4,500 మంది చిన్నారులకు అమ్మ ఒడి దూరం ?!

ABN , First Publish Date - 2020-12-20T05:13:24+05:30 IST

అమ్మఒడి నగదు ప్రోత్సాహకానికి ఈఏడాది ఆగస్టు 31వ తేదీనాటికి ఐదేళ్ల వయసు దాటిన వారికే అర్హత కల్పిస్తామంటూ విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా దాదాపు 4500 మంది చిన్నారుల తల్లులకు ఆర్థికసాయం అందకుండా పోతుంది.

4,500 మంది చిన్నారులకు అమ్మ ఒడి దూరం ?!

ఐదేళ్ల వయసుకు నెల తక్కువ  ఉన్నా అనర్హులే 

 ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 19 : అమ్మఒడి నగదు ప్రోత్సాహకానికి ఈఏడాది ఆగస్టు 31వ తేదీనాటికి ఐదేళ్ల వయసు దాటిన వారికే అర్హత కల్పిస్తామంటూ విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా దాదాపు 4500 మంది చిన్నారుల తల్లులకు ఆర్థికసాయం అందకుండా పోతుంది. జిల్లాలో ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఈ ఏడాది చేరిన సుమారు 49 వేల మంది చిన్నారుల్లో  నిర్ణీత గడువు తేదీ నాటికి నిర్ధేశిత వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్థులందరినీ అమ్మఒడి పథకానికి అనర్హులుగా చేయనున్నారు. ఇలా గడువు తేదీనాటికి నిర్ణీత ఐదేళ్ల వయసుకు గరిష్టంగా నెల నుం చి రెండు, మూడు నెలలు తక్కువ ఉన్న విద్యార్థులు 1500 మంది వరకూ ఉన్న ట్లు తెలిసింది. ఐదేళ్ల లోపు పిల్లలను చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో నమోదు చేసిన ప్రాథమిక పాఠశా లల ప్రధానోపాధ్యా యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో నిర్ణీత వయసు పుట్టిన తేదీకి కొద్దిరోజుల సమీపంలో ఉన్న పిల్లలను కూడా పలువురు హెచ్‌ఎంలు పథకం నుంచి తొలగిస్తున్నట్లు స మాచారం. గతేడాది ఒకటవ తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ అర్హత కల్పించిన ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఈ నిబంధన పెట్టింది. రేషనలైజేషన్‌లో ఆయా పాఠశాలల్లో టీచరు పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు చైల్డ్‌ఇన్‌ఫో డేటాలో చిన్న పిల్లలను కూడా చేర్చినట్లు అనుమానిస్తోన్న విద్యాశాఖ ఇటువంటి షరతు పెట్టడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే మార్గాన్ని ఎంచుకుంది.  


అమ్మ ఒడి వద్దంటూ పేరెంట్స్‌ నుంచి డిక్లరేషన్‌ 

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికీ ఒకటవ తరగతిలోకి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆగస్టు 31వ తేదీ తరువాత ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులు సెప్టెంబరు, అక్టోబ రు, నవంబరు నెలలతో పాటు ఈ నెలలోనూ చేరిన వారున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం నిర్ణీత కటాఫ్‌ తేదీ నాటికి నిర్ధేశిత ఐదేళ్ల వయసు దాటని చిన్నారులకు అమ్మఒడి వర్తింప చేయబోమంటూ సంబంధిత తల్లి దండ్రులకు హెచ్‌ఎంలు స్పష్టం చేస్తున్నారు. అమ్మఒడి నగదు ప్రోత్సాహకంతో నిమిత్తం లేకుండా ఇష్టపూర్వకంగానే పిల్లలకు ఒకటవ తరగతిలోకి అడ్మిషన్‌ తీసుకుంటున్నామంటూ తల్లిదండ్రులు డిక్లరేషన్లను ఇచ్చేలా తాజాగా నిబంధన విధించారు. 

Updated Date - 2020-12-20T05:13:24+05:30 IST