గిరాకీ లేని కోటా బియ్యం..!

ABN , First Publish Date - 2020-12-27T05:14:39+05:30 IST

కోటా బియ్యం అవసరానికి మించి ఉచితంగా పంపిణీ చేయడంతో పలువురు కార్డుదారులు బియ్యం అమ్మకం మొదలు పెట్టారు.

గిరాకీ లేని కోటా బియ్యం..!

బ్లాక్‌ మార్కెట్‌లో తగ్గిన ధర 

పెద్ద ఎత్తున రీసైక్లింగ్‌కి తరలింపు

పాలకొల్లు కేంద్రంగా ఎగుమతులు..? 

వినియోగదారుల నుంచి రూ. 10కి కొనుగోలు

చేతులు మారి కొత్త సంచిలో కోటా బియ్యం


కోటా బియ్యానికి డిమాండ్‌ తగ్గడంతో బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ధర తగ్గింది. గతంలో బ్లాక్‌ మార్కెట్లో కోటా బియ్యానికి డిమాండ్‌ ఉండేది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నెలకు రెండు దఫాలుగా ఉచిత బియ్యం అంద జేయడంతో బయట బియ్యం నిల్వలు పెరిగిపోయాయి. కొంతమంది కోటా బియ్యం తెచ్చుకుని బియ్యం దుకాణాల వద్ద మార్పిడి చేసి సన్నబియ్యం కొనుగోలు చేస్తుంటే, మరి కొందరు డిపోల వద్దే కిలో రూ.10 చొప్పున అమ్మేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు కోటా బియ్యం కొని ప్యాకింగ్‌ మార్చి మరలా అడ్డదారిలో మిల్లులకు తరలిస్తున్నారు. 

పాలకొల్లు, డిసెంబరు 26 :  కోటా బియ్యం అవసరానికి మించి ఉచితంగా పంపిణీ చేయడంతో పలువురు కార్డుదారులు బియ్యం అమ్మకం మొదలు పెట్టారు. మొన్నటి వరకూ కిలో బియ్యం రూ.14, 15 లకు అమ్మగా ఇప్పుడు రూ.10లకు పడిపోయింది. కోటా బియ్యాన్ని మహిళలు ఇడ్లీ రవ్వ, నూక, వరి పిండిగా మార్పిడి చేసుకుంటుండగా మరి కొంత మంది బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసు కుంటున్నారు. గ్రామాలలో పలువురు  రైతులు కోటా బియ్యాన్ని నూకగా మార్చి పశువులకు దాణాగా వినియోగిస్తుంటే, రొయ్యలు, చేపల చెరువులు సైతం కోటా బియ్యాన్ని వాడుతున్నారు. 


పీడీఎస్‌ బియ్యంగా ప్యాక్‌లు

 కొన్ని రేషన్‌ దుకాణాలలో కార్డుదారులు వదిలి వేసిన బియ్యాన్ని ఆటోలు, రిక్షాల ద్వారా బియ్యం షాపులకు తరలిస్తున్నారు. అక్కడ అక్రమార్జనకు అలవాటు పడిన పలువురు వర్తకులు కోటా బియ్యాన్ని 25 కిలోల సంచులలో ప్యాక్‌ చేసి రాత్రికి రాత్రి లారీల ద్వారా తరలిస్తున్నారు. ఈ బియ్యం కొన్ని రైస్‌ మిల్లులకు చేరుతుండగా అక్కడ (పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం) పీడీఎస్‌ బియ్యంగా ప్యాక్‌ చేసి మరలా ప్రభుత్వ ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్లకు పంపిస్తున్నారు. 

ఇటీవల పట్టణంలో బియ్యం వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేసి ఎలక్ర్టానిక్‌,  ప్రింట్‌  మీడియాకు చెందిన ఇద్దరు విలేకరులు సొమ్ములు వసూలు చేశారని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే రాత్రి సమయంలో కొందరు కోటా బియ్యాన్ని కొత్త సంచుల్లో ప్యాక్‌ చేసి గుట్టు చప్పుడు కాకుండా లారీలకు ఎగుమతి చేస్తుంటే విలేకర్లు ఆ ప్రాంతానికి వెళితే వ్యాపారులే సొమ్ములు ఇచ్చి నట్టు పట్టణంలో ప్రచారం జరిగింది. బియ్యం అక్రమ తరలింపు చక్క బెట్టుకున్న అనంతరం తమను బ్లాక్‌మెయిల్‌ చేశారంటూ పోలీసులను ఆశ్రయించడం పట్ల పట్టణంలో చర్చ జరుగుతోంది. లంచం తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడమూ అంతే నేరం అయిన పరిస్థితుల్లో అక్రమ బియ్యం ఎగుమతులను వదిలివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  పాలకొల్లు బీవీఆర్‌ఎం బాలికల హైస్కూల్‌ సమీపం, కెనాల్‌రోడ్డులోనూ ఒక బియ్యం షాపులోనూ ఇంకా పలు ప్రాంతాలలోనూ రోజుకు లారీ బియ్యం సేకరించి గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతులు చేస్తున్నట్టు సమాచారం.  సంబంధిత శాఖలోని కొందరి చేతివాటం వల్ల ఎగుమతులు సాఫీగా సాగుపోతున్నాయని సమాచారం. ఒక లారీ అక్రమ బియ్యం ద్వారా సూమారు రూ. 2 లక్షలు అక్రమ ఆర్జన పొందుతున్నారని పట్టణంలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2020-12-27T05:14:39+05:30 IST