వాళ్ళకు ప్రోత్సాహకాలు.. వీళ్లకు ఛీత్కారాలా?

ABN , First Publish Date - 2020-11-26T05:42:12+05:30 IST

టీచర్ల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. జయకర్‌, బీ గోపిమూర్తి బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

వాళ్ళకు ప్రోత్సాహకాలు..  వీళ్లకు ఛీత్కారాలా?

నిర్మాణ సామగ్రిని మోయడానికే హెచ్‌ఎంలు, టీచర్లు పరిమితమా? 

విద్యాధికారుల  ద్వంద్వ వైఖరి తగదు: యూటీఎఫ్‌ 

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 25: టీచర్ల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. జయకర్‌, బీ గోపిమూర్తి  బుధవారం  ఒక ప్రకటనలో ఆరోపించారు. జిల్లాలో తొలి విడత నాడు – నేడు కార్యక్రమం నిర్మాణ పనుల్లో   హెచ్‌ఎంలకు అప్పగించిన పర్యవేక్షణ బాధ్యతలకు బదులుగా భవన నిర్మాణ సామగ్రిని మోయడానికి, వాటిని కాపలా కాయడానికి పరిమితమయ్యారని ఆరోపించారు. దీనికితోడు  ఎంఈవో  మొదలు కుని విద్యాశాఖ ఉన్నతాధికారులతో తిట్టించుకోవాల్సి రావడం దారుణమన్నారు. సిమెంట్‌, ఇసుక, సామగ్రి పాఠశాలలకు సరఫరా కాకపోయినా, కార్మికులు సహకరించకపోయినా ప్రధానోపాధ్యాయులు తమ కుటుంబ బాధ్యతలను పక్కన బెట్టి పనిచేసిన వాస్తవాలు విద్యాధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సామగ్రి పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాలను పరిష్కరించకుండా హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, దుర్భాషలాడడం  దుర్మార్గమన్నారు. నాడు – నేడు ఇంజనీరింగ్‌ సిబ్బందికి, సీఆర్పీలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభు త్వం టీచర్లకు మొండిచేయి చూపడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. వేసవిలో నాడు – నేడు పనులకు హాజరైన టీచర్లకు  ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, ప్రాణాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం  ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా అధికారుల బెదిరింపులు మానుకుని టీచర్లకు సహకరించేలా సిబ్బందిని ఆదేశించాలని యుటీఎఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. 


హెచ్‌ఎంలు, టీచర్లంటే ఎంతో గౌరవం : డీఈవో రేణుక 

 జిల్లాలో ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టే చర్యలకు కాని, వారిని కించపర్చాలన్న ఉద్దేశ్యం కాని తనకు లేవని డీఈవో సీవీ రేణుక స్పష్టం చేశారు. టీచర్ల పట్ల తాను అభ్యంతరకర వ్యాఖ్యలను చేసినట్టు యూటీఎఫ్‌ జిల్లా నాయకుల ఆరోపణలపై డీఈవో బుధవారం వివరణ ఇచ్చారు. నాడు–నేడు పనులను ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంకిత భావంతో పర్యవేక్షిస్తున్నారని వివరించారు. రాష్ట్ర స్థాయిలో నాడు – నేడు నిర్మాణ పనుల ప్రగతిలో జిల్లా అగ్రస్థానంలో ఉండడానికి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంల సహకారమే కారణమన్నారు.  హెచ్‌ఎంలు, టీచర్ల పట్ల తనకు ఎనలేని గౌరవభావం  ఉందని డీఈవో తెలిపారు. 


Updated Date - 2020-11-26T05:42:12+05:30 IST