దాళ్వా సాగుపై భయం.. భయం..

ABN , First Publish Date - 2020-12-06T05:19:09+05:30 IST

దాళ్వా సాగు రైతులను భయపెడు తోంది. కాల్వలు ముందుగా కట్టేస్తారని, సాగు ముందుగా చేపట్టాలని అధికారులు చెబుతున్నారు.

దాళ్వా సాగుపై భయం.. భయం..

పాలకొల్లు రూరల్‌, డిసెంబరు 5 : దాళ్వా సాగు రైతులను భయపెడు తోంది. కాల్వలు ముందుగా కట్టేస్తారని, సాగు ముందుగా చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. రైతులు ముందస్తు సాగుకు సిద్దం అయినప్పటికీ శివారు ప్రాంత రైతుల్లో చివరి వరకు సాగునీరు అందుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పంట బోదెలు, కాలువలు తవ్వకం పనులు చేపట్టలేదు. పంట కాల్వలు పూడిపోవ డంతో పాటు మురుగు డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు పారని పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాలకు సరిపడా నీరందక పంట నష్టపోతామనే బెంగతో రైతులు సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. కాల్వలు ముందుగా కట్టివేస్తారనడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రైతు భరోసాతో కొద్దిపాటి ఊరట పొందినా కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కౌలు రైతులకు ఒప్పంద పత్రాలు అందకపోవడంతో సాగుకు ముందుకు రావడం లేదు. సార్వా నష్టపోయినా,  కౌలు కార్డులు లేకపోవడంతో సార్వా పంటకు నష్టపరిహారం అందే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు. గతంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో వారికి అవసరమైన ప్రాంతాల్లో బోదెలు, చెరువులు తవ్వకాలు చేసుకునే వారు. దీంతో సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదని రైతులు చెబుతున్నారు.


నీరందుతుందో.. లేదో..

ముందస్తు దాళ్వా సాగు చేస్తాం, అయితే పంట చివరి దశవరకూ సాగునీరు అందుతుందో లేదోనని సందేహంగా ఉంది. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా బోదెలు, కాలువలకు తవ్వక పోవడం వల్ల శివారు ప్రాంతాల్లోని రైతులు దాళ్వా సాగు చేయాలో మానాలో అనే  అర్ధం కాకుండా ఉంది.

భలే పెద్దిరాజు, కౌలు రైతు, గొల్లవానిచెరువు


కాలువలు, బోదెలు తవ్వకం లేదు

కాలువలు, బోదెలు, చెరువులు పూడి పోయాయి. తవ్వకం పనులు రైతు సంఘాల ద్వారా చేపడితే మేలు. సాగునీరు సక్రమంగా అందే విధంగా చూసుకుంటారు. చాలామంది కౌలు రైతులకు కార్డులు లేకపోవడంతో నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో కౌలుకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి.

కోడి విజయభాస్కర్‌, రైతుసంఘ నాయకుడు, సగంచెరువు

Updated Date - 2020-12-06T05:19:09+05:30 IST