వైరస్ విస్తరణ
ABN , First Publish Date - 2020-05-19T07:42:50+05:30 IST
జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టక పోగా, మరింతగా

జిల్లాలో 72కు పెరిగిన పాజిటివ్ కేసులు
ఒకే రోజు ఇద్దరికి నిర్ధారణ
నేడో..రేపో మరిన్ని ప్రకటన
కొత్త మండలాలకు వైరస్
భయపెడుతున్న కోయంబేడు
ఇప్పటికి 54 మంది డిశ్చార్జ్
వెయ్యికి పైగా క్వారంటైన్‌లో..
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టక పోగా, మరింతగా పెరుగుతున్నాయి. ఇది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏలూరులో ఒకరికి, పెరవలిలో ఇంకొకరికి పాజిటివ్ నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 72కు చేరగా, మరో ఆరు వరకు నిర్ధారణ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. చికిత్స పూర్తి చేసుకుని కోలుకున్న వారందరినీ డిశ్చార్జి చేస్తున్నారు. చెన్నైలోని కోయంబేడు లింకులు ఈ మధ్యనే బయటపడగా ఇప్పుడవి మరింత విస్తరిస్తున్నాయి. పెరవలి మండలం నల్లాకులవారిపాలెంకు చెందిన ఒకరికి ఇంతకుముందే పాజిటివ్ రాగా, గ్రామానికి చెందిన మరొకరికి నిర్వహించిన పరీక్షల్లో సోమవారం పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. ఏలూరులో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించినా తాజా లింకుల కారణంగా మరింత పెరగబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.
నగరంలో తాజాగా మరో కేసు బయటపడింది. ఇప్పటికే తంగెళ్ళమూడికి చెందిన వారికి పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు కాగా, ఆ తరువాత వీరంతా ఒకరి తరువాత ఒకరు డిశ్చార్జి అవు తుండగానే కొత్త కేసు నమోదు కావడం దిగ్ర్భాంతికి గురి చేసింది. నగరంలో ఈ కేసుల సంఖ్య తగ్గు ముఖం పడితేనే సాధారణ జన జీవనం ఊపిరి పీల్చుకోవడానికి వీలుంటుంది. ఒక దశలో ఏలూరులో కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరగా ఆ తరువాత వరుసగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమో దవుతూ వచ్చాయి.
ఇప్పుడిదే నగరంలో కొంత గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటి వరకు నగరంలో పూర్తిస్థాయి కట్టడికి ఒక వైపు పోలీసులు, మరో వైపు అధికారులు ప్రయత్నిస్తు న్నారు. ఏలూరు ఆర్‌ఆర్ పేటలో రెడ్‌జోన్ తొలగించి 24 గంటలు గడవక ముందే తిరిగి అదే ప్రాంతానికి సమీపంలో మరో రెడ్‌జోన్ ఏర్పాటైంది. వాణిజ్య ప్రాంతంగా వున్న ఆర్‌ఆర్ పేటలో వరుసగా రెడ్‌జోన్లు కొనసాగడంతో వ్యాపారులంతా దిగాలు పడ్డారు. ఈ ప్రాంతంలోని వస్త్ర దుకాణాలు, బ్యాం కులు, ఆసుపత్రులపై దీని ప్రభావం పడనుంది. పేరొందిన ఆసుపత్రుల్లో ఒకటి రెండు రోజుల్లోనే సేవలు విస్తరిద్దామని భావిస్తుండగా రెడ్‌జోన్ పరిధిలోకి వచ్చాయి. తాడేపల్లిగూడెం రూరల్, పెదపాడులోను మరో రెండు కేసులు నిర్ధారణకు సిద్ధంగా ఉన్నాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కొనసాగుతున్న పరీక్షలు
జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు నెలల్లో సుమారు 24 వేల మందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో దాదాపు 22 వేల మందికిపైగా నెగెటివ్ రిపోర్టులు అందాయి. మరో 17 వందల మందికి పైగా నివేదికలు అందాల్సి ఉంది. డిశ్చార్జుల సంఖ్య క్రమేపీ పెరు గుతూ వస్తుంది. తాజాగా ఏలూరు దక్షిణపు వీధికి చెందిన ఒకరు, సిద్ధాంతానికి చెందిన ఇంకొకరు, ఏలూరు తంగెళ్లమూడికి చెందిన మరొకరు పూర్తిగా కోలుకోవడంతో వీరందరినీ కరోనా వీరులుగా అభివర్ణిస్తూ ఇళ్లకు సాగనంపారు. ఇప్పటి వరకు డిశ్చార్జుల సంఖ్య 54కు పెరిగింది. క్వారంటైన్‌లో చేరుతున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతుంది. వీరిలో వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే భీమవరం, తాడేపల్లి గూడెం క్వారంటైన్‌లో వున్న వారి సంఖ్య 11 వందలు దాటింది. దీనికి తోడు ప్రతి రోజు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి వస్తున్న వారందరినీ ఇదే క్వారంటైన్లకు చేరుస్తున్నారు.
