కరోనాపై మహాయుద్ధం

ABN , First Publish Date - 2020-03-23T11:17:44+05:30 IST

కరోనాపై మహాయుద్ధం

కరోనాపై మహాయుద్ధం

  • 31వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ 
  • రైళ్లు, బస్సులు, ఆటోల రాకపోకలు నిలిపివేత 
  • నిత్యావసరాలు తప్ప మిగతా షాపులన్నీ బంద్‌ 
  • వస్తువులను బ్లాక్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు 
  • పేదల ఇంటికే రేషన్‌.. వెయ్యి ఆర్థిక సాయం 
  • ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారతావని మహాయుద్ధం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించింది. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన రవాణా, వ్యాపార సంస్థలు స్తంభించనున్నాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జిల్లావాసులు జనతా కర్ఫ్యూ పాటించారు.


ఊరూ వాడా ఒకటయ్యాయి. జాతి ఆరోగ్యం కోసం అంతా ఇంటికే పరిమితమయ్యారు. రద్దీగా ఉండే జాతీయ రహదారులు బోసిపోయాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, కీలక కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆసుపత్రుల దగ్గర నుంచి పాన్‌ దుకాణాల వరకు అన్నీ మూతపడ్డాయి. ఎక్కడా పోలీసు కట్టడి లేదు. బలవంతంగా కర్ఫ్యూలోకి దించింది లేదు. లక్షలాది మంది స్వచ్ఛందంగా, కరోనాకు విరుగుడుగా స్వీయ నియంత్రణకు దిగారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సంఘీభావంగా సాయంత్రం ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేశారు.

 

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్‌ను నిర్మూలించేదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించింది. ఈ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిపి వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యావసర వస్తువులు, మందుల షాపుల మినహా మిగతా వాటిని మూసే ఉంచుతారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తదుపరి చర్యలకు దిగుతామని సీఎం జగన్మో హన్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు.


ఇప్పటికే ఇతర రాష్ర్టాలు లాక్‌ డౌన్‌ పాటించినందున అదే బాటలో ఏపీ కూడా ముందడుగు వేసింది. ఈ కారణంగా ప్రత్యేకించి జనం గుమిగూడకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఒక క్రమ పద్ధతిలోనే వ్యవహరిస్తూనే కరోనా కట్టడికి కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ ప్రకటించి నందున ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యవ హరించాల్సి ఉంటుంది. కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజాబాహుళ్యం ఎక్కువుగా ఉండే ప్రాంతాలను కట్టడి చేస్తారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి ఇద్దరు, ముగ్గురుకంటే మించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణకు జాగ్రత్త పడబోతున్నారు. ఇప్పటికే జనతా కర్ఫ్యూ దృష్ట్యా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు ధరలను ఆ మేరకే పెంచి క్రయ, విక్రయాలకు దిగారు. ఇక ముందు లాక్‌ డౌన్‌ అమలులో ఉంటున్నందున ధరలు పెంచితే అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


సరుకులను సాధ్యమైనంతమేర అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. రోగుల అవసరార్ధం మందుషాపులను తెరిచే ఉంచుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలాఖరు కాబట్టి క్రయ, విక్రయాలు పెద్దగా పుంజుకోలేదు. మరో పది రోజుల్లో ఈ తాకిడి భారీగా పెరగనుంది. ఈ నెలాఖరుకు మాత్రమే లాక్‌ డౌన్‌ను పరిమితం చేశారు. ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పేదవాళ్లందరికీ రేషన్‌తోపాటు కిలో పప్పు, అదనంగా వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించడంతో దాదాపు 12 లక్షల కుటుంబాలకు జిల్లాలో ఈ రకమైన సాయం అందుతుంది.


ప్రజా రవాణా బంద్‌ : 

ప్రజా రవాణాను ఈ నెలాఖరు వరకు పూర్తిగా నిలిపివేస్తారు. బస్సులతోపాటు ఇతర వాహనాల ద్వారా ప్రయాణికుల చేరవేతను నిషేధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా రవాణాను అనుమతించే ప్రశ్నే లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ వీరయ్యచౌదరి ఆదివారం రాత్రి ప్రకటించారు. బస్సులతోపాటు మిగతా వాహనాల రాకపోకలపైనే ఒక కన్నేసి ఉంచుతారు.

Updated Date - 2020-03-23T11:17:44+05:30 IST