ఏపీలో ఉత్పత్తి అయ్యే పాలకు మంచి పేరుంది

ABN , First Publish Date - 2020-12-20T04:18:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే పాలకు దేశంలోనే మంచి పేరు ఉందని ఏపీ డెయిరీ సహకార శాఖ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ.బాబు అన్నారు.

ఏపీలో ఉత్పత్తి అయ్యే పాలకు మంచి పేరుంది

ఏపి డెయిరీ సహకార శాఖ ఎండీ బాబు

ఏలూరుసిటీ, డిసెంబరు 19: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే పాలకు దేశంలోనే మంచి పేరు ఉందని ఏపీ డెయిరీ సహకార శాఖ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ.బాబు అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ సహకార శాఖ ఆధ్వర్యంలో అమూల్‌ ప్రాజెక్టుపై నిర్వహించిన వర్క్‌ షాప్‌లో  ఆయన మాట్లాడారు. రైతులకు అదనపు ఆదాయం చేకూర్చే పాడి పశువులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పాల సేకరణ సెంటర్లు ఏర్పాటు చేయటం ద్వారా మంచి ధరకు పాలను సేకరించి రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలకు 2 కి.మీ పరిధిలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పాడి పశువుల సంఖ్య ఆధారంగా పాల ఉత్పత్తి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద లబ్ధిదారులకు పాడి పశువులను అందించడం జరుగుతుందని చెప్పారు. మహిళలు ఉత్పత్తి చేసే పాలను అమూల్‌ సంస్థ సేకరించి మంచి ధర చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 12,04,416 లీటర్లు పాల ఉప్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 5 లక్షల పశు సంపద ఉండగా 3 లక్షల వరకు పాడి పశువులు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో జేసీలు కె వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్‌.తేజ్‌ భరత్‌ , ట్రైనీ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ , పశుసంవర్థక శాఖ జేడీ పి.శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో పి శ్రీనివాసులు,డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, జేడీ గౌసియాబేగం పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:18:27+05:30 IST