టైగర్‌.. టెర్రర్‌

ABN , First Publish Date - 2020-12-31T04:24:52+05:30 IST

టైగర్‌.. టెర్రర్‌.. గత నాలుగు రోజులుగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతుంది.

టైగర్‌.. టెర్రర్‌
చిరుత పులి దాడిలో మృతిచెందిన ఆవు

చిరుత పులి.. పెద్ద పులి తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు

ఆందోళనలో గిరిజనం 

పట్టుకునేందుకు ప్రయత్నం

వేలేరుపాడు/ కుక్కునూరు, డిసెంబరు 30 : టైగర్‌.. టెర్రర్‌.. గత నాలుగు రోజులుగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతుంది. వరుసగా ప్రతీ రోజు ఏదో ఒక ప్రాంతంలో పెద్దపులి దాడిలో పశువులు మృతిచెందండం కలకలం రేపుతోంది. మొదట వేలేరుపాడు మండలం గుండ్లమడుగు గ్రామం సమీపంలో ఎద్దుపై దాడి చేయగా ఆ మరుసటి రోజు నుంచి వరుసగా అశ్వారావుపేట, కుక్కునూరు మండలాల సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పెద్దపులి ప్రతీ రోజు పంజా విసురుతూనే ఉంది. బుధవారం తెల్లవారు జూమున  కుక్కునూరు అటవీ రేంజ్‌ పరిధిలోని లచ్చిగూడెం గ్రామ సమీపంలో జనా వాసాలకు దగ్గరలోనే పెద్దపులి దాడి చేసి మరొక పశువును బలికొంది. వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం, సబ్‌ డీఎఫ్‌వో శ్రీనివాసరావుతో కూడిన అటవీ శాఖ బృందం సంఘటన స్ధలంలో జంతు పాదముద్రులు సేకరించారు. పాద ముద్ర 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండడంతో ప్రాథమికంగా చిరుత పులి అని గుర్తించారు.  నందిపాడులో జరిగిన సంఘటనలో దాడి చేసిన జంతువు పాదముద్ర 15 సెంటీమీటర్లు ఉండగా, ఇసుకపాడులో ఆవుపై దాడి చేసిన జంతువు పాదముద్ర 18 సెంటీమీటర్లుగా గుర్తించారు. ఈ రెండు సంఘటనల్లో పశువులపై దాడి చేసింది పెద్దపులిగా అనుమానిస్తున్నారు. అలాగే పశువును కనీసం కిలోమీటరు పైగా దూరం లాక్కెళితే ఆ దాడి చేసిన జంతువు పెద్దపులిగాను, 200 మీటర్ల లోపు లాక్కెళితే చిరుత పులిగా గుర్తించవచ్చని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. గత మూడు రోజులుగా వరుసగా కుక్కునూరు అటవీ రేంజ్‌ పరిధిలో పశువులపై దాడి జరుగుతుండడంతో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.  సబ్‌ డీఎఫ్‌వో శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేయడంతో పాటు కెమెరాలో టేప్‌ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు. పులి సంచారం జరుగుతున్నట్టు గమనిస్తే శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి సిబ్బందిని రప్పించి పులిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే చిరుత పులి అయితే విశాఖ నుంచి నిపుణులను రప్పించి బంధించే ప్రయత్నం చేస్తామన్నారు. పశువులను వేటాడిన తరువాత పెద్దపులి మరలా వచ్చి మిగిలిన శరీర భాగాలను తినే అలవాటు ఉందని దీనిని ఆధారంగా బోనులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

Updated Date - 2020-12-31T04:24:52+05:30 IST