క్యాంపస్‌ కల..చెదిరింది!

ABN , First Publish Date - 2020-04-26T11:18:55+05:30 IST

కరోనా యువత కలలను తల్లకిందులు చేసింది. లాక్‌డౌన్‌తో విద్యా సంస్థలు మూతపడ్డాయి.

క్యాంపస్‌ కల..చెదిరింది!

భవితపై బెంగ.. సెలక్షన్స్‌ లేవు

ఎంపికైన వారిలోనూ గుబులు

లాక్‌డౌన్‌తో యువతకు నిరాశ


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): కరోనా యువత కలలను తల్లకిందులు చేసింది. లాక్‌డౌన్‌తో విద్యా సంస్థలు మూతపడ్డాయి. క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిలిచిపోయాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. ఇప్పటికే లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపికైన విద్యార్థులకు జాయినింగ్‌ ఆర్డర్‌ ఇస్తారా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. యువత భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో బహుళ జాతి సంస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశీయంగా పేరుమోసిన ఒకటి రెండు సంస్థలు మాత్రమే ఇప్పటికీ యువ తపై దృష్టి సారించాయి. ఇంజనీరింగ్‌ కళాశాలలతో సంప్రదింపులు సాగిస్తున్నాయి.ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. మిగిలిన సంస్థల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే క్యాంపస్‌ సెలక్షన్స్‌ పూర్తిచేసిన సంస్థలు ఫలితాలు వెల్లడించడం లేదు. విద్యా సంవత్సరం ముగింపుకొస్తున్న వేళ..క్యాంపస్‌ సెలక్షన్స్‌ ప్రారంభ వేళ..కరోనా మహమ్మారి విరుచుకుపడింది. లాక్‌డౌన్‌తో కల చెదిరిపోయింది. క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిలచిపోయాయి. 


అమెరికా వలస నిషేధ ప్రభావమెంత  ?

ఒకవైపు లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సంస్థలు అమెరికా వలస నిషేధం ప్రభా వాన్ని అంచనా వేసుకుంటున్నాయి. అక్కడి ప్రాజెక్ట్‌ల ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఇక్కడ ఉద్యో గాలకు ఎంపిక చేసేవారు. అమెరికాలో వలసల నిషేధం  ప్రభావం కూడా దేశీయంగా కంపెనీలు ఎంపికచేసే యువతపైనా ప్రభావం చూపుతుందని అంచనా.  


కోర్‌ ఇండస్ర్టీలపైనే ఆశలు 

కోర్‌ ఇండస్ర్టీస్‌ రంగంలో భవిష్యత్తులో యువతకు ఉపాధి లభిస్తుందని కళాశాలలు ఆశాభావంతో ఉన్నాయి. చైనా నుంచి కోర్‌ ఇండస్ర్టీస్‌ భారత్‌వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అదే నిజ మైతే మెకానికల్‌, సివిల్‌, ఉత్పత్తి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. జిల్లాలో ఉన్నత విద్య నభ్యసించిన 8 వేల మంది విద్యార్థులు ఏటా క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వారిలో 4వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు.


జిల్లాలో పేరు మోసిన పది ఇంజనీరింగ్‌ కళా శాలల్లోనే సగటున 300 నుంచి 500 మంది విద్యార్థులు ఏటా క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. మరో 4 వేల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులను పలు సంస్థలు క్యాంపస్‌ సెలక్షన్స్‌ ద్వారా భర్తీ చేసుకుంటున్నాయి. ఇప్పటికే 70 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌తో డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చిన వెంటనే జూలైలో కంపెనీలు జాయినింగ్‌ ఆర్డర్‌లు వస్తుంటాయి.ఈసారి ఆ పరిస్థితులు కనిపించడం లేదని యువత కలవరపడుతోంది.

Updated Date - 2020-04-26T11:18:55+05:30 IST