రెడ్ జోన్‌లో ఆర్‌ఆర్ పేట
ఏలూరు రూరల్/క్రైం : ఏలూరు రామచంద్రరావుపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. వ్యాపారం నిర్వహించే అతనికి సెకండరీ కాంటాక్టుగా వచ్చినట్టు గుర్తించారు. వైరస్ సోకిన వ్యక్తి నివాసం ఉంటున్న అపార్టు మెంటులో వారి వివరాలను సేకరించారు. ఎక్కువగా ఆసు పత్రులు, ల్యాబ్‌లు ఉన్నాయి. ఇప్పటికీ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారిని ఎక్కడకు తరలిం చాలనే విషయంపై ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అతను ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఏలూరు చిట్టివలసపాక, ఇతర ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీచేశారు.
దీనిపై ఆయా ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్‌కిరణ్ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్, టూటౌన్ ఎస్‌ఐ కె.నాగేంద్రప్రసాద్, అటాచ్‌మెంట్ ఎస్‌ఐలు ఏసుబాబు, సూర్యభగవాన్ ఆ ప్రాంతానికి పరిశీలించారు. ఈ ప్రాంతం నుంచి రాకపోకలను నిషేధించారు. అనుమా నితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మునిసిపల్ అధికారులు ఆ ప్రాంతంలో శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు. ఇంటింటినీ హైడ్రో క్లోరినేషన్ చేశారు.
తాడేపల్లిగూడెం 11వ వార్డు రెడ్‌జోన్
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం 11వ వార్డులో కోయంబేడు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ సోకడంతో పట్టణంలో రెడ్‌జోన్ ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ సాయిరాజ్ తెలిపారు. సూపర్ శానిటేషన్ చేశారు. ఆరోగ్య సిబ్బంది సర్వే నిర్వహించారు. కమిషనర్ బాలస్వామి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, సీఐ ఆకుల రఘు సమీక్షించారు.
భార్యాభర్తలకు పాజిటివ్
పెరవలి గ్రామీణ : నల్లాకులవారిపాలెంలో భార్యాభర్తలకు పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిరువురితో సంబంధాలున్న రెండో స్థాయి అనుమానితులు ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు. ఆర్డీవో లక్ష్మారెడ్డి సోమవారం గ్రామాన్ని సందర్శించారు.
తోటగూడెంలో రెడ్ జోన్
పెదపాడు : పెదపాడు మండలం రాజుపేట పంచాయతీ నందికేశ్వరపురంలో ఒక గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చిందని డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్ తెలిపారు. తోటగూడెంకు సమీపంలో ఆమె నివాసం ఉండటంతో ఈ గ్రామాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి రాకపోకలను నిషేధించామన్నారు. బాధితురాలికి దగ్గరగా వున్న పదిమందిని గుర్తించి వారిని వట్లూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్‌కు తర లించారు. సెకండరీగా గుర్తించిన 28 మందిని హోం క్వారంటైన్‌లో వుంచారు. రూరల్ సీఐ ఎ.శ్రీనివాసరావు, పెదపాడు ఎస్సై జ్యోతిబస్ పాల్గొన్నారు.