గీత దాటారా.. పెనాల్టీల మోతే..

ABN , First Publish Date - 2020-12-19T05:50:48+05:30 IST

మోటారు వాహన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది.

గీత దాటారా.. పెనాల్టీల మోతే..

జనవరి 1 నుంచి పకడ్బందీగా కొత్త రవాణా చట్టం 

హెల్మెట్‌ లేకుంటే రూ.1,035

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు రూ.5,035

వందల నుంచి వేలకు మారిన జరిమానాలుకు పెనాల్టీల వాత పెట్టేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇప్పటి వరకూ వందల్లో ఉన్న జరిమానాలు వేలకు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మోటారు వాహన సవరణ చట్టం సెప్టెంబరు 28 నుంచి అమల్లోకి వచ్చినా జనవరి ఒకటి నుంచి కొరడా ఝుళిపిస్తామని హెచ్చరిస్తున్నారు

ఏలూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): . మోటారు వాహన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. నింబంధనల అతిక్రమణ, ఉల్లంఘనలకు ఇప్పటి వరకూ విధిస్తున్న జరిమానాలు, అపరాధ రుసుంలను భారీగా పెంచింది. రెండోసారి అదే తప్పు జరిగితే రెండు నుంచి ఐదు రెట్ల వరకూ జరిమానా విధిస్తారు. కొత్త ఏడాది నుంచి కొత్త చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి రవాణా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మోటారు వాహన డీలర్లతో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

జరిమానాలు ఇలా..

హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే గతంలో రూ.135 వసూలు చేసేవారు. కొత్త చట్టం ప్రకారం రూ.1,035 వసూలు చేస్తారు. రెండోసారి కూడా ఇదే కేసులో దొరికితే దీనికి రెట్టింపు అంటే, రూ.2,070 జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకూ సెల్‌ఫోన్‌ డ్రైవింగుకు రూ.535 వసూలు చేసేవారు. ఇక నుంచి రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ.5,035 వసూలు చేసే అవకాశం ఉంది. రెండోసారి ఇదే కేసులో దొరికితే రూ.10,035 కట్టాలి. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే గతంలో రూ.1,035 జరిమానా వసూలు చేస్తుండగా, ఇకపై అది రూ.5 వేలకు పెరిగింది. రెండోసారి దొరికితే రూ.10,035 చెల్లించుకోవాల్సిందే! నిర్ణీత వేగాన్ని మించి వాహనాన్ని నడిపితే గతంలో రూ.135 వసూలు చేయగా, తాజాగా రూ.1,035 వసూలు చేయనున్నారు. రెడ్‌సిగ్నల్‌ వద్ద నిబంధనలను అతిక్రమిస్తే గతంలో రూ.135 ఉంటే రూ.1,035కు పెంచారు. మైనర్లకు వాహనం ఇచ్చినా వేలకు వేలు వదిలించుకోవాల్సిందే. జరిమానా కింద వసూలు చేస్తున్న రూ.535 కాస్తా ఇప్పుడు రూ.5,035కు పెరిగింది. వాహనానికి రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకుండా తిప్పితే ఇక నుంచి తొలిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు కట్టాల్సిందే. ఆ తరువాత డ్రైవింగ్‌ లైసెన్సు రద్దుకు సిఫారసు చేస్తారు. అత్యవసర సేవలు అందించే అంబు లెన్సు, ఫైర్‌ ఇంజన్‌ వంటి వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు వసూలు చేస్తారు. కొత్త వాహనచట్టం అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రమాదాల నియంత్రణ పేరుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్న అభిప్రాయం వారిలో బలంగా ఉంది. 

ఇక నుంచి ద్విచక్రవాహనం నడిపేవారితో పాటు, వెనక కూర్చునేవారు కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలి.

కార్‌ నడిపేవారు, వెనక సీట్లలో కూర్చున్నవారు అందరూ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలి

వాహనాల్లో స్పేర్‌పార్టులు నిబంధనలకు విరుద్ధంగా మారిస్తే రూ. 5 వేల వరకూ జరిమానా

నిరంతరాయంగా హారన్‌ కొడితే రూ.వెయ్యి జరిమానా

 జరిమానాల మోత ఇలా.. 

ఉల్లంఘన         గతంలో ఇప్పుడు

నో హెల్మెట్‌         రూ.135 రూ.1,035

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ రూ.535 రూ.5,035

లైసెన్సు లేకపోతే రూ.1,035 రూ.5,035

వేగంగా నడిపితే రూ.135 రూ.1,035

సిగ్నల్‌ అతిక్రమిస్తే రూ.135 రూ.1,035

మైనర్లకు ఇస్తే         రూ.535 రూ.5,035

రేసింగ్‌         రూ.1,035 రూ.5,035


కరోనా కష్టాల్లో కొరడా : గిరిధర్‌, వాహనదారుడు


కరోనా కష్టాలతో అల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వం జరిమానాల కొరడాతో బాదుతోంది. జరిమానాలు తలుచుకుంటేనే వెన్నులో చలి పుడుతోంది. బాధ్యతగా ట్రాఫిక్‌ నియమాలు అమలు చేయించాలి. అవగాహన కల్పించాలి. బలవంతపు వసూళ్లు మానుకోవాలి.


వాహనాలు వదిలి పారిపోవడమే : కోకా వెంకటేశ్వరరావు, ద్విచక్ర వాహనదారుడు

వాహనం నడుపుతూ పోలీసులకు కనిపిస్తే ఆ వాహనాన్ని వదిలేసి పారిపోవడమే దిక్కు. ఎందుకంటే వాహనాల ఖరీదు కంటే జరిమానాల ఖర్చే ఎక్కువయ్యేలా ఉంది. మాలాంటి వాళ్లు బతుకుదెరువు కోసం వాహనాలు తీసుకున్నాం. రెండు మూడు సార్లు అధికారులకు దొరికామంటే ఇక మా పని అంతే ! 


కొత్తచట్టం తెలుసుకొని మసులుకోండి సిరి ఆనంద్‌, డీటీసీ 

ప్రతి ఒక్కరు మోటారు వాహన సవరణ చట్టం– 2019ని తెలుసుకుని మసులుకోవాలి. ఇక నుంచి చట్టాన్ని పకడ్బంధీగా అమలుచేస్తాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, ప్రమా దాలను నివారించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సహకరించాలి. 


Read more