కూర ‘గాయాలు’

ABN , First Publish Date - 2020-12-02T05:04:11+05:30 IST

కూరగాయల ధరలు మండుతున్నాయి.

కూర ‘గాయాలు’

నీట మునిగిన ఉద్యాన పంటలు 

కార్తీక మాసం డిమాండ్‌ 

మళ్లీ పెరిగిన ధరలు


నరసాపురం, డిసెంబరు 1: కూరగాయల ధరలు మండుతున్నాయి. అన్ని రకాలు కిలో రూ.40 పైగా ధర పలుకుతున్నాయి. ఈ తరుణంలో నివర్‌ తుఫాన్‌ ఉద్యాన పంటను ముంచేసింది. వేలాది ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం వాట్లింది. చేతికొచ్చిన పంటను రైతులు కోల్పోయ్యారు. జిల్లాలో దాదాపు 50నుంచి 70వేల ఎకరాల్లో పంటకు నష్టం వాట్లినట్లు అంచనా. కార్తీక మాసం కావడంతో కూరగాయలకు పెరిగిన డిమాండ్‌తో ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. 

నరసాపురం, యలమంచిలి, సిద్ధాంతం, ఆచంట, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలుతో పాటు మెట్ట ప్రాంతంలో కూడా పలు రకాల ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. దోస, బీర, ఆనప, వంగ, పొట్ల, దొండ, బెండ, చిక్కుడు, ఆకు కూరలు పలువురు రైతులు సాగు చేస్తున్నారు. టమాట, క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాబేజీ వంటి రకాలను ఇతర జిల్లాల నుంచి దిగు మతి అవుతున్నాయి. తుఫాన్‌ కారణంగా చిత్తూరు జిల్లాలో టమాట పంట సర్వనాశనమైంది. రాయలసీమలో ఉల్లి పంట కూడా దెబ్బతింది. జిల్లాల్లోని కూరగాయ పాదులన్ని నీట మునగడంతో కుళ్లిపోయాయి. దిగుమతిపైనే అధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు, వరదలకు ఉద్యాన పంట ఎక్కువగా దెబ్బతింది. దీంతో కూరగాయ ధరలు కొండెక్కి కూర్చోన్నాయి. ఇప్పుడిప్పుడే దిగుబడి రావడంతో ధరలు తగ్గుతూ వచ్చాయి. కేజీ రూ 100 పలికిన వంగ రూ రూ.50కు దిగింది. టమాట కూడా రూ 40కు వచ్చింది. చిక్కుడు కూడా రూ 120 నుంచి రూ.100 దిగింది. ఇలా తగ్గుతున్న తరుణంలో తుఫాన్‌ దెబ్బకు దిగుబడి లేక ధరలు పైకి ఎగబాకుతున్నాయి. కిలో రూ.40 నుంచి రూ.50 పైగా పలుకున్నాయి. తిరిగి రైతులు సాగు చేసి పంట రావాలంటే మరో రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు అధిక ధరల భారం మోయాల్సిందే.

Updated Date - 2020-12-02T05:04:11+05:30 IST