-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari badigulapi bramhastram
-
బడుగులపై బ్రహ్మాస్త్రం
ABN , First Publish Date - 2020-12-15T05:37:52+05:30 IST
తాడేపల్లిగూడెంలోని ఓ చిరు వ్యాపారి 50 గజాల స్థలంలో పాడుపడ్డ భవనాన్ని తొలగించి కొత్తగా నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు.

భవన నిర్మాణాల్లో అధికారుల పక్షపాతం
రాజకీయ ఒత్తిళ్లతో కొందరిపై చర్యలు
మరికొందరిపై కన్నెత్తి చూడని వైనం
తాడేపల్లిగూడెంలో అధికారుల తీరు వివాదాస్పదం
(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెంలోని ఓ చిరు వ్యాపారి 50 గజాల స్థలంలో పాడుపడ్డ భవనాన్ని తొలగించి కొత్తగా నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు. స్థానిక వార్డు టౌన్ ప్లానింగ్ సెక్రటరీని, వార్డు వైసీపీ నాయకులను కలిశారు. కొద్దిపాటి స్థలంలో ప్లాన్ ఎందుకు? నిర్మించుకోమంటూ అంతా సూచించారు. వీరిమాట మేరకు పాడుబడ్డ ఇంటిని తొలగించాడు. కొత్త దానికి సామగ్రిని సిద్ధం చేసుకుని శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాడు. అంతే అధికార పార్టీ నాయకులు, వార్డు సెక్రటరీ సహా రంగప్రవేశం చేశారు. నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మీ అందరి అనుమ తితోనే పనులు మొదలు పెట్టాను. ఇప్పుడిలా ఆపేస్తే ఎలా అని వాపోయాడు. వారు ససేమిరా అన్నారు. విషయం టీడీపీ నేతల దృష్టికి వెళ్లింది. వారూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. పట్టణ ప్రణాళికా విభాగానికి చెందిన మరో అధికారి ప్లాన్ పెట్టుకోవాలంటూ స్పష్టం చేశారు. ఇలా పది రోజులపాటు సదరు ఇంటి యజమాని లేబర్‌ను తిప్పి పంపించడంతో సొమ్ములు చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరకు ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసుకు న్నాడు. అధికారులు ఇలా అందరిపైనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తే పట్టణానికి ఆదాయం లభించేది. ప్లాన్‌లు లేకుండా పెద్ద భవనాల నిర్మాణాలు నిలిచిపోయేవి. కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే తాడేపల్లిగూడెంలో అధికారులు స్పందించే దుస్థితి నెలకొంది.
ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ..?
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ పట్టణంలో అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరిగాయి. అనుమతి ఉండీ, నిబంధనలు అతిక్రమించిన భవనాలను వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో కూల్చివేసింది. టీడీపీ నాయకుడు అందులో భాగస్వామిగా ఉన్నారన్న ఉద్దేశంతో అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు. అదే పట్టణంలో అనుమతి లేని భవనాలు అనేకం నిర్మాణంలో ఉన్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
విమానాశ్రయ భూముల్లో కొత్త నిర్మాణాలు చోటు చేసుకోవడం సర్వసాఽధారణం. ప్రభుత్వం 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్టు జీవో జారీ చేయడంతో నిర్మాణాలు మరింత జోరందుకున్నాయి. అనుమతులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఆశీస్సులుంటే పట్టణ ప్రణాళిక విభాగం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు!
స్థానిక సవిత్ర పేటలో గతంలో సెట్ బ్యాక్‌ను అతిక్రమించి గోడను నిర్మించారని దానిని తొలగించారు. ఎంతంతే.. సదరు గోడలో సగ భాగం ఒక్క అడుగు ముందుకు జరిగిందని..!
మరోవైపు ప్రభుత్వ స్థలాలుగా గుర్తింపు ఉన్న ప్రదేశంలో ప్లాన్ మంజూరుకు సహకరించాలని ఇటీవల మున్సిపల్ అధికారులపై అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై విపక్షాలు దృష్టి పెట్టడంతో అధికారులు కాస్త వెనక్కి తగ్గారు.
ఇటీవల గణేష్‌నగర్‌కు అనుకుని వున్న విమానాశ్రయ భూమిలో నిర్మించిన రెండు ఇళ్లును మాత్రమే అధికారులు తొలగించారు. దానికి ఆనుకుని వున్న పక్కింటి వైపు అధికారులు తొంగి చూడలేదు. కేవలం రాజకీయ ఒత్తిడితోనే ఒకరిపై మమకారం.. మరికరిపై చర్యలు తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది.
ప్లీజ్.. మమ్మల్ని లాగొద్దు
ఈ విషయంపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దయచేసి తమకు బయటకు లాగవద్దంటూ మొర పెట్టుకున్నారు.