‘జగనన్న తోడు’ రుణం కోసం బ్యాంకులకు వెళ్లి.. షాక్‌కు గురవుతున్న చిరు వ్యాపారులు!
ABN , First Publish Date - 2020-12-11T05:38:02+05:30 IST
చిరు వ్యాపారుల కోసం ప్రవేశ పెట్టిన జగనన్న తోడు పథకం రుణాన్ని అందజేయడంలో బ్యాంకులు వింతగా వ్యవహరిస్తున్నాయి.
సగమే ఇస్తారట..!
బ్యాంకుల తీరుతో జగనన్న తోడు లబ్ధిదారుల్లో నిరాశ
ఏలూరు రూరల్, డిసెంబరు 10 : చిరు వ్యాపారుల కోసం ప్రవేశ పెట్టిన జగనన్న తోడు పథకం రుణాన్ని అందజేయడంలో బ్యాంకులు వింతగా వ్యవహరిస్తున్నాయి. అధికారులు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితికి తేడా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. వాస్తవానికి రూ.పదివేలు చొప్పున బ్యాంకులు రుణం అందించాలి. కొన్ని బ్యాంకులు సగం మాత్రమే అందించి ఆ రుణం చెల్లించాక మిగిలిన రూ.ఐదు వేలు రుణం ఇస్తామని మెలిక పెడుతుండడంతో లబ్ధిదారులు విస్తుపోతున్నారు. మండలంలోని పలు బ్యాంకు మేనేజర్లు రూ.ఐదు వేలు లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నామని వారి రికవరీ చెల్లింపులు బాగుంటే మిగిలిన రుణ మొత్తం ఇస్తామని చెబుతున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రుణ గ్రహీతల నుంచి స్టాంపు డ్యూటీని ఒక్కో బ్యాంకు ఒక్కోలా వసూలు చేస్తోంది. స్టాంపు డ్యూటీని చెల్లించాక తీరికగా దానిని మినహాయిస్తు న్నట్టు అధికారులు ప్రకటించారు. బ్యాంకులు రూ.50 నుంచి రూ.150 వరకూ కోర్టు ఫీజు స్టాంపులను కొనుగోలు చేయిస్తున్నాయి. వీటిని మినహాయించినట్టు ప్రభుత్వం ప్రకటించినా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ పథకంలో రుణం పొందేవారు బ్యాం కుల్లో అకౌంటును ప్రారంభించేందుకు రూ.1000 చొప్పున డిపాజిట్ చేయాలని చెబుతుండడం తో చిరు వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. తాత తండ్రుల కాలం నుంచి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిలో చాలా మందికి ఈ రుణాలు అంద డంలేదు. ఏలూరు మండలంలో 2041 మంది దరఖాస్తు చేసుకోగా 1851 మం దిని అర్హులుగా గుర్తించగా 1354 మందికి లబ్ధి చేకూరింది. మొత్తం లబ్ధిదారు లకు రూ.1,11,91,000 వేలు రుణాలు అందజేయనున్నారు.
రుణం మొత్తం ఇవ్వనంటున్నారు
చిరువ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకానికి అర్హులైన బ్యాంకు అధికారులు ఏదో కారణం చెప్పి రుణం ఇవ్వడం లేదు. రూ.10 వేలు మంజూరు అయింది. ఇందులో సగమే ఇస్తానంటున్నారు. రూ.ఐదు వేలు చెల్లించిన తరువాతే మిగతా రూ.ఐదు వేలు ఇస్తామంటున్నారు. అర్హు లైన వారికి రుణం ఇస్తామంటూ చెప్పి ఇప్పుడు సగమే ఇస్తాననడం సరి కాదు. అధికారుల తీరువల్ల నిజమైన లబ్ధిదారులకు రుణం అందడం లేదు.
– శ్రీనివాసరావు, మాదేపల్లి
సగం రుణంతో వ్యాపార అభివృద్ధి ఎలా..?
చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా రూ.పది వేలు వస్తా యని సంబరపడ్డాం. పథకానికి అర్హత సాధించా. బ్యాంకు అధికారులు రూ.పదివేలు ఇస్తే ఏం చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యాపారం చేసి సక్ర మంగా వాయిదాలు చెల్లిస్తానన్న.. రుణం సగమే ఇస్తామంటూ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సగం ఇస్తానంటే ఉన్న వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలం.
– సువార్తమ్మ, చాటపర్రు