో అనుబంధం ఏర్పర్చుకుని ఆయన పిలుపును గౌరవిస్తున్నారన్నమాట. ప్రజలతో కనెక్టు కావడం అంటే ఇదే. బహుశా ఈ కనెక్టు కాగలిగిన శక్తి వల్లే గత రెండు సార్వత్రక ఎన్నికల్లో నరేంద్రమోదీ భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టగలిగారు.


నరేంద్ర మోదీని అడగడానికి చాలా ప్రశ్నలు ఉండవచ్చు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించడాన్ని అనేకమంది ఆర్థిక వేత్తలు వేలెత్తి చూపుతున్నారు. ఆయన తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం మొదలైన నిర్ణయాలు అంత సానుకూల ఫలితాలు సాధించలేదని విమర్శలు కూడా వచ్చాయి. మోదీ హామీ ఇచ్చిన విధంగా ఉపాధి కల్పన జరగలేదని, పేదరికాన్ని రూపుమాపలేదని, రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని, విద్యా, వైద్య రంగాలపై ఆయన చూపాల్సినంత శ్రద్ధ చూపలేదని, రాష్ట్రాల పట్ల ఆయన సమతుల్య వైఖరిని ప్రదర్శించలేదని ఇత్యాది విమర్శలు లేకపోలేదు. పర్యవసానాలు ఆలోచించకుండా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని కూడా చాలా సందర్భాల్లో స్పష్టమయింది. తాజాగా లాక్‌డౌన్ తర్వాత లక్షలాది వలస కూలీలు దుర్భరమైన ఇక్కట్ల పాలు కావడం అందరికీ తెలిసిందే. ఇవి కాక వ్యవస్థలను ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని, కేంద్రంలో అధికారం పూర్తిగా మోదీ చుట్టే కేంద్రీకృతమైందని విమర్శలు చేసే వారు ఉన్నారు.


కానీ ఇవాళ ప్రజలు ఈ ప్రశ్నలు అడగడానికి సిద్ధ పడడం లేదు. ఫేస్‌బుక్‌లోనూ, ఇతరత్రా సోషల్ మీడియాలోనూ, పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలను ఈ విషయంపై చైతన్యపరిచేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కాని నిశితంగా పరిశీలిస్తే  ఈ ప్రయత్నాలన్నీ అంతగా సఫలీకృతమైనట్లు కనపడడం లేదు. మరో వైపు మోదీ, ఆయన అనుయాయులు  చేసే ప్రకటనలను, సోషల్ మీడియాలో వారి ప్రచారాన్ని అనుసరించేవారు వేలాది మంది కనపడుతున్నారు. దీనికి కారణం ఏమిటి?


ప్రధాన కారణం మోదీని విమర్శించేవారు ప్రజలతో కనెక్టు కాలేకపోవడమే అని వేరే చెప్పనక్కర్లేదు. మోదీ హయాంలో ఎన్ని తప్పులు  జరిగినా ప్రతిపక్షాల్లోను, విమర్శకుల్లోనూ తాము గౌరవించేవారు, అనుసరించగలిగిన వారు లేరని ప్రజలు భావిస్తున్నందువల్లనే వారు మోదీతో కనెక్టు కాగలుగుతున్నారని అనుకోక తప్పదు. మోదీ పట్ల వారు చేసే విమర్శలు సరైనవే కావచ్చు కాని విమర్శలు చేసే వారికి తాము నమ్మదగిన విశ్వసనీయత లేదని జనం  భావించవచ్చు. మోదీతో పోలిస్తే చాలా మంది ప్రతిపక్ష నాయకులు వారికి అంగుష్ట మాత్రుల్లాగా కనిపిస్తున్నారని కూడా అనుకోవచ్చు. అందువల్ల మోదీ పట్ల వ్యతిరేకత ఏర్పర్చగలిగినంత స్థాయిలో ప్రజలకు కనెక్టు కాగలిన నాయకులు ప్రతిపక్ష శిబిరంలో ఆవిర్భవించేవరకూ, లేదా మోదీని, ఆయన మాయాజాలాన్ని ఇక భరించలేమని ప్రజలు అనుకునేంతవరకూ ప్రస్తుత వాతావరణంలో మార్పు వచ్చేందుకు అవకాశం లేదు.


ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు మోదీ మరింత కనెక్టు కావడానికి అనేక కారణాలున్నాయి. ఒకటి-  మోదీకి  సంక్షోభ సమయాన్ని అవకాశంగా మార్చుకోగలిగిన శక్తి ఉన్నది. వైరస్ ముదిరిపోతున్నదని కొద్దిగా ఆలస్యంగా గ్రహించినప్పటికీ ఆయన కొద్ది రోజుల్లోనే పరిస్థితి తన గుప్పిట్లోకి తీసుకురాగలిగారు. ఇది మొత్తం ప్రపంచవ్యాప్త సమస్య కాబట్టి  భారత దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం అందించాల్సిన బాధ్యత ఆయనపై పడింది. రాజ్యాంగం ప్రకారం భారత దేశం  రాష్ట్రాల సమితి మాత్రమే కాని  సమాఖ్య కాదు.


రాజ్యాంగంలో ఫెడరేషన్ అన్న మాటే లేదు. రాష్ట్రాలకు సంబంధించిన అనేక నిర్ణయాలు కేంద్రం గుప్పిట్లో ఉంటాయి. కాని నరేంద్ర మోదీ ఎటువంటి విశేష అధికారాలను ప్రయోగించకుండానే రాష్ట్రాలను విశ్వాసం లోకి తీసుకుని కరోనా వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.  1897 నాటి అంటువ్యాధుల చట్టం, ఎన్డీఏంఏ చట్టం ఈ రెండు చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇది కలిసికట్టుగా ఎదుర్కొవాల్సిన సమస్య కనుక రాష్ట్రాలు కూడా వెంటనే సానుకూలంగా స్పందించవలిసి వచ్చింది. ఇది ప్రభుత్వాల ద్వారా ఎదుర్కోవాల్సిన సమస్య కనుక ప్రజల కళ్లముందు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పనిచేస్తున్నట్లు కనపడాల్సిన అవసరం కూడా ఏర్పడింది.  ప్రభుత్వమే సర్వంతర్యామి అయినందువల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ‘ప్రభుత్వ వివేకానికి అదనపు వివేకాన్ని ఏ రకంగా జోడించగలం?’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో  కేంద్ర స్థాయిలో నరేంద్రమోదీ, రాష్ట్ర స్థాయిలో వివిధ ముఖ్యమంత్రులు తమ సమర్థతతో పాటు తమ ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రుల్లో కూడా జనంతో కనెక్టు కాగలిగిన కేసిఆర్ లాంటి నేతలు తక్కువే కావడం వల్ల దేశవ్యాప్తంగా మోదీ విశ్వరూపమే అధికంగా కనిపిస్తోంది. మన దేశంలో పరోక్షంగా అధ్యక్ష పాలన అమలులో ఉన్నదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మోదీతో కనెక్ట్ అయితే జనంతో కూడా కనెక్ట్ కాగలమని నేతలు గ్రహించే పరిస్థితి ఏర్పడుతోంది.


విచిత్రమేమంటే తబ్లిగీ సంఘటన తర్వాత మోదీ పట్ల జనానికి ఆదరణ మరింత పెరిగింది. కారణం ఈ సంఘటన మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని మెజారిటీ ప్రజలు నమ్మేందుకు ఆస్కారం కలిగించడం. ఆ అవిశ్వాస అగ్నికి ఆజ్యం పోసేందుకు జరిగే ప్రయత్నాలు ఎలాగూ జరుగుతాయి. ఈ సంఘటన తర్వాత భారత దేశమంతా దీపాలు వెలిగించాలని మోదీ ప్రజలకు పిలుపు ఇవ్వడం అనాలోచితంగా జరిగింది కాదు. భారత దేశంలోని మెజారిటీ ప్రజల జీవితాల్లో దీపాలకున్న ప్రాధాన్యత, పవిత్రత ఆయనకు తెలియనిది కాదు. సరే, ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను మోదీ ఎప్పుడు ఫలింపజేస్తారని అడిగేవారు ఎప్పుడూ ఉంటారు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-04-08T05:59:38+05:30 IST