తగ్గిన పత్తి దిగుబడి

ABN , First Publish Date - 2020-12-11T05:07:07+05:30 IST

పత్తి సాగు ఈ ఏడాది రైతులకు కష్టాలు మిగిల్చేలా ఉంది. ఆశించిన మద్దతు ధర ఉన్నప్పటికీ దిగుబడి లేక రైతులకు నష్టం చేకూరే విధంగా పరిస్థితి ఏర్పడింది.

తగ్గిన పత్తి దిగుబడి
దిగుబడి లేని పత్తి చేను

వరదలు, తుఫాన్‌తో నష్టపోయిన రైతులు

కుక్కునూరు, డిసెంబరు 10: పత్తి సాగు ఈ ఏడాది రైతులకు కష్టాలు మిగిల్చేలా ఉంది. ఆశించిన మద్దతు ధర ఉన్నప్పటికీ దిగుబడి లేక రైతులకు నష్టం చేకూరే విధంగా పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది గోదావరి తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తిసాగును ఆరంభించారు. అయితే గోదావరి వరద ముంచెత్తడంతో ఏపుగా ఎదిగిన పత్తి పంటంతా నీటమునిగి రైతులంతా నష్టపోయారు. కొంత మంది రైతులు వరదలు తగ్గిన అనంతరం మళ్లీ పత్తి విత్తనాలు వేశారు. మొక్క వస్తున్న క్రమంలో మళ్లీ గోదావరి వరదలు ముంచెత్తడంతో రెండవ సారి నష్టపోయారు. ఇదే సమయంలో గోదావరి ముంపుకు గురికాని మెట్ట ప్రాంతంలో దాదాపు ఏడువేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. కాని అధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో పూత పిందె రాలేదు. కొంత మేరకు వచ్చిన పూత, పిందె, కోతలకు వచ్చిన పత్తి కూడా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షానికి నేల పాలైంది. దీంతో ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కౌలు, దుక్కులు, ఎరువులు, పురుగుమందుల వినియోగానికి ఎకరానికి రైతులు రూ.40వేల నుంచిరూ.50వేలు ఖర్చు చేశారు.  ప్రస్తుతం ఆరు క్వింటాళ్ల దిగుబడి మాత్రం వస్తున్న క్రమంలో మద్దతు ధర రూ.5వేల వరకు పలుకుతుంది. దీంతో రైతులకు ఎకరానికి రూ.30వేలు మాత్రమే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  పోలవరం పరిహారం పొందిన భూములు కావడం వలన పంటలు నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందే అవకాశం లేదు.


Updated Date - 2020-12-11T05:07:07+05:30 IST