ఉండి ఎమ్మెల్యే, నేతల కట్టడి

ABN , First Publish Date - 2020-11-01T04:48:31+05:30 IST

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుతో సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం భయపడుతుందన్నారు.

ఉండి ఎమ్మెల్యే, నేతల కట్టడి

కాళ్ళ‌, అక్టోబరు 31:  ఉండి ఎమ్మెల్యే  మంతెన రామరాజుతో సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం భయపడుతుందన్నారు. అందుకే ఈ అక్రమ అరెస్టులని విమర్శించారు. పోలీసులు కూడా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాయడం దారుణమన్నారు. రాజధాని అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అడ్డాల శివరామరాజు, తోట ఏడుకొండలు, చెరుకుమిల్లి సొసైటీ అధ్యక్షుడు కలిదిండి శ్రీనగేష్‌రాజు, కట్టా రామచంద్రుడు, బూరాడ వెంకటకృష్ణ, సాగిరాజు సోమరాజు, జీవీ నాగేశ్వరరావు, ఆరేటి వెంకటరత్న ప్రసాద్‌, తదితరులను పోలీసులు నిర్బంధించారు.


అన్నం పెట్టే చేతులకు సంకెళ్లా..

ఆకివీడు‌, అక్టోబరు 31: అన్నం పెట్టే చేతులకు సంకెళ్లు వేయడం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ మండల అధ్యక్షుడు మోటుపల్లి రామ వరప్రసాద్‌ అన్నారు. జైలు భరోసా కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఆయనను గృహ నిర్బం ధం చేశారు. ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.


మాజీ ఎమ్మెల్యే బండారు హౌస్‌ అరెస్టు

నరసాపురం‌, అక్టోబరు 31: రాజధాని రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఛలో గుంటూరు జైల్‌ భరో కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు టీడీపీ నాయకులపై నిఘా పెట్టారు. రాయపేటలోని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నివాసం వద్ద శుక్రవారం అర్ధరాత్రే పోలీస్‌ పికేట్‌ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు బయటకు వెళ్లనివ్వ లేదు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది బండారు నివాసం వద్దే ఉన్నారు.


అమరావతి రాజధానిగా కొనసాగించాలి

ఉండి‌, అక్టోబరు 31: టీడీపీ యువనేత బురిడి రవిబాబును శనివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ఉద్యమాన్ని ఎవరూ అపలేరన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వదిలి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


ఆచంటలో టీడీపీ నాయకుల హౌస్‌ అరెస్టు

ఆచంట‌, అక్టోబరు 31: టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కేతా మీరయ్యతో పాటు దొంగ నాగార్జున, మన్నె రాధాకృష్ణ, జక్కంశెట్టి సత్యనారాయణను ఎస్‌ఐ సీహెచ్‌.రాజశేఖర్‌ హౌస్‌ అరెస్టు చేశారు.

Updated Date - 2020-11-01T04:48:31+05:30 IST