ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-16T04:25:01+05:30 IST
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రు లను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.
ఏలూరు, డిసెంబరు 15(ఆంఽధ్రజ్యోతి): ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రు లను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, విద్య, వైద్య ఆరోగ్య, జాతీయ రహదారుల శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున సమీపంలోని ప్రధాన ట్రామా కేర్ సెంటర్లను గుర్తించి వివరాలు జాతీయ రహదారులు, పోలీస్, 108 అఽధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అఽధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్‌బీ రోడ్ల వెంట చెత్తను డంప్ చేయకుండా చూడాలని పీఆర్, మునిసిపల్ కమిషనర్‌లకు సూచించారు. సమావేశంలో కన్వీనర్ డీటీసీ సిరి ఆనంద్, ఏఎస్పీ ఏవీఎస్ సుబ్బరాజు, ఎస్‌డీపీవో దిలీప్ కుమార్, డీపీవో కే.రమేశ్ కుమార్, డీఎం హెచ్‌వో సునంద, డీఈవో సీవీ రేణుక ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.