మోక్షమెప్పుడో..!

ABN , First Publish Date - 2020-12-06T05:47:43+05:30 IST

ఏడాదిన్నర కాలంగా ఎలాంటి మరమ్మతులు లేకపోవడంతో జిల్లాలోని రహదారులన్నీ దెబ్బతిన్నాయి.

మోక్షమెప్పుడో..!
రహదారుల అధ్వానంపై శనివారం కానూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు,నాయకులు

వర్షాలకు రహదారులు నాశనం

ఏడాదిన్నరగా పట్టించుకోని ప్రభుత్వం

ఆరు నెలల్లో రెండుసార్లు ప్రతిపాదనలు

నిధులు రాక అధికారుల తిప్పలు


నివర్‌ తుఫాన్‌ వల్ల కురిసిన వర్షాలకు రహదారుల పరిస్థితి ఏంటి అని ఒకరిని అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం వచ్చింది. ‘ తుఫాన్‌కు రోడ్లేమీ పెద్దగా దెబ్బతినలేదండీ..! ఎందుకంటే దెబ్బతినడానికి అసలు రోడ్లంటూ ఉంటే కదా !!’ – ఇది జిల్లాలో ఉన్న రహదారుల దుస్థితికి అద్దం పడుతున్న సమాధానం. 

ఏలూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నర కాలంగా ఎలాంటి మరమ్మతులు లేకపోవడంతో జిల్లాలోని రహదారులన్నీ దెబ్బతిన్నాయి. మరమ్మతుల ఊసే లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం చిన్న గుంతలా ఉన్నది ఇప్పుడు అగాథంలా తయారైంది. ఇటీవల వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు, నివర్‌ తుఫాను దెబ్బకు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాలకు తోడు ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.   

ప్రతిపాదనలతో సరి.. 

గడిచిన ఆరు నెలల్లో రహదారుల మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకూ అక్కడి నుంచి నిధులు వచ్చిన దాఖలాలు లేవు. జిల్లాలో ఉన్న జాతీయ రహదారులు సహా మొత్తం 3,516 వేల కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. జూలై నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు 1,400 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు నివేదికలు పంపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు మరో 1100 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపారు. దాని పరిస్థితీ అంతే..దీంతో రహ దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అధికారులు కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం లేదని సమాచారం. 


అంచనాలు తగ్గించినా రాని నిధులు

గతంలో రహదారులపై గొయ్యి ఏర్పడితే ఆ గొయ్యి ఉన్న కిలోమీటరు పరిధి వరకూ రోడ్డు పాడైపోయినట్లు గణించేవారు. అది రహదారి మరమ్మతు జాబితాలో చేరిపోయేది. తాజాగా ప్రభుత్వం దీన్ని సవరించింది. ఇప్పుడు గొయ్యి ఉన్న 200 మీటర్ల వరకు మాత్రమే రహదారి పాడైపోయినట్లు పరిగణించాలి. ఆ విధంగా చూసినప్పుడు గతంలో ఉన్న మరమ్మతుల కంటే ప్రస్తుతం ఉండే మరమ్మతులు ఐదో వంతుకు తగ్గుతాయి. కనీసం ఆ నిధులన్నా వస్తే కొంత పని నడుస్తుంది. దీనికి అను గుణంగానే  పోయిన సెప్టెంబరులో అధికారులు ప్రతిపాదనలు తగ్గించి పంపారు. కానీ దానికి కూడా ఇప్పటి వరకూ స్పందన లేదు. మరోవైపు రహదారుల పరిస్థితి ప్రయాణించడానికి వీలు లేనంతగా దెబ్బతినిపోయింది. తక్షణ మరమ్మతులైనా చేయించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పకపోవచ్చు. 


నిర్వహణా కరువే..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల నిర్వహణ ఖర్చులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటివరకూ సింగిల్‌ రోడ్డు నిర్వహణకు కిలోమీటరకు 20 వేలు ఇస్తుండగా దానిని 40 వేలకు, రెండు రోడ్లకైతే కి.మీ.కి 25 నుంచి 50 వేలకు నిర్వహణ చెల్లింపులు పెంచినట్లు చెప్పింది. అది ప్రకటనలకే పరిమితమైంది. రోజువారీ మెయింటెనెన్స్‌కు కూడా ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి రాలేదు. దీంతో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితి ఆర్‌అండ్‌బీ  అధికారులను వెంటాడుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఒక్కో డివిజన్‌ పరిధిలో సగటున 5 కోట్ల రూపాయల మేర మెయింటెనెన్స్‌ నిధులు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్వహణ మొత్తం అధికారులు వారి సొంత చొరవతో చేయించినవి కావడం గమనార్హం.

 పనులు  చేయిస్తున్నాం : భరతరత్న, ఈఈ, ఏలూరు

రహదారుల రోజువారీ నిర్వహణ చేస్తున్నాం. కాంట్రాక్టర్లను ప్రోత్సహించి పనులు చేయిస్తున్నాం. వారికి కూడా బకాయిలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే వారికి చెల్లించాలి. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపాం. మరమ్మతులకు మాత్రం నిధులు రాకుంటే ఏమీ చేయలేని పరిస్థితి.


Updated Date - 2020-12-06T05:47:43+05:30 IST