మా మొర వినండయ్యా..!

ABN , First Publish Date - 2020-12-15T05:41:21+05:30 IST

అధికారులు చేసే తప్పిదాలు వారి జీవనానికి శాపంగా మారాయి. ప్రభుత్వ పథకాల లబ్ధి వారికి అందడం లేదు. సమస్య పరిష్కరించమని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు.

మా మొర వినండయ్యా..!
ధర్నా చేస్తున్న చేపల అమ్మకందార్లు

కలెక్టరేట్‌ వద్ద బాధితుల ఆవేదన


ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 14 : అధికారులు చేసే తప్పిదాలు వారి జీవనానికి శాపంగా మారాయి. ప్రభుత్వ పథకాల లబ్ధి వారికి అందడం లేదు. సమస్య పరిష్కరించమని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. పింఛన్‌ తీసివేశారని ఒకరు.. రేషన్‌కార్డు పోయిందని ఒకరు.. చెయ్యి కోల్పోయిన దివ్యాంగుడు ఒకరు.. వీరంతా ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. కాళ్లరిగేలా తిరిగి చివరకు జిల్లా కలెక్టర్‌ను వేడుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్‌ అందు బాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తమ ఆవేదనను ‘ఆంధ్ర జ్యోతి’కి తెలిపారు.


పింఛన్‌ కోసం ప్రదక్షిణలు..

 ఈ చిత్రంలో కన్పిస్తున్న మహిళ పేరు ముప్పిడి రామలక్ష్మి. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంకు చెందిన ఈమె భర్తను కోల్పోయింది. ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తె అంధురాలు. రామలక్ష్మి వితంతు పింఛన్‌ పొందుతోంది. కొద్ది నెలల క్రితం అంధురాలైన కుమార్తెకు వివాహం అయింది. ఆపై కొంతకాలానికే వితంతు పింఛన్‌ నిలిచిపోయింది. రేషన్‌ కార్డులో వివాహం అయిన కుమార్తె పేరు తొలగించకపోవడం కారణంతోనే పింఛన్‌ పోయినట్టు అధికారులు తెలపడంతో  అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది. 


 రేషన్‌కార్డు తొలగించారు... 

రేషన్‌కార్డు ఎప్పుడు వస్తుందా. అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. వచ్చిన రేషన్‌కార్డు తొలగించడంతో ఆ కుటుంబం మొత్తం ప్రభుత్వ పథకాలకు దూరమైంది. ఏలూరు 12 పంపుల సెంటర్‌, శేఖర్‌వీధికి చెందిన రెడ్డి కృష్ణవేణి భర్త ఆనంద్‌కుమార్‌ కూలిపనులు చేసు కుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నారు. ఏడాది క్రితం సర్వేలో తమ రేషన్‌కార్డుకు పాతముప్పర్రుకు చెందిన కృష్ణవేణి పేరుతో 14 ఎకరాలు పొలం ఉన్నట్టు ఆధార్‌కార్డుకు లింకు కావడంతో కృష్ణవేణి రేషన్‌కార్డును తొలగించారు. అయితే తమకు ఎక్కడా పొలం లేదంటూ రేషన్‌కార్డు పునరుద్ధరించాలని ఏడాదిగా తహసీల్దార్‌, సచివాలయాల చుట్టు తిరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఫలితంగా ప్రభుత్వ పథకాల అర్హత పొందలేకపోయామని అమ్మఒడి అందుకోలేకపోయామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ రేషన్‌కార్డును పునరుద్ధరించాలని వేడుకున్నారు.


రెండు చేతులు ఉంటేనే ఆధార్‌..

ఈ ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి పేరు బాలకృష్ణ పవర్‌. గణపవరం మండలానికి చెందిన ఇతను  రోడ్లపై చిన్న చిన్న ఫ్యాన్సీ వస్తువులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాదంలో చెయ్యిపోయింది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుందామంటే ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు తప్పనిసరి.  మీ సేవ కార్యాలయాలకు వెళ్లితే రెండు చేతులు ఉంటేనే ఆధార్‌ కార్డు వస్తుందని చెప్పడంతో స్థానిక అధికారుల దగ్గరకు వెళ్లాడు. వారు కూడా అదే సమాధానం చెప్పారు. తనకు ఆధార్‌కార్డు ఇప్పించాలంటూ కలెక్టర్‌ను కలిసి వేడుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు.  



 ఇళ్ల పట్టాలు ఇప్పించండి..

రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నా అధికా రులు స్థానికులం కాదంటూ ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని తమకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరుతూ గణపవరం ఉయ్యాల వంతెన వద్ద నివాసం ఉంటు న్న 13 యానాది కుటుంబాల సభ్యులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంగల కర్రలు, పిట్టలు తోలడం, చెరువులు కాపలా కాస్తూ రోడ్ల పక్కనే జీవనం సాగించే తాము ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు కలిగి ఉన్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఇంటి స్థలం అడిగితే ఏ ప్రజా ప్రతినిధి, అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


లైవ్‌ ఫిష్‌ అమ్మకాలు నిరోధించండి.. 

  ఏలూరు చేపల మార్కెట్‌ వద్ద, చుట్టు పక్కల ప్రాంతాల్లో లైవ్‌ ఫిష్‌ వ్యాపారం వల్ల తమ వ్యాపారం కుంటుపడిందని వ్యాపారాలు లేక నష్టపోతున్నామని లైవ్‌ఫిష్‌ అమ్మకాలను నిరోధించాలని కోరుతూ ఏలూరు చేపల మార్కెట్‌ వ్యాపారులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దాసాంజనేయ మహిళా మత్స్య సహకార సంఘం, హ నుమాన్‌ హోల్‌సేల్‌, రిటైల్‌ వర్తక సంఘం, కత్తిపీటల వారి సంఘం ఆధ్వ ర్యంలో ధర్నా జరిగింది. పలువురు మహిళలు మాట్లాడుతూ మార్కెట్‌ సమీ పంలో, కొత్తూరు వంతెన వద్ద, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో లైవ్‌ ఫిష్‌ వ్యాపారం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. మార్కెట్‌కు ఎక్కువగా ప్రజలు రావడం లేదన్నారు.  అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-12-15T05:41:21+05:30 IST