ఆరున్నర నెలలు.. 5,060 కేసులు

ABN , First Publish Date - 2020-12-29T05:26:27+05:30 IST

జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ఆధ్వర్యంలో భారీగా కేసు లు నమోదయ్యాయి.

ఆరున్నర నెలలు.. 5,060 కేసులు

వేల సంఖ్యలో లిక్కర్‌, అనుబంధ కేసులు

జిల్లావ్యాప్తంగా అరెస్టయినవారు 6,695

పన్ను చెల్లించని మద్యం కేసులు 701 

ఏలూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ఆధ్వర్యంలో భారీగా కేసు లు నమోదయ్యాయి. సెబ్‌ ఏర్పడిన మే 16వ తేదీ నుంచి ఇప్పటివరకూ అక్షరాలా 5,060 కేసులు నమోదై నట్లు సెబ్‌ అధికారులు సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో నమోదైన కేసుల్లో 90 శాతం లిక్కర్‌ సం బంధిత కేసులు కావడం జిల్లాలో జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారాన్ని గురించి స్పష్టం చేస్తోంది. ఇసుక అక్రమ తరలింపు కేసులు 522, గుట్కా కేసులు 40, గంజాయి కేసులు 21 మినహా మిగిలినవన్నీ మద్యా నికి సంబంధించినవే. 


2,403 సారా కేసులు

జిల్లాలో ఆరున్నర నెలల్లో అధికారులు 2,403 నాటుసారా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 2544 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 26,734 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 5,14,550 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. వీరి వద్ద నుంచి 558 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. కాగా అక్రమంగా బెల్లం తరలిస్తున్న వారిపై సెబ్‌ అధికారులు 31 కేసులు నమోదు చేశారు. 48 మందిని అదుపులోకి తీసుకుని, 19,760 కిలోల బెల్లాన్ని, 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాలో పన్ను చెల్లించని ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలకు సంబంధించి ఈ ఆరున్నర నెలల్లో 701 కేసులు నమోదు చేశారు. 1,157 మందిని అరెస్టు చేశారు. వీరి  నుంచి 24,818 లీటర్ల పన్ను చెల్లించని మద్యాన్ని, 822 లీటర్ల పన్ను చెల్లించని బీరు, 573 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అనుమతి లేకుండా, పరిమితికి మించి మద్యం కలిగి ఉన్నవారిపై 1,382 కేసులు నమోదు చేశారు. 1,526 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 3,125 లీటర్ల మద్యం,160 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 


522 అక్రమ ఇసుక కేసులు

ఈ ఆరున్నర నెలల్లో జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ తరలింపునకు సంబంధించి సెబ్‌ అధికారులు 522 కేసులు నమోదు చేసి 1,312 మందిని అరెస్టు చేశారు. 744 వాహనాలను సీజ్‌ చేసి 5,787 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాలో 21 గంజాయి కేసులు నమోదు చేసి 108 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,981 కిలోల గంజాయి, 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

40 గుట్కా కేసులు నమోదవగా 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. 4,25000 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.


మూటల్లో తరలింపు

నిడదవోలు, డిసెంబరు 28 : లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తే దొరికిపోతున్నామని ఇసుక అక్రమార్కులు ఇప్పుడు రూటు మా ర్చారు. ర్యాంపుల నుంచి అర్ధరాత్రి వేళ మూటలు కట్టి మోటారు సైకిళ్లపై గుట్టుగా తరలిస్తున్నారు. నిడదవోలు మండలం గోదావరి తీర గ్రామమైన పెండ్యాలలో పగలంతా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రయితే ఇక్కడి ఇసుక ర్యాంపులో సందడి మొదలవుతుంది. అక్రమ ఇసుక తరలింపు వాహనాలతో బిజీబిజీగా మారుతోంది. గోదావరి వర దల సమయంలో మూసివేసిన పెండ్యాల ర్యాంపు తెరిచేందుకు నేటికి అనుమతులు రాలేదు. మరోపక్క ఇసుక కొరత పెరిగింది. దీంతో పెండ్యాల లో ఇసుక మాఫియా అక్రమ ఇసుక తరలింపులు ఊపందుకున్నాయి. యూనిట్‌ రూ.1300లకు దొరకాల్సిన ఇసుక ఇప్పుడు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. పెండ్యాల ర్యాంపు నుంచి వాహనాల రాకపోకలకు అనువుగా ఉండడంతో యఽథేచ్ఛగా అక్రమ రవాణా సాగిపోతోంది. మూటలుగా కట్టి ఇసుక తరలిస్తున్నారు. నిర్మాణాలకు ఇసుక కావలసిన వారు ముందుగానే ఇసుకాసురుల ద్వారా చేసుకున్న ఒప్పందం మేరకు అర్ధరాత్రి సమయంలోనే ఇసుక కావలసిన వారి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. 

Updated Date - 2020-12-29T05:26:27+05:30 IST