-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari amma vodi
-
అర్హులెవరో తేల్చేస్తారు
ABN , First Publish Date - 2020-12-28T05:43:09+05:30 IST
అమ్మ ఒడి ఆర్థిక సాయానికి కీలక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

అమ్మ ఒడి అర్హుల జాబితాకు నేడు ఆమోదం
పేరెంట్స్ కమిటీల సమావేశం..
అనర్హుల, నిలుపుదల జాబితాలపై
అభ్యంతరాల పరిష్కారానికి సూచనలు
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 27 : అమ్మ ఒడి ఆర్థిక సాయానికి కీలక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులను క్షేత్ర స్థాయిలో నిర్ధారించేందుకు సోమవారం అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన 4,93,899 మంది అర్హులైన (ఎలిజిబుల్) విద్యార్థుల జాబితాలపై తల్లిదండ్రుల కమిటీలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరోవైపు నిలుపుదల (విత్‌హెల్డ్) జాబితాలో ఉన్న 9179 మందిలో కొందరిని తాజాగా అర్హుల జాబితాలో చేర్చుతూ ఆదివారం రెండో లిస్టును విద్యాశాఖ విడుదల చేసింది. ఈ క్రమంలోనే మొత్తం ఆరు రకాల కారణాలతో అనర్హుల (ఇన్ ఎలిజిబుల్) జాబితాలో ఉన్న 41,809 మంది విద్యార్థుల తల్లులు/సంరక్షకులు తమ అభ్యంతరాలకు సంబంధించి ధృవీకరపత్రాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏ కారణంతో అనర్హుల జాబితాలో చేర్చాల్సి వచ్చిందో పేర్కొంటూనే, వాటిని సవాల్ చేసేందుకు అందజేయాల్సిన అధికారిక ధృవీకరణలను గ్రామ సచివాలయాల్లో అప్‌లోడ్ చేసేందుకు లింక్ ఇచ్చారు. మొత్తం మీద ఈనెల 28న పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలను నిర్వహించి అర్హుల జాబితాపై అప్రూవల్ తీసుకోవడం, 29న గ్రామ సభల్లో పెట్టి ఆమోదింప చేయడం, 30న మండలస్థాయిలో అన్ని పాఠశాలల నుంచి జాబితాలను క్రోడీకరించి 31న జిల్లా కేంద్రానికి, అదే రోజున కలెక్టర్ ఆమోదం నిమిత్తం అందజేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇన్ ఎలిజిబుల్, విత్‌హెల్డ్ జాబితాలపై పరిష్కారం ఇలా :
బ్యాంక్ అక్కౌంట్లలో తప్పుల సవరణ, ఎలిజిబుల్ నుంచి ఇన్‌ఎలిజిబుల్ జాబితాలోకి వెళ్ళినవారు, డ్రాప్ బాక్స్‌లో ఉండాల్సిన విద్యార్థులు, తల్లి, సంరక్షకుని ఆధార్ వివరాల్లో తప్పుల అప్‌డేట్ వంటి సమస్యల పరిష్కారానికి స్కూల్ హెచ్‌ఎంలకు అధికారం కల్పిస్తూ మొత్తం నాలుగు రకాల సర్వీసులను స్కూల్ లాగిన్లకు ఇచ్చారు. ఆ ప్రకారం విత్‌హెల్డ్ జాబితాలో ఉన్న వారంతా తమ అభ్యంతరాలను పరిష్కరించుకునేందుకు స్కూలు హెచ్‌ఎంలను సంప్రదించాలి.
చెల్లని ఆధార్ వివరాలు లేదా ఆధార్ వివరాలు సరిగాలేని లబ్ధిదారులు ఈ– కెవైసీని చేయించుకోవాలి. గ్రామ వలంటీర్‌ను కలుసుకుని హౌస్ హోల్డ్ నెంబర్‌కు ట్యాగ్ చేయించుకోవాలి. ఆమేరకు గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్ కాపీ అంద జేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులు/ఔట్‌సోర్స్ ఉద్యోగులు కానట్లయితే తగిన వివరాలను సచి వాలయాల్లో అందజేయాలి. ఇటువంటి లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ. 10 వేలు, పట్టణ ప్రాంతంలో నెలకు రూ. 12 వేలు కంటే ఎక్కువ జీతం పొంద నట్లయితే తగిన ఆధారాలను అందజేయాల్సి ఉంటుంది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం అమ్మఒడి పథకానికి రేషన్‌కార్డు లేదా రైస్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ. 1.20 లక్షలు మించలేదని ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
పరిమితికి మించి విద్యుత్ వినియోగం ఎక్కువ లేనట్లయితే గత ఆరు నెలల బిల్లులను ఆధారాలుగా సచివాలయాల్లో అందజేయాలి.
ఒకే తల్లి ఆధార్ నెంబర్‌కు పది మంది కంటే ఎక్కువ పిల్లలు లింక్ అయి ఉంటే అటువంటి వారి వివరాలను స్కూల్ హెచ్‌ఎంలు ధృవీకరించాల్సి ఉంటుంది.
ట్రాక్టర్, ఆటో, అద్దె టాక్సీ మినహా నాలుగు చక్రాల సొంత వాహనం లేనట్లయితే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను సచివాలయాల్లో అందజేయాలి. నాలుగు చక్రాల వాహనం ఉన్న కారణంగా ఇన్‌ఎలిజిబుల్ జాబితాలోకి వచ్చిన లబ్ధిదారులకు ఇది ఉపకరిస్తుంది.
ఆదాయపు పన్ను చెల్లింపు కారణంగా అనర్హుల జాబితాలో చేర్చిన సందర్భాల్లో లబ్ధిదారుడు ఆదాయపు చెల్లింపుదారు కాకపోతే తగిన ఆధారాలను సచివాలయాల్లో అందజేయాలి.
పరిమితికి మించి భూమి ఉన్న కారణంగా పలువురిని ఇన్‌ఎలిజిబుల్ జాబితాలో చేర్చారు. ఇటు వంటి లబ్ధ్దిదారులు ఎవరికైనా అసలు భూమి లేకపోయినా లేదా పరిమితికి లోబడే భూమి ఉన్నా దానికి తగిన ఆధారాలను సచివాలయాల్లో అందజేయాలి.
జిల్లాలో 938 మంది అనాధ పిల్లలు ఉన్నారు. వీరంతా అనాఽధాశ్రమాల్లోనూ, ప్రభుత్వ సంరక్షణ గృహాల్లోనూ ఉన్నట్లుగా జిల్లా విద్యాధికారులు నిర్ధారించాలి. ఆ మేరకు సంబంధిత అనాధ పిల్లల బ్యాంకు ఖాతా నెంబర్లను నమోదు చేయించి పరిశీలన, ఆమోదం నిమిత్తం డీఈవో ద్వారా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కి పంపాలి.
గత ఏడాది పిల్లల వివరాలు వారి తల్లుల ఆధార్‌కు ట్యాగ్ చేశారు. కానీ ఈ ఏడాది సంబంధిత తల్లి కాకుండా మరొకరికి ట్యాగ్ చేసినట్లుగా గుర్తించారు. ఇటు వంటి విద్యార్థుల వివరాలను స్కూల్ హెచ్‌ఎంలు మరోసారి ధృవీకరించుకుని తల్లి ఆధార్ ఉంటే ఆ వివరాలను నమోదు చేయడానికి తాజాగా అవకాశం కల్పించారు. తల్లి వివరాలు లేనట్లయితే ధృవీకరణ పత్రాలను గ్రామ సచివాలయాల్లో అందజేయాలి.
విద్యాశాఖ విడుదల చేసిన మూడు రకాల జాబితాల్లోనూ పేర్లు కనబడని విద్యార్థులు ఉంటే పిల్ల వాని ఐడీ, లేదా అధార్ లేదా తల్లి ఆధార్‌లతో అమ్మఒడి పోర్టల్‌లో సెర్చి చేయాలని విద్యాశాఖ సూచించింది. అయినప్పటికీ పోర్టల్‌లో విద్యార్థి పేరు కనబడకపోతే సంబంధిత పిల్లల వివరాలు నిర్ణీత సమయంలోగా అంటే ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా నమోదు చే యనట్లుగా పరిగణిస్తారు. ఇటువంటి విద్యార్థులకు ఈ ఏడాది అమ్మఒడి ఆర్ధిక సాయం అందనట్లే.
జాబితాలో పేరుంటే క్రిమినల్ చర్యలు : డీఈవో
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 27 : గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ10 వేలు, పట్టణ ప్రాంతంలో నెలకు రూ.12 వేలు కంటే ఎక్కువ జీతం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు / ఆర్టీసీ / విద్యాశాఖ / ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలు అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాలో ఉంటే వెంటనే తొలగించుకో వాలని, లేనిపక్షంలో సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమి నల్ కేసులు పెడతామని డీఈవో సీవీ రేణుక హెచ్చరిం చారు. లబ్ధిదారుల జాబితాలను స్కూలు నోటీసు బోర్డులో పెట్టని హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌ఎలిజిబుల్ జాబితాలో ఉన్న విద్యార్థుల వివరాలపై సచివాలయ నవశకం వెబ్‌సైట్ నుంచి అభ్యం తరాలను స్వీకరించి వాటిని ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) ద్వారా పరిష్కరిస్తామన్నారు.