తీరంలో ఆక్వా జోన్‌

ABN , First Publish Date - 2020-03-21T09:10:53+05:30 IST

జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కొన్ని గ్రామాలే ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లోనూ చెరువులు తవ్వుకునే వెసులుబాటును...

తీరంలో ఆక్వా జోన్‌

నరసాపురం, మార్చి 20 : జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కొన్ని గ్రామాలే ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లోనూ చెరువులు తవ్వుకునే వెసులుబాటును కల్పించారు. మత్స్యశాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సోమవారం నుంచి గ్రామాల్లో పర్యటిస్తారు. కొత్తగా చెరువులు తవ్వుకునేందుకు, గతంలో తవ్విన చెరువులను రెగ్యులర్‌ చేసేందుకు వీరు ఈ నెల 30 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ రెండు మండలాల్లో 45 వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో 25 వేల ఎకరాల్లో వరి, పది వేల ఎకరాల్లో ఆక్వా, రొయ్యల చెరువులు ఉన్నాయి. మిగిలిన పది వేల ఎకరాల్లో సరుగుడు, ఉప్పు, ఉద్యాన తోటలున్నాయి. ఆక్వా సాగు రాక ముందు అంతా వరి పండేది. చౌడు భూముల్లో ఉప్పు మడులు ఉండేవి. చాలా గ్రామాల్లో రైతులు సాగు నీటి ఇబ్బందులను అధిగమించలేక చేలను చెరువులుగా మార్చేశారు.


నరసాపురం మండలంలోని వేములదీవి, చినలంక, బియ్యపుతిప్ప, దర్బరేవు, తూర్పుతాళ్లు, రాజుల్లంక, మొగల్తూరు మండలంలోని కేపీపాలెం, పేరుపాలెం, మోళ్లపర్రు, కాళీపట్నం, పాతపాడు తదితర ప్రాంతాల్లో 80 శాతం భూములు ఆక్వాగా మారాయి. కొందరు రైతులు చెరువులుగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే పరిసర ప్రాంత రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లోని భూములు ఆక్వా చెరువులుగా మారలేదు. తీరంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. పోటు, పాటులకు ఉప్పుటేరులు పొంగుతుంటాయి. దీనివల్ల డ్రెయిన్లలోకి నీరు చేరుతుంది. ఈ నీరు చెరువులకు అనుకూలం. ఈ కారణంగా తీర ప్రాంతాల్లో ఆక్వా సాగు ఎక్కువగా ఉంది. 


ఆక్వా జోన్‌తో నష్టాలు

చిట్టవరం, గొంది, కొత్త, పాత నవరసపురం, సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, కొప్పర్రు, సీతారాంపురం, వైఎస్‌పాలెం, రుస్తుంబాద, ఎల్‌బీ చర్ల గ్రామాల్లో పంట చేలు ఎక్కువ. ఈ గ్రామాల మీదుగా డ్రెయిన్లు ప్రవహిస్తున్నప్పటికీ చాలామంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పచ్చని పొలాలతో కళకళలాడుతున్న ఈ భూములు ఆక్వా జోన్‌తో కాలుష్య కాసారంగా మారతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న సారవంతమైన భూములన్ని చౌడుగా మారిపోతాయి. పంట కాల్వలు కలుషితమవుతాయి. మంచినీటి చెరువులు కలుషితం అవుతాయి.  భూగర్భ జలాలు మరింత ఉప్పుబారి తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.


ఆక్వా జోన్‌తో ప్రయోజనాలు

సీఆర్‌జెడ్‌ భూములతోపాటు డి నమోన, కంపెనీ, జిరాయితీ భూములు ఉన్నాయి. సీఆర్‌జెడ్‌, డి పామ్‌ రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు అందడం లేదు. ఈ భూములను చెరువులుగా మార్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం జోన్‌గా మార్చడం వల్ల వీరు చెరువులు తవ్వేకునేందుకు వీలు ఉంటుంది. ఎంపెడా నుంచి రైతులకందే అన్ని సదుపాయాలు రైతులకు లభిస్తాయి. కోల్ట్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌లు పెరుగుతాయి. ప్రస్తుతం ఏడాదికి ఎకరా చెరువుల లీజు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంది. వ్యవసాయం గిట్టుబాటు లేని ప్రాంతాల్లో రైతులు చెరువులకు లీజుకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-03-21T09:10:53+05:30 IST