కొవిడ్ రెండవ దశ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ABN , First Publish Date - 2020-12-30T05:00:30+05:30 IST
కొవిడ్ రెండవ దశ బారిన పడకుండా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నారాయణ నాయక్ సూచించారు.
ఏలూరు క్రైం, డిసెంబరు 29: కొవిడ్ రెండవ దశ బారిన పడకుండా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నారాయణ నాయక్ సూచించారు. జిల్లాలో ఈ ఏడాది లక్షా 719 మంది కొవిడ్ కేసులు నమోదు కాగా 95,759 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారన్నారు. 638 మంది మరణించారన్నారు. జిల్లాలో 630 పోలీస్ అధికారులు, సిబ్బంది కొవిడ్ బారిన పడగా పది మంది మరణించారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లాలో ఏలూరు రేంజ్ డీఐజీ కెవీ మోహనరావు ఆధ్వర్యంలో తాము స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామన్నారు. అయితే కరోనా వైరస్ జిల్లాలో పూర్తిగా నిర్మూలన కాలేదని చాలా మంది ప్రజలు నిర్లక్ష్యంగా మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని వారు ప్రమాదపుటంచుల్లో ప్రయాణిస్తున్నట్లేనని వారు గుర్తుంచుకోవాలన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన 104 మందిని గుర్తించానమని వారికి ఆర్‌టీపీసీఆర్ నిర్వహించామన్నారు. వారికి సమీపంగా కలిసిన 354 మందిని గుర్తించామన్నారు. రాజమండ్రికి చెందిన ఒక మహిళ విదేశాల నుంచి వచ్చిందని ఆమెకు కరోనా వేరియంట్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆమె ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినప్పుడు మన జిల్లా వాసులు కూడా ఆమెతో ప్రయాణించారని వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఏలూరు వన్‌టౌన్‌కు చెందిన ఒక వ్యక్తిని ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉంచామని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించడం జరిగిందన్నారు. రిపోర్టు రావాల్సి ఉందన్నారు.
బ్రిటన్ నుంచి కొత్త కరోనా...
ఏలూరు క్రైం, డిసెంబరు 29 : కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ సూచించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బ్రిటన్ నుంచి కరోనా కొత్త స్ర్టెయిన్ ప్రవేశిస్తుందన్నారు. విదేశీయులు ఎవరు వచ్చినా, ఆ సమాచారం తెలిసిన వెంటనే తక్షణం హెల్త్ డిపార్టుమెంట్‌కు సమాచారం అందించాలన్నారు. తక్షణం ఆరోగ్యశాఖ స్పందించి విదేశీయులకు పరీక్షలు చేస్తుందన్నారు. ఈ కారణంగా వ్యాధి తీవ్రతను అడ్డుకోవచ్చునన్నారు. కరోనా ముప్పు పూర్తిగా పోలేదన్నారు. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నాయని, నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయని, శుభకార్యా లకు వెళ్ళేవారు, నిర్వహించేవారు కొవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించా లన్నారు.
జనవరి మొదటి వారం నుంచి కంటి ఆపరేషన్లు
జనవరి మొదటి వారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపతుల్లో కంటి వైద్యం అందుబాటులోకి వస్తుందని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ చెప్పారు. కంటి వెలుగు పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పారు. తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రులలోనూ, ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోనూ జనవరి మొదటి వారం నుంచి కంటి ఆపరేషన్లు జరుగుతాయన్నారు.