వైభవంగా షష్ఠి వేడుకలు
ABN , First Publish Date - 2020-12-21T05:07:57+05:30 IST
సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది.

కొవ్వూరు,డిసెంబరు 20: సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. వేకువజామున పట్టణ,పరిసర ప్రాంతాల నుంచి భక్తులు గోష్పాదక్షేత్రంలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకాలు, విశేషపూజలు చేశారు. గోదావరి గట్టుపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో షష్ఠి ఉత్సవం నిర్వహించారు. భక్త జనసందోహం నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
టి.నరసాపురం: టి.నరసాపురంలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. సామంతపూడి బాలసూర్యనారా యణరాజు, నవీన దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం సామంతపూడి సూరిబాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం పురవీధుల్లో స్వామి వారి రథోత్సవాలు మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు.
చింతలపూడి:నాగిరెడ్డిగూడెంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. సరిహద్దులో కృష్ణాజిల్లా పలు గ్రామాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. సుమారు 2500 మంది భక్తులకు పులిహోర పొట్లాలను నిర్వాహకులు అందజేశారు.
చాగల్లు: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణం వేడుకగా జరిగింది. విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. రాత్రి స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.
జీలుగుమిల్లి: షష్ఠి ఉత్సవాలు జీలుగుమిల్లిలో ఘనంగా జరిగాయి. స్వామివారి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. వేకువ జామున స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వెలుపల సుబ్రహ్మణ్యస్వామికి పుట్టలో పాలు పొసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
బుట్టాయగూడెం: రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్వేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. షష్ఠి ఉత్సవాలు సందర్భంగా ఆదివారం నందాపురంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాళ్లపూడి: గజ్జరం, ప్రక్కిలంక, తాళ్లపూడి, వేగేశ్వరపురం, రాగోలపల్లి, పెద్దేవంలో ఆలయాలలో షష్ఠి వేడుకలు ఆదివారం జరిగాయి. శనివారం రాత్రి ఆయా ఆలయాలలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయాలకు చేరుకున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సొంత గ్రామం పెద్దేవం కావడంతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు.
దేవరపల్లి: దేవరపల్లి మండలంలో సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ద్వారకాతిరుమల: వేంకటేశ్వరస్వామి ఉపాలయమై చెరువు వీఽధిలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను ప్రత్యేకాభరణాలతో అలంకరించి రజిత సింహాసనంపై ఆశీనులు గావించారు. దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల శిరస్సులపై బెల్లం, జీలకర్ర పెట్టారు. అనంతరం మాంగల్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలు నిర్వహించారు.
వేలేరుపాడు: షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని భూదేవి పేటలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నాడు భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భూమా శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా మండల వ్యాప్తంగా భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. బైనగూడెం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొయ్యలగూడెం, కన్నాపురం గ్రామాల్లో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి బారులుతీరారు.