జనతా కర్ఫ్యూ సక్సెస్‌

ABN , First Publish Date - 2020-03-23T11:20:17+05:30 IST

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

  • స్వీయ నియంత్రణకే ప్రజలు ప్రాధాన్యత 
  • ఎక్కడికక్కడ నిలిచిన రైళ్లు, ఇతర వాహనాలు.. నిర్మానుష్యంగా రహదారులు
  • వెలవెలబోయిన రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లు
  • అంతర్‌ రాష్ట్ర సరిహద్దు మూసివేత
  • ఆలయాల్లో దర్శనాలు నిలిపివేత.. రక్షించాలంటూ ప్రత్యేక హోమాలు, పూజలు
  • అత్యవసరసిబ్బందికి సంఘీభావంగా కరతాళ ధ్వనులు 
  • కలెక్టర్‌ సహా మిగతా అధికారులదీ ఇదే బాట 

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లావ్యాప్తంగా ఆదివారం.. ఎక్కడా చీమ చిటుక్కుమన లేదు. మార్కెట్లు తెరుచుకోలేదు. వీధుల్లోకి జనం రాలేదు. వాహనాలు తిరగలేదు. హారన్ల మోతా వినిపించ లేదు. రైళ్లు కదల్లేదు. అత్యవసర సర్వీసులు నిలిచిపోయాయి. తెల్లవారు జామునే పాల బూత్‌ల వద్దే కనిపించిన కాస్తంత హడావుడి.. కొద్దిసేపటికే మాయమైంది. రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. కరోనా వైరస్‌ నిర్మూలనకు ఒకరికొకరు తోడయ్యారు. ఇంటికే పరిమి తం కావాలనే ప్రధాని నరేంద్రమోదీ పిలుపు సాధారణ పౌరుల దగ్గర నుంచి అత్యున్నత అధికారి వరకు పాటిం చారు. స్వీయ నియంత్రణకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌లు వెలవెలబోయాయి. రైల్వేస్టేషన్లు మూతపడ్డాయి. పట్టణం, పల్లె తేడా లేకుండా అంతటా నిర్మానుష్యం అలుముకుంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో పూర్తిగా నిశ్శబ్దం రాజ్యమేలింది.


అడపాదడపా వాహనాలు చప్పుళ్లు మినహా అంతటా కర్ఫ్యూ వాతావరణమే కనిపించింది. ఎవరంతటి వారు స్వచ్చంధంగా కరోనాపై అవగాహనకు వచ్చేలా పొరుగు వారికి సరికొత్త సూత్రాలు, జాగ్రత్తలు చెప్పారు. ముందుచూపుకు వీలుగా మార్గదర్శకం చేశారు. జనతా కర్ఫ్యూకు వీలుగా స్వచ్ఛంధంగానే ముందుకు వచ్చారు. అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్‌ హౌస్‌ల్లోనూ నిశ్శబ్ధతే. ఒకరికొకరుగా కూర్చుని మాట్లాడడానికి ఇష్టపడనంతగా కరోనాపై చైతన్యం ప్రదర్శించారు. చాలాచోట్ల శానిటైజర్లు వినియోగించారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పడ్డారు. పెద్దవారిని గడపదాటనీయలేదు. ఒక రోజు ముందే ఇంటిలో అన్నీ సమకూర్చుకుని కర్ఫ్యూ నాడు క్రమ పద్ధతి పాటించారు. పట్టణాలతో సమాంతరంగా పల్లెల్లోనూ కర్ఫ్యూ ప్రభావం కనిపించింది. స్వచ్ఛందంగా ఎవరంతటి వారుగానే ఆఖరికి పశువులను సైతం బయటకు పంపకుండా ఇంటిలోనే సేదతీరారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ ఇంటిలోనే.


చాన్నాళ్ళ తర్వాత ఇంట్లో అందరం గడిపే అవకాశం వచ్చిందని, కాని భయంకరమైన కరోనాను కడతెర్చేందుకు ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నట్టుగా ప్రజలు ప్రతినబూనారు. టీవీలకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ తీరును ఆసాంతం పరిశీలించారే తప్ప గడపదాటి బయటకు రాలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించి పోలీసు వర్గాలు ఎక్కడికక్కడ సైలెంట్‌ అయ్యాయి. ఇంకొన్నిచోట్ల బజారులోకి వచ్చిన వారిని బుజ్జగించి వెనక్కి పంపించి వేశారు. బస్టాండ్‌ల ఎదుట, ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారు ఆ తర్వాత ఇంటిముఖం పట్టారు. సందట్లో సడేమియా అన్నట్టు టిఫిన్లు, పాలప్యాకెట్లు ధరలు పెంచి ఒకటి, రెండుచోట్ల విక్రయాలు సాగించారు. జాతీయ రహదారి పూర్తిగా వెలవెలబోయింది. నిత్యం రద్దీగా ఉండే టోల్‌గేట్లు కళతప్పాయి.


