ఈ జనానికి ఏమైంది! కరోనా తగ్గిపోయిందా లేక లాక్‌ తీశారా..!

ABN , First Publish Date - 2020-05-11T10:03:44+05:30 IST

ఈ జనానికి ఏమైంది..!!

ఈ జనానికి ఏమైంది! కరోనా తగ్గిపోయిందా లేక లాక్‌ తీశారా..!

ఎనీ సెంటర్‌.. నో ఫియర్‌

రోడ్డెక్కిన లాక్‌ డౌన్‌ ఆంక్షలు

విచ్చలవిడిగా తిరుగుతున్న జనం

కానరాని భౌతిక దూరం

పట్టణాలు.. పల్లెల్లోనూ ఇదే సీన్‌


ఏలూరు(ఆంధ్రజ్యోతి)‌: ఈ జనానికి ఏమైంది..!! ఇంతలా దూసుకొచ్చేస్తున్నారు..!! ఆపేవారు లేరు.. అడిగేవారు లేరు..!! కరోనా తగ్గిపోయిందా లేక లాక్‌ తీశారా..!! ఇదీ ఆదివారం చాలామందికి వచ్చిన డౌట్‌.. ఎందుకంటే ఎనీ సెంటర్‌ నో ఫియర్‌.. జనంతో కిటకిటలాడిపోయాయి.. అడుగు తీసి అడుగేయడానికి వీల్లేకుండా కనిపించాయి.. అధికారులు కాస్త సడలింపు అనే మాట అన్నారంతే భయం గియం ఒక్కసారిగా ఎగిరిపోయాయి.. ఎక్కడ లేని పనులు వచ్చేశాయి. భౌతిక దూరం మచ్చుకైనా కానరాలేదు. మాస్క్‌లు మడతపెట్టి జేబులో పెట్టేశారు. ఏ షాపులో చూసినా జనమే.. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాలు ఉదయం నుంచి జనంతో కిక్కిరిశాయి. లాక్‌డౌన్‌తో ఇంటి గడప దాటని వారంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు.. ఏంటిది బాబూ.. కాస్త ఆలోచించండి.. కరోనా వచ్చిందంటే కాలగర్భంలో కలిసి పోవాల్సిందే.. స్టే  హోమ్‌.. స్టే సేఫ్‌.. నినాదాన్ని మాత్రం మర్చిపోకండి.. 


లాక్‌.. డౌన్‌

లాక్‌...డౌన్‌ అయ్యింది.. కరోనా అటకెక్కింది..నిన్నటి వరకూ బయటకు రావాలంటేనే భయపడిన జనం ఒక్కసారిగా రోడ్లపై తిరిగేందుకు పోటీపడుతున్నారు.. ఆంక్షల కట్టడిని ప్రభుత్వ సడలింపులతో తెంచుకుని ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ఏ షాపు వద్ద చూసినా ఈ రోజే మనది అన్నట్టు నిత్యావసరాలు.. తదితర వస్తువులకు ఎగబడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బైక్‌లపై రయ్‌ రయ్‌మంటూ చక్కర్లు కొడుతున్నారు..అక్కడక్కడా పోలీస్‌ బీట్‌లు ఉన్నా ఏమాత్రం లెక్కచేయడంలేదు. భౌతిక దూరం మరచిపోయారు.. మాస్క్‌లు మడత పెట్టేశారు. పట్ట ణాలు.. పల్లెలు అన్ని చోట్లా ఇదే పరిస్థితి.. ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో చాలా మంది కరోనా పోయిందనే భ్రమలో ఉన్నారు. దీంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు..


కొందరు తెలిసినా ఆ ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో దర్జాగా తిరిగేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ కనిపించే జనం ప్రస్తుతం రోజంతా బయటే తిరుగుతున్నారు. తాడేపల్లిగూడెం, గణపవరం, తాళ్లపూడి, దేవరపల్లి, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఆదివారం జనసంచారం ఎక్కువగా ఉంది.దీంతో కరోనా ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తుందోననే భయం కరోనాపై అవగాహన ఉన్నవారందరినీ వెంటాడుతోంది. 

 

కంటైన్మెంట్‌లోనూ కంట్రోల్‌ తప్పుతున్నారు...

ఒక వారం కిందటి వరకూ రెడ్‌జోన్‌ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేవారు జనం.. ఆ వైపునకు వెళ్లడమే మంచిది కాదన్నట్టు చూసేవారు. పోలీసులు కూడా రెడ్‌జోన్‌లో ఆంక్షలను అంత కట్టుదిట్టంగానూ అమలుచేసేవారు. అయితే ప్రభుత్వం జోన్‌లుగా విభజించిన తరువాత ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మనకేం కాదులే... కరోనా మన వరకూ రాదులే అనే ధైర్యం చాలా మందికి వచ్చింది.. యంత్రాంగం కూడా కాస్త పట్టు సడలించడంతో విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. రెడ్‌జోన్‌ అయినా పోలీసులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో రోడ్లపై రద్దీ వాతావరణం కన్పిస్తోంది. ఏలూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమడోలు, భీమవరం, పోలవరం, టి.నరసాపురం, కొవ్వూరు, ఆకివీడు, ఉండి, గోపాలపురంలలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. సుమారు 10 కి.మీ మేర ఆ ప్రభావం ఉండేది. ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించడంతో 3 కి.మీ తగ్గింది.


కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో ఉండగా వాటిలో ఉదయం 6  నుంచి 9 గంటల వరకూ లాక్‌డౌన్‌ సడలింపు ఉంది. ఆ సమయం లోనూ భౌతికదూరం పాటించడంతో పాటు ద్విచక్ర వాహనంపై ఒక్కరికే అనుమతి ఉంది. విధిగా మాస్కులు ధరించడం వంటివి అమలు చేయాలి. నిన్నమొన్నటి వరకూ ఆ విషయంలో యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరించింది. అయితే గత కొద్ది రోజులుగా ఆ పరిస్థితి మారింది. లాక్‌డౌన్‌ నిబందనలు కొనసాగుతున్నప్పటికీ నియంత్రణ మాత్రం తగ్గింది. సడలింపు వేళ రద్దీ పెరిగింది. చాలాచోట్ల భౌతికదూరం పాటించడంలేదు, మాస్కులు లేకుండా ద్విచక్రవాహనాలపై ఇద్దరు, ముగ్గురేసి తిరగడం పెరిగింది. వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. 


ఆంక్షలు ముక్కముక్కలు

ఆదివారం వచ్చిందంటే ముక్క తినెయ్యాలి.. మటనో.. చికెనో లేదంటే చేపో.. అదీ కాదంటే గుడ్డో.. ఏదో ఒకటి కంచంలోకి రావాల్సిందే.. లేదంటే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. ఆదివారం నీచి లేదంటే.. ఈ రోజు కూడా కూరగాయలేనా అంటూ ఏదో నీచుల్లా చూస్తున్నారు.. ప్రస్తుతం చాలా మందిలో వచ్చిన మార్పు ఇది.. అందుకే ప్రతీ ఒక్కరూ ఆదివారం వచ్చిందంటే ముక్కకు క్యూకడుతున్నారు. ఒక పక్క కరోనా ఆంక్షలు అమలులో ఉన్నా ఏ వారం కూడా మాంసాహార దుకాణాల వద్ద రద్దీ తగ్గలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక పక్క ధరలు పెరుగుతున్నా ముక్క మజాను మాత్రం వదలడం లేదు.కిలో మటన్‌ రూ. 900, కిలో చికెన్‌ రూ. 200 కిలో చేప రూ. 160లకు విక్రయించారు. అయినా ఏ మాత్రం రద్దీ తగ్గలేదు.  పాలకొల్లు,పాలకోడేరు, కాళ్ల, పెదవేగి, బుట్టాయగూడెం, నల్లజర్ల, ఉంగుటూరు,  ద్వారకాతిరుమల, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. జనం కనీసం భౌతిక దూరం పాటించకుండా ముక్కకు పోటీపడ్డారు. 


వద్దన్నా వినరే...

కంటైన్మెంట్‌ జోన్లలో మాంసాహార విక్రయాలను నిషేధించారు. అయినా కొన్ని పాంత్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. ఏలూరు నగరంతో పాటు గ్రామాల్లో గత నాలుగు వారాల నుంచి మాంసాహార విక్రయాలకు అడ్డుకట్ట వేసిన అధికాయ యంత్రాంగం ఈ ఆదివారం అడ్డుకోలేపోయింది. తెల్లవారుజామున పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో చికెన్‌, మటన్‌ వ్యాపారస్తులు దొడ్డిదారిన వేటలు, కోళ్లు కోశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే షాపులు బయట వ్యాపారి ఉండి వెనుక వైపున ఉన్న మార్గం ద్వారా జోరుగా మాంసాహార విక్రయాలు కొనసాగించారు. కొన్ని రెడ్‌జోన్లలో ముందు రోజే ఆర్డర్లు తీసుకున్న వ్యాపారస్తులు ఉదయం 6 గంటల కల్లా ప్యాకెట్లతో చేర్చారు. కిలో మటన్‌ రూ. 800, కిలో చికెన్‌ రూ. 300 వసూలు చేశారు.


ఏలూరు, మండలంలో చికెన్‌, మటన్‌ దుకాణాలన్నింటిని మూసి వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం నాలుగు వారాల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ తీయడానికి వీలులేదని హెచ్చరికలు జారీ చేసింది. అయినా విక్రయాలు ఆగలేదు. రెడ్‌జోన్‌లో ఉన్న స్టాల్స్‌లోనూ గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు ముగించారు. నరసాపురం లోనూ చికెన్‌, మటన్‌ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగి పోయాయి. పాలకొల్లు పట్టణ శివారులో నాన్‌వెజ్‌ ప్రియులు చేపలకు పోటీపడ్డారు. భీమడోలు మండలంలో చేపలు, మాంసం విక్రయాలు నిషేధించినప్పటికీ కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా అమ్మ కాలు సాగిపోయాయి. తాడేపల్లిగూడెం ఆదివారం మార్కెట్‌లో చేపలు, రొయ్యల విక్రయాలు జోరుగా సాగాయి. భీమవరంలో మాంసం విక్రయాలు నిషేధించినా జీఎండ్‌వీ కెనాల్‌ వంతెన వద్ద విక్రయాలు సాగాయి. కంటైన్మెంట్‌ జోన్లలోనూ మాంసాహార విక్రయాలు వద్దనా.. ఆగలేదు..


Updated Date - 2020-05-11T10:03:44+05:30 IST