ఈ ఏడాది నేరాలు తగ్గాయ్
ABN , First Publish Date - 2020-12-30T05:40:53+05:30 IST
జిల్లాలో అన్నిరకాల నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ కె.నారాయణనాయక్ స్పష్టం చేశారు.
52 హత్యలు.. 90 అత్యాచారాలు..
రోడ్డు ప్రమాదాల్లో 423 మంది మృతి.. 1183 మందికి గాయాలు
619 వరకట్న వేధింపులు
అక్రమ మద్యం కేసుల్లో 25 మంది ఉద్యోగుల అరెస్ట్
870 మంది అదృశ్యం.. కేసుల విచారణలో పురోగతి
జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ వెల్లడి
ఏలూరుక్రైం, డిసెంబరు 29: జిల్లాలో అన్నిరకాల నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ కె.నారాయణనాయక్ స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ ఏడాది జరిగిన క్రైం రివ్యూ వివరాలను వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని మార్చి 22 నుంచి కరోనా వైరస్ వ్యాప్తితో అప్రమత్తత చర్యలు, లాక్‌డౌన్ వంటి కారణా లతో నేరాలు తగ్గడానికి ఒక కారణమైందన్నారు. ‘ఈ ఏడాది 52 హత్యలు జరిగాయని గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం తగ్గాయి. దోపిడీ కేసులు మూడు నమోదవగా గతేడాది 8 కేసులు, వరకట్న వేధింపుల మరణాలు ఆరు నమోదవగా గతేడాది ఏడు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది 90 అత్యా చారాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 39 శాతం తగ్గాయి. వరకట్న హత్యలు మూడు, మహిళలపై వరకట్న వేధింపుల కేసులు 619 నమోదయ్యాయి. ఈ ఏడాది 38 మహిళల అపహరణ కేసులు రాగా, గతంతో పోలిస్తే 30 శాతం తగ్గింది. చీటింగ్ కేసులు 549, నమ్మక ద్రోహం కేసులు 115 వచ్చాయి. నకిలీ కరెన్సీ కేసులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గి.. రెండే నమోదయ్యాయి. గతేడాది రోడ్డు ప్రమాద కేసులు 1416 నమోదు కాగా, 547 మంది మరణించారని, 1576 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 1099 కేసులు నమోదవగా, 423 మంది మరణించారు. 1183 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 117 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా డీఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అక్రమ మద్యం రవాణా చేసిన వారిపై 641 కేసులు నమోదు చేశాం. అక్రమ మద్యం రవాణాలో ప్రభుత్వ ఉద్యోగులపై 25 కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్ట్ చేశాం. ఈ ఏడాది 870 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. స్పందనలో 1,275 ఫిర్యాదులు రాగా 1,230 పరిష్కరించాం. 45 ఫిర్యాదులు ఇటీవలే వచ్చాయి. డయల్ 100కు సరాసరి రోజుకు 1,548 కాల్స్ వస్తున్నాయి. సరాసరి 45 కాల్స్ మాత్రమే నిజమైనవి. ఎస్పీ వాట్సప్ నెంబర్ (95503 51100)కు ఈ ఏడాది 570 ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నాం’ అని ఎస్పీ వివరించారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ కె.రజనీకుమార్, డీసీఆర్‌బీ సీఐ కె.నాగేశ్వరనాయక్ పాల్గొన్నారు.