-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari no fastag no highway
-
నో ఫాస్టాగ్..నో హైవే..!
ABN , First Publish Date - 2020-12-15T05:40:06+05:30 IST
ఫాస్టాగ్ నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది.

100 శాతం చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే
జనవరి 1 నుంచి అమలు
ప్రభుత్వ వాహనాలకూ తప్పని నిబంధనలు
అత్యవసర వాహనాలకు మినహాయింపు
ఏలూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫాస్టాగ్ నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. నూరు శాతం టోల్‌ప్లాజా చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరపాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. 2021 జనవరి 1 నుంచి అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నది. దీంతో ఆరోజు నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు హైవేలపై నోఎంట్రీ బోర్డు పడునుంది. ఫాస్టాగ్ లేకుండా ప్రభుత్వ వాహనాలను కూడా అనుమతించడానికి వీలులేదు. అత్యవసర సేవలందించే అంబు లెన్సులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తారు. ఏడాది క్రితం నుంచే దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చినా దానిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. జిల్లాలోని కలపర్రు, ఉంగుటూరు టోల్ ప్లాజాల్లో ఉన్న బూత్‌లను అన్నింటినీ ఫాస్టాగ్ బూత్‌లుగా మార్చలేదు. వాహనదారుల సౌకర్యార్థం ఒకటి రెండు సాధారణ బూత్‌లను నిర్వహించేవారు. ఫాస్టాగ్ లేని వాహనాలను ఈ బూత్‌ల ద్వారా అనుమతించే వారు. ఇకపై అన్ని బూత్‌లను కూడా ఫాస్టాగ్ బూత్‌లుగా మార్చేస్తారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర రవాణా శాఖ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ పోయిన నెల ఉత్తర్వులు జారీచేసింది.
గాడిన పడని ఫాస్టాగ్
ఫాస్టాగ్ విధానం ప్రారంభమై ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకూ పరిస్థితి గాడిన పడలేదు. జిల్లాలో కలపర్రు, ఉంగుటూరులలో ఉన్న రెండు టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ వందల సంఖ్యలో వాహనాలు నిలిచి పోతున్నాయి. ఫాస్టాగ్ రీడర్లు, స్కానర్లు పనిచేయక సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ మాన్యువల్‌గా స్కాన్ చేయడం, నగదు చెల్లింపులు చేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజూ ఈ టోల్‌ప్లాజాల ద్వారా సగటున 14 వేల వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. వీటిలో 30 శాతం వాహనాలకు ఈరోజు వరకూ ఫాస్టాగ్ లేదు. ఈ రెండు టోల్ ప్లాజాల ద్వారా సుమారు 500కు పైగా ప్రభుత్వ వాహనాలు పోతుంటాయి. వీటికి ఇప్పటి వరకూ ఫాస్టాగ్‌లు లేవు. ఇకపై వీటికి కూడా ఫాస్టాగ్ ఉండాల్సిందే. వీటికి ఎన్‌హెచ్‌ఏఐ ఉచిత ఫాస్టాగ్ స్టిక్కర్లు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చింది..?వచ్చే 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందా.. అన్నదే ప్రశ్న.