చురుగ్గా జాతీయ రహదారి నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2020-12-12T04:26:35+05:30 IST

దేవరపల్లి నుంచి తల్లాడ వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ పనులు గోపాలపురం మండలంలో చురుగ్గా సాగుతున్నాయి.

చురుగ్గా జాతీయ రహదారి నిర్మాణ పనులు
మాతంగమ్మ మెట్ట వద్ద జాతీయ రహదారి నిర్మాణ పనులు

గోపాలపురం, డిసెంబరు 11: దేవరపల్లి నుంచి తల్లాడ వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ పనులు గోపాలపురం మండలంలో చురుగ్గా సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. రోడ్డంతా గోతులమయం కావడంతో వాహనదారులు ఆ గోతుల్లోపడి ప్రమాదాలకు గురయ్యేవారు. భారీ వాహనాలు ఈ గోతుల్లో పడి మరమ్మతులకు లోనయ్యేవి. ఈ రహదారిపై ప్రయాణించేందుకు విసుగు చెందిన వాహనదారులు కొన్ని నెలల పాటు రాకపోకలు నిలిపివేశారు. రహదారి సమస్య పరిష్కరించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, సీపీఎం, జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పలు మార్లు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. రహదారి సమస్య జఠిలం కావడంతో రాజమహేంద్రవరం ఎంపీ సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి పలు మార్లు తీసుకెళ్లారు. ఎట్టకేలకు నిధులు మంజూరు కావడంతో ముందుగా గోపాలపురం,  దేవరపల్లి  మండలాల పరిధిలో అధ్వానంగా ఉన్న రహదారి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన  చేపడుతున్నారు. దేవరపల్లి నుంచి జగన్నాథపురం వరకు మొదటి విడతగా, రెండో విడతలో జగన్నాథపురం నుంచి జంగారెడ్డిగూడెం వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండడంతో వాహనదారులకు కొంత వరకు ఉపశమనం దొరికినట్లు అయ్యింది. పూర్తి స్థాయిలో ఈ రహదారిని త్వరలోనే నిర్మించి పూర్తి చేస్తామని జాతీయ రహదారి అధికారులు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 


Updated Date - 2020-12-12T04:26:35+05:30 IST