రాష్ట్ర రహదారుల్లోనూ ట్రాఫిక్‌ జాడే లేకుండా పోయింది. తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. జీలుగుమిల్లి మండలం సరిహద్దున తెలంగాణ పట్టణం అశ్వరరావుపేట ఉండడంతో, ఇరు రాష్ర్టాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ అధికారులు ముందస్తుగా శనివారం నాటికే తమ రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించలేదు. ఆంధ్రా అధికారులు ఆదివారం ఉదయం నుంచే రాకపోకలను పూర్తిగా నిలువరించారు. కొన్నిచోట్ల విందులు, వినోదాలు చేసుకుంటున్నట్టు, వేలాది మంది హాజరవుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇది నిజం కాదని పోలీసులు రంగంలోకి దిగి మరీ నిర్ధేశించారు. ప్రజలంతా ఐక్యంగా కరోనాపై తిరుగుబాటు చేస్తుండగా గోపాలపురంలో మాత్రం కొందరు కోడిపందేలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 


కరోనాపై పట్టణాల్లో ఫైట్‌

నిత్యం రద్దీగా ఉండే పట్టణాలన్నీ ఆదివారం బోసిపోయాయి. కర్ఫ్యూ కారణంగా వేలాది మంది ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వీధులన్నీ సైలెంట్‌ అయ్యాయి. ఏలూరు, భీమవరం, నిడదవోలు, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పాలకొల్లు వంటి పట్టణాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలంతా కర్ఫ్యూకు పూర్తి మద్దతుగా నిలిచారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సంపూర్ణ సహకారం అందించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా కరోనాపై ఫైట్‌ చేశారు. చిన్న పిల్లలు సైతం వీధుల్లోకి రాకుండా జాగ్రత్తలు పడ్డారు. తాజా పరిస్థితిని ఎవరంతటి వారు సమీక్షించుకుంటూ ఇంటి పట్టునే ఉండిపోయారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లకే పరిమితం అయ్యారు. జిల్లాస్థాయి అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను ఇతరులకు పంపుతూ ఆదివారం నాడు ఇంటి నుంచే బాధ్యతలు పూర్తి చేశారు.


వైద్య ఆరోగ్యశాఖాధికారులు కరోనా అనుమానితులపై ఆరా తీస్తూ గడిపారు. కరోనా కర్ఫ్యూలో భాగంగా మందుల షాపులను స్వచ్ఛంధంగా మూసివేశారు. జనం గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రులకు చికిత్స నిమిత్తం రోగులు రాలేదు. అయినప్పటికీ అత్యవసర పరిస్ధితుల్లో అందుబాటులో వైద్యులు, సిబ్బంది ఉన్నారు. అంబులెన్సులను సిద్ధం చేసే ఉంచారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా విదేశీయుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్లు వీరి కదలికలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఒక్క ఆదివారం కర్ఫ్యూలో మినహా మిగతా వేళల్లో ఈ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతూనే ఉంది. 


కరతాళ ధ్వనులతో సేవకులకు ప్రోత్సాహం

కరోనా వైరస్‌ నిరోధానికి నిత్యం వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులతోపాటు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపేలా ఆదివారం సాయంత్రం పెద్దఎత్తున ప్రజలు స్పందించారు. ఒకవైపు కర్ఫ్యూలో కొనసాగుతూనే మరోవైపు ఇళ్ల గేటు వరకు వచ్చి కరతాళ ధ్వనులతో ముంచెత్తారు. మహిళలు, పిల్లలు సేవకులందరికీ కృతజ్ఞతా పూర్వకంగా స్టీలు పల్లాలను చరిచి ఉత్సాహం కనబరిచారు. జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తన కుటుంబ సభ్యులతోసహా క్యాంపు ఆఫీసులోనే చప్పట్లు చరిచి కృతజ్ఞతలు తెలిపారు. జేసీ వెంకటరమణారెడ్డి, జేసీ-2 తేజ్‌భరత్‌ వంటి అధికారులు కలెక్టరేట్‌లో చప్పట్లు చరిచారు. జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు ఇదే విధంగా స్పందించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మిగతా జిల్లా ప్రతినిధులు చప్పట్లు చరుస్తూ కరోనా సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-03-23T11:20:17+05:30 